ఓటీటీలో 'యానిమల్' అన్ కట్ చూడలేమా?
సెన్సార్ లేని కంటెంట్ కావాలంటే నెట్ ఫ్లిక్స్ యాప్‌లోకి వెళ్లాలనేది యూత్ మైండ్ సెట్. ఇప్పుడు ఆ మైండ్ ని అదుపులోకి తెస్తోంది కేంద్ర ప్రభుత్వం.
By: Tupaki Desk | 18 Dec 2023 3:30 PM GMTసెన్సార్ లేని కంటెంట్ కావాలంటే నెట్ ఫ్లిక్స్ యాప్‌లోకి వెళ్లాలనేది యూత్ మైండ్ సెట్. ఇప్పుడు ఆ మైండ్ ని అదుపులోకి తెస్తోంది కేంద్ర ప్రభుత్వం. సమాచారప్రసారాల శాఖ పూనుకోవడంతో ఇప్పుడు అందరి మైండ్ సెట్ అవుతోంది. మారిన కొత్త నియమనిబంధనలు నిజంగానే యువతరానికి బిగ్ షాక్ నిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ అయితే దీనిపై చాలా గుర్రుగా ఉందనేది గుసగుస.
ఇటీవలే థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన యానిమల్ సినిమాని కట్స్ లేకుండా నెట్ ఫ్లిక్స్ లో వీక్షించాలని భావించిన వారికి ఇంతలోనే బిగ్ పంచ్ పడింది. మారిన రూల్స్ ప్రకారం సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ ఇచ్చాకే యానిమల్ ని ఓటీటీలో విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే సెన్సార్ కట్స్ చెప్పాకే ఈ సినిమాని వీక్షించే వీలుంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్ సెన్సార్ చేయని వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న సినీప్రియులకు ఇది తీవ్ర నిరాశ.
యానిమల్ అన్‌కట్ వెర్షన్ 3 గంటల 51 నిమిషాల నిడివిని కలిగి ఉంది. ఇది థియేటర్‌లలో విడుదలైన తర్వాత కనీసం 8 వారాల పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని అంచనా. అన్‌కట్ వెర్షన్ థియేట్రికల్ వెర్షన్ కంటే మరింత ఆకర్షణీయంగా కల్తీ లేనిదిగా ఉంటుందని ఆశించారు. కానీ సెన్సార్ గడపపై కట్స్ పడిపోవడం ఖాయమైంది. ఏ ఓటీటీ అయినా రా మెటీరియల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. సున్నితమైన కంటెంట్ పై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ధూమపానం, మద్యం సేవించే దృశ్యాలను ఆమోదించాలంటే చట్టబద్ధమైన ముందుజాగ్రత్త లేబుల్‌ను వేయడం తప్పనిసరి.
నెట్ ఫ్లిక్స్ కి ఇంతకాలం ముకుతాడు వేసిన వాళ్లు లేరు. కానీ ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వం పూనుకోవడంతో కొత్త రూల్స్ వచ్చాయి. దీంతో సీబీఎఫ్‌సి నిబంధనలను అనుసరించి కంటెంట్ పరంగా హద్దులు దాటకుండా వెళ్లాల్సి ఉంటుంది. మునుపటిలా యథేచ్ఛగా శృంగార సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలు లేదా మతపరమైన విషయాలను రెచ్చగొట్టడం.. స్త్రీలను అగౌరవపరిచే సన్నివేశాలు లేదా డైలాగులు యథాతథంగా ఉపయోగిస్తామంటే పంచ్ పడిపోతుంది. ఇకపై నెట్ ప్లిక్స్ కంటెంట్ కి దేశంలో కట్స్ పడిపోవడం ఖాయమైంది. విదేశాల్లోను వీక్షించాలంటే భారతీయ సెన్సార్ షిప్ తప్పనిసరి.