యానిమల్.. బాక్సాఫీస్ వద్ద టోటల్ ఎంత రావాలంటే
భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై దర్శక, నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు.
By: Tupaki Desk | 30 Nov 2023 4:49 AM GMTరణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా యానిమల్. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో థియేటర్స్ లోకి వస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై దర్శక, నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు. కచ్చితంగా మూవీతో సాలిడ్ హిట్ కొడతామని అంచనా వేస్తున్నారు.
ట్రైలర్ కి కూడా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ లో యానిమల్ సినిమాపై ప్రశంసలు కురిపించడం ఓ విధంగా కలిసొచ్చే అంశం అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాని 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. టి-సిరీస్ ఈ మూవీ నిర్మాణంలో మేజర్ పార్టనర్.
యానిమల్ మూవీ కేవలం నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే 70వ వంతు పెట్టుబడి తిరిగి వచ్చేసిందని తెలుస్తోంది. అందుకే థీయాట్రికల్ రిలీజ్ నేరుగా టి-సిరీస్ అన్ని రాష్ట్రాలలో డైరెక్ట్ గా రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. ఒక్క తెలుగులోనే దిల్ రాజు ఈ చిత్రం రైట్స్ సొంతం చేసుకొని విడుదల చేస్తున్నారు. 15 కోట్లకి తెలుగు రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
తెలుగులో కూడా మూవీ రిలీజ్ తర్వాత నిర్మాతకి ప్రాఫిట్ లో షేర్ ఇచ్చే విధంగానే ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమాకి ఉన్న హైప్ చూస్తుంటే ఏ మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మొదటి మూడు రోజుల్లోనే తెలుగులో బ్రేక్ ఈవెన్ అయిపోతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీకి ఉన్న క్రేజ్ బట్టి ప్రపంచవ్యాప్తంగా మినిమం 350 - 400 కోట్ల బిజినెస్ చేస్తుందని అంటున్నారు.
పాజిటివ్ టాక్ వస్తే మాత్రం యానిమల్ మూవీ కనీసం 700 కోట్ల గ్రాస్ లేదా అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవాలంటే హిందీ థియేట్రికల్స్ నుంచి నిర్మాతలకు 50 కోట్ల షేర్ వస్తే సరిపోతుంది. అది రెండు రోజుల్లోనే వచ్చేసే అవకాశం ఉంది. ఈ లెక్కలు చూసుకుంటే ఏ విధంగా చూసుకున్న యానిమల్ తో నిర్మాతకి లాభాలు పక్కా అని తెలుస్తోంది.