Begin typing your search above and press return to search.

హాఫ్ సెంచరీ కొట్టిన తెలుగు బ్యూటీ!

ఆంధ్రప్రదేశ్ లోని రాజోల్ కు చెందిన పదహారణాల తెలుగందం అంజలి.. 2006లో ‘ఫోటో’ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది

By:  Tupaki Desk   |   26 Feb 2024 11:54 AM GMT
హాఫ్ సెంచరీ కొట్టిన తెలుగు బ్యూటీ!
X

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అందం, అభినయం, ప్రతిభతో పాటుగా ఆవకాయంత అదృష్టం కూడా కలిసొస్తేనే అవకాశాలు అందుతాయి. దానికి సక్సెస్ తోడైతేనే కొంతకాలం స్టార్ హీరోయిన్ గా రాణించగలుగుతారు. అదే బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులు వస్తే మాత్రం ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ కెరీర్ అయినా డౌన్ అయిపోవాల్సిందే. అలాంటి చిత్ర పరిశ్రమలో 18 ఏళ్ల లాంగ్ కెరీర్ కొనసాగించింది.. సిల్వర్ జూబ్లీ 50 సినిమాల మైలురాయికి చేరువైంది అందాల అంజలి.

ఆంధ్రప్రదేశ్ లోని రాజోల్ కు చెందిన పదహారణాల తెలుగందం అంజలి.. 2006లో ‘ఫోటో’ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో పక్క ఇండస్ట్రీలకు చెక్కేసింది. తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. షాపింగ్ మాల్, గ్యాంబ్లర్, జర్నీ లాంటి చిత్రాలతో కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇవే సినిమాలు తెలుగులోకి డబ్ కావడంతో, మళ్లీ టాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టి ఆమెపై పడింది.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అంజలి. అప్పటి నుంచి పక్కింటి అమ్మాయి ఇమేజ్ తోనే తెలుగులో కూడా బిజీ హీరోయిన్ గా మారింది. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజా రవితేజ లాంటి అగ్ర హీరోల సరసన నటించే ఛాన్సులు అందుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇదే క్రమంలో స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడటమే కాదు, కొన్ని వెబ్ సిరీస్ లలోనూ నటించింది.

37 ఏళ్ల వయసులోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న అంజలి.. ఇప్పుడు మూడు క్రేజీ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ''గేమ్ ఛేంజర్'' సినిమాలో అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో చెర్రీ రెండు పాత్రలు పోషిస్తుండగా.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫాదర్ రోల్ కి జోడీగా కనిపించనుంది. ఇది ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టే అవకాశం వుంది.

దీంతో పాటుగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రంలో ఒక హీరోయిన్ గా అంజలి నటిస్తోంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆమె ఒక వేశ్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటి వరకూ ఎన్నో రకాల పాత్రలతో అలరించిన సహజ నటి.. ఈ ఛాలెంజింగ్ రోల్ లోనూ మెప్పిస్తుందని, ఇది ఆమె కెరీర్ లో గుర్తుండి పోయే మంచి క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలుస్తుందని ఇన్సైడ్ టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారు.

ఇక అంజ‌లి ప్రధాన పాత్రలో ''గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది" అనే హార‌ర్ కామెడీ మూవీలో నటిస్తోంది. ఇది 2014లో వచ్చిన 'గీతాంజ‌లి' సినిమాకి సీక్వెల్. అంతేకాదు ఆమె కెరీర్ లో మైల్ స్టోన్ 50వ మూవీ. రచయిత కోన వెంక‌ట్ క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో విడుదల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఏదేమైనా ఇండస్ట్రీకి రోజుకో కొత్త భామ పరిచయయ్యే ఈ రోజుల్లో, హీరోయిన్ గా అంజలి హాఫ్ సెంచరీ సినిమాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఈ కోనసీమ బ్యూటీ రానున్న రోజుల్లో ఇంకెన్ని మైలురాళ్ళు అధిగమిస్తుందో చూడాలి.