Begin typing your search above and press return to search.

జై హనుమాన్‌: ఆంజనేయుడిగా అజిత్?

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

By:  Tupaki Desk   |   26 July 2024 11:30 AM GMT
జై హనుమాన్‌: ఆంజనేయుడిగా అజిత్?
X

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఇండియన్ సూపర్‌ హీరో మూవీ 'హనుమాన్‌'. ఇది బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ గా ''జై హనుమాన్‌'' అనే సినిమా తీయనున్నట్లు దర్శకుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలోనే ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలు పెట్టారు. వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని అనుకున్నారు కానీ, లీడ్ రోల్ ప్లే చేసే స్టార్ హీరో దొరకని కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సూపర్‌ హీరో కథాంశానికి పురాణ ఇతిహాసాలను నేపథ్యాన్ని జోడించి 'హనుమాన్‌' చిత్రాన్ని రూపొందించారు. క్లైమాక్స్ లో 'శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి?’ అనే ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానంగా 'జై హనుమాన్‌' సినిమా రూపుదిద్దుకోనుంది. ఇందులో ఆంజనేయ స్వామి పాత్ర ప్రధానంగా ఉండనుంది. హనుమాన్ క్యారక్టర్ లో ఒక స్టార్ హీరో నటిస్తారని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా కీలకమైన ఆ పాత్రలో నటించే సూపర్ స్టార్ ను వెతికే పనిలో ఉన్నారు.

ఆంజనేయుడి పాత్రకి చిరంజీవి లేదా రామ్ చరణ్ అయితే బాగుంటుందని ఇటీవల 'హనుమాన్' నిర్మాత నిరంజన్ రెడ్డి భార్య ఓ ఇంటర్వ్యూలో అన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం చిరు లాంటి మెగాస్టార్ తోనే ఆ క్యారక్టర్ చేయించాలని అనుకున్నారు. స్వతహాగా హనుమాన్ భక్తుడు కావడంతో ఆయన చేస్తేనే మంచి ఇంపాక్ట్ ఉంటుందని భావించారట. కానీ చిరుకి ఉన్న ఇతర కమిట్ మెంట్స్ ని బట్టి చూస్తే, అది జరగకపోవచ్చు అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఆయన రేంజ్ ఉన్న మరో స్టార్ హీరోని తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో అజిత్ కుమార్ అయితే ఎలా ఉంటుందో అనే ఆలోచన కూడా చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.

అజిత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్నారు. ఒకప్పుడు తెలుగులో నేరుగా సినిమాలు తీసిన ఆయన, ఈ మధ్యకాలంలో డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లని అలాంటి అగ్ర హీరో అయితేనే 'జై హనుమాన్‌'లో ఆంజనేయ స్వామి పాత్రకు పరిపూర్ణత వస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ప్రశాంత్ వర్మ త్వరలోనే అజిత్ ను కలిసి స్టోరీ నేరేట్ చేస్తారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే నిజమై అజిత్ ఓకే అంటే మాత్రం.. ఈ సినిమా స్థాయి మరింత పెరిగే అవకాశముంది. తెలుగుతో పాటుగా తమిళంలోనూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఉంటుంది.

ఇదిలా ఉంటే 'హనుమాన్' బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, దీనికి కొనసాగింపుగా ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాబోతున్న 'జై హనుమాన్' అప్‌డేట్స్‌ కోసం సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య ‘‘వెల్‌కమ్‌ టు అంజనాద్రి 2.0’’ అంటూ ప్రశాంత్‌ వర్మ ఓ స్పెషల్‌ గ్లింప్స్‌ పంచుకున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఆంజనేయుడి పాత్రకు స్టార్ హీరో కుదిరి, దర్శకుడి ఇతర కమిట్మెంట్స్ పూర్తైన తర్వాత ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.