రాక్ స్టార్.. ఇకపై తెలుగులో డ్యూటీ చేస్తాడా?
సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్.
By: Tupaki Desk | 15 Oct 2024 5:30 PM GMTసౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్. సినిమా సక్సెస్‌లో తనదైన ముద్ర వేస్తున్న ఈ యంగ్ మ్యూజిక్ కంపోజర్.. రిలీజ్ కు ముందే తన పాటలతో కావాల్సినంత హైప్ తీసుకొస్తాడు. చార్ట్ బస్టర్ సాంగ్స్ తో పాటుగా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తోనూ అదరగొడుతున్నాడు. అయితే తెలుగులో సక్సెస్ సాధించడానికి అనిరుధ్ కు చాలా కాలమే పట్టింది.
తెలుగులో మొదటగా 'అజ్ఞాతవాసి' సినిమాకి సంగీతం సమకూర్చారు అనిరుధ్. ఇందులో సాంగ్స్ బాగున్నా సినిమా డిజాస్టర్ అయింది. దీంతో 'అరవింద సమేత' అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఆ తర్వాత ' 'గ్యాంగ్ లీడర్' 'జెర్సీ' చిత్రాలకు అద్భుతమైన పాటలు అందించినా, విజయం మాత్రం వరించలేదు. దీంతో అనిరుధ్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటే, మూవీ ఫ్లాప్ అయినట్లే అనే నెగిటివ్ సెంటిమెంట్ ప్రచారంలోకి వచ్చింది.
అయితే దాదాపు ఐదేళ్ల తర్వాత అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన 'దేవర 1' సినిమా ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనిరుద్ సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఫియర్ సాంగ్, చుట్టమల్లె, దావుడి, ఆయుధ పూజ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సాంగ్స్ లోని ట్యూన్ ను ఉపయోగించుకుంటూ కంపోజ్ చేసిన బీజీఎం కూడా హైలైట్ అయింది.
అదే సమయంలో అనిరుధ్ ఈ మధ్య వర్క్ చేసిన తమిళ చిత్రాలు తీవ్ర నిరాశ పరిచాయి. కమల్ హాసన్ 'ఇండియన్ 2'.. రజనీకాంత్ 'వేట్టయన్' సినిమాలకు ఆయన సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. సాంగ్స్ కూడా ప్రభావం చూపించలేకపోయాయి. 'మనసిలాయో' పాట ట్రెండ్ అయినప్పటికీ, అది తలైవా సినిమా సక్సెస్ కి హెల్ప్ అవ్వలేదు. దీంతో రాక్ స్టార్ రాబోయే చిత్రాలకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో అనే చర్చలు మొదలయ్యాయి.
ఇన్నాళ్ళూ తమిళ హీరోలకు అనిరుధ్ బెస్ట్ మ్యూజిక్ అందిస్తాడని, కేవలం తమిళ చిత్రాలకు మాత్రమే డ్యూటీ చేస్తాడనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు 'భారతీయుడు 2' 'వేట్టయన్' చిత్రాలు బాగా డిజప్పాయింట్ చేశాయి. అదే సమయంలో తెలుగు సినిమా 'దేవర' కు ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో అనిరుధ్ ఇకపై తెలుగు చిత్రాలకు డ్యూటీ చేస్తాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'దేవర' ఇచ్చిన ధైర్యంతో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆయన వద్దకు చేరుతున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే తెలుగులో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD 12' చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అలానే దీని కంటే ముందు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గౌతమ్ తీస్తున్న రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ 'మ్యాజిక్' కు సంగీతం సమకూరుస్తున్నారు. లేటెస్టుగా నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ప్రారంభమైన చిత్రానికి కూడా అనిరుధ్ నే సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. చూస్తుంటే అతను రానున్న రోజుల్లో తెలుగులోనూ బిజీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు చిత్రాలతో కలిపి అనిరుధ్ చేతిలో ప్రస్తుతానికి డజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళ్ లో అజిత్ కుమార్ 'విదా ముయార్చి', రజనీకాంత్ 'కూలీ', విజయ్ Thalapathy69, కమల్ హాసన్ 'భారతీయుడు 3', శివ కార్తికేయన్ SK23, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, కెవిన్ సినిమాలతో పాటుగా హిందీలో షారుఖ్ ఖాన్ 'కింగ్' చిత్రానికి మ్యూజిక్ సమకూరుస్తున్నాడు. ఇన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి, సంగీత ప్రపంచంలో ఇంకొన్నాళ్ళు అనిరుధ్ రవిచందర్ హవానే కొనసాగేలా కనిపిస్తోంది.