Begin typing your search above and press return to search.

అంజ‌లి కెరీర్‌కి ఇది ప్ల‌స్సా మైన‌స్సా?

ఇప్పుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోని `గేమ్ ఛేంజ‌ర్`పైనే అంజ‌లి చాలా ఆశ‌లు పెట్టుకుంది. ఈ సినిమా త‌న ఫేట్ మారుస్తుంద‌ని భావిస్తోంది.

By:  Tupaki Desk   |   4 Jan 2025 5:30 AM GMT
అంజ‌లి కెరీర్‌కి ఇది ప్ల‌స్సా మైన‌స్సా?
X

కెరీర్ ప్రారంభంలో కంటెంట్ ఉన్న అనువాద‌ సినిమాల‌తో మెప్పించింది తెలుగ‌మ్మాయి అంజ‌లి. త‌మిళంలో పెద్ద న‌టిగా నిరూపించి తెలుగు ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింది. షాపింగ్ మాల్, జ‌ర్నీ లాంటి రియ‌లిస్టిక్ ఎప్రోచ్ ఉన్న సినిమాలతో త‌మిళంలో హిట్లు కొట్టి వాటి అనువాదాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఆ సినిమాల్లో అంజ‌లి న‌ట‌న‌కు మంచి అభిమానులేర్ప‌డ్డారు. ఆ త‌ర్వాత `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` లాంటి పెద్ద సినిమాలో డీసెంట్ పాత్ర‌లో న‌టించి మెప్పించింది.

గీతాంజ‌లి లాంటి నాయికా ప్ర‌ధాన చిత్రంతోను అంజ‌లి న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. కానీ ఈ సినిమా సీక్వెల్ `గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది` ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. `గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి`లో బోల్డ్ పాత్ర‌లో న‌టించినా అది కూడా క‌లిసి రాలేదు. ఇప్పుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోని `గేమ్ ఛేంజ‌ర్`పైనే అంజ‌లి చాలా ఆశ‌లు పెట్టుకుంది. ఈ సినిమా త‌న ఫేట్ మారుస్తుంద‌ని భావిస్తోంది.

సినిమాలో రామ్ చ‌ర‌ణ్ తండ్రి పాత్ర‌ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో అంజ‌లి క‌నిపిస్తుంది. ఐఏఎస్ అధికారికి తండ్రి అయిన‌ అప్ప‌న్న (చ‌ర‌ణ్) కు భార్య‌గా అంజ‌లి క‌నిపిస్తుంది. ప్ర‌స్తుత పొలిటిక‌ల్ సిస్ట‌మ్ తో పోరాడే సిన్సియ‌ర్ ఐఏఎస్ అధికారి త‌ల్లిగా అంజ‌లి న‌టించింది. ఒక భార్య‌గా, త‌ల్లిగా న‌టించేందుకు స్కోప్ ఉన్న పాత్ర‌లో అవ‌కాశం ద‌క్కింద‌ని అంజ‌లి ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. శంక‌ర్ లాంటి పెద్ద ద‌ర్శ‌కుడు త‌న కెరీర్‌ గేమ్ ని ఛేంజ్ చేస్తున్నార‌ని ఆనందం వ్య‌క్తం చేస్తోంది.

అయితే చియాన్ విక్ర‌మ్ `అప‌రిచితుడు` సినిమాలో న‌టించేప్పుడు స‌దా కెరీర్ రేంజ్ అమాంతం మారిపోతుంద‌ని అంతా భావించారు. ఆ చిత్రంలో స‌దా పాత్ర‌ను శంక‌ర్ బాగానే ఎలివేట్ చేసారు.. కానీ ఆ త‌ర్వాత అనుకున్న‌దేమీ జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు అంజ‌లికి అలా కాకూడ‌ద‌నే అభిమానులు ఆశిస్తున్నారు. గేమ్ ఛేంజ‌ర్ సినిమాలో కియ‌రా అద్వాణీ గ్లామ‌ర‌స్ పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

డ‌బుల్ ధ‌మాకా!

ఆస‌క్తిక‌రంగా ఈ సంక్రాంతి బ‌రిలో అంజ‌లి న‌టించిన రెండు సినిమాలు ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతున్నాయి. త‌మిళంలో విశాల్ - అంజ‌లి న‌టించిన `మ‌ద‌గ‌జ‌రాజా` దాదాపు 13 ఏళ్ల త‌ర‌వాత విడుద‌ల‌వుతోంది. ఈ సినిమా స‌డెన్ గా సంక్రాంతి బ‌రిలోకి వ‌చ్చింది. అయితే విశాల్ లాంటి మాస్ హీరో సినిమా కాబ‌ట్టి దీనిపై కొంత ఆస‌క్తి నెల‌కొంది. `గేమ్ ఛేంజ‌ర్` ఇత‌ర త‌మిళ సినిమాల‌తోను సంక్రాంతి బ‌రిలో పోటీప‌డ‌నుంది. త‌ళా అజిత్ `విదాముయార్చి` వాయిదా ప‌డ‌టంతో గేమ్ ఛేంజ‌ర్ కి, ఇత‌ర సినిమాల‌కు అడ్వాంటేజ్ గా మారింది.