సినిమా రిజల్ట్ ముందే తేల్చేసిన అనిరుధ్
చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు తీసే మగిల్ తిరుమణికి ఏరికోరి అజిత్ అవకాశమిస్తే అతను దీన్ని పూర్తిగా వృథా చేశాడు.
By: Tupaki Desk | 7 Feb 2025 5:09 AM GMTవిడాముయర్చి.. తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ నటించిన కొత్త చిత్రం. తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదలైంది. రెండు భాషల్లోనూ ఒకేసారి, ఈ రోజు రిలీజ్ చేశారు. నిజానికి ఇది సంక్రాంతికి రావాల్సిన సినిమా. కానీ ఇది హాలీవుడ్ మూవీ ‘బ్రేక్ డౌన్’కు ఫ్రీమేక్ కావడం.. ఆ విషయం గుర్తించిన హాలీవుడ్ నిర్మాణ సంస్థ లీగల్ నోటీసులు పంపించడం.. ఈ గొడవ పుణ్యమా అని సంక్రాంతికి రిలీజ్ ఆగిపోయింది. ఇరు వర్గాలకు ఏం సెటిల్మెంట్ జరిగిందో ఏమో కానీ.. ఈ రోజు అజిత్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఐతే ఎన్నో ఆశలు, అంచనాలతో థియేటర్లలోకి అడుగు పెట్టిన అజిత్ ఫ్యాన్స్‌కు పెద్ద షాకే తగిలింది. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు తీసే మగిల్ తిరుమణికి ఏరికోరి అజిత్ అవకాశమిస్తే అతను దీన్ని పూర్తిగా వృథా చేశాడు. ఎప్పుడో 28 ఏళ్ల ముందు వచ్చిన హాలీవుడ్ మూవీని కాపీ కొట్టి ఒక సాధారణమైన థ్రిల్లర్ మూవీని అందించాడు.
‘బ్రేక్ డౌన్’ ఆ రోజుల్లో గొప్ప థ్రిల్లర్ అనిపించుకుందేమో కానీ.. ప్రస్తుత రోజుల్లో చూస్తే అది సాధారణంగా అనిపిస్తుంది. ఆ కథకు ట్రెండీ స్క్రీన్ ప్లే కూడా జోడించలేకపోయాడు మగిల్. మలయాళం నుంచి అద్భుతమైన థ్రిల్లర్లు ఓటీటీలో అందుబాటులో ఉన్న ప్రస్తుత రోజుల్లో.. ఇలాంటి సాధారణ థ్రిల్లర్లు ప్రేక్షకులకు ఏం కిక్కు ఇస్తాయి. రెండున్నర గంటలకు పైగా నిడివితో సాగిన ఈ సినిమాలో హై మూమెంట్స్ ఏమీ లేవు. కనీసం అజిత్ చేసే మాస్ సినిమాల్లో ఫ్యాన్సును మెప్పించే అంశాలైనా ఉంటాయి. కానీ ఇందులో అవీ లేవు. దీంతో వాళ్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఐతే ఈ సినిమా ఫలితమేంటో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ముందే తేల్చేశాడంటూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు అజిత్ ఫ్యాన్స్. తాను పని చేసిన ప్రతి పెద్ద సినిమాకు రిలీజ్ ముంగిట ఎమోజీ రివ్యూ ఇస్తాడు అనిరుధ్ సోషల్ మీడియాలో. అతను పెట్టే ఫైర్ ఎమోజీలతో అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. ‘విడాముయర్చి’కి అసలు అలాంటి పోస్టేదీ పెట్టకపోవడంతో ఈ సినిమా రిజల్ట్ మీద సందేహాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అనుమానాలే నిజమయ్యాయి.