Begin typing your search above and press return to search.

త‌లైవి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సినంత నేరం చేశారా?

తన సినిమా అన్నపూర్ణి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వచ్చిన కొద్ది రోజులకు చిత్ర క‌థానాయిక న‌య‌న‌తార‌ క్షమాపణలు చెప్పారు

By:  Tupaki Desk   |   19 Jan 2024 5:58 AM GMT
త‌లైవి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సినంత నేరం చేశారా?
X

తన సినిమా అన్నపూర్ణి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వచ్చిన కొద్ది రోజులకు చిత్ర క‌థానాయిక న‌య‌న‌తార‌ క్షమాపణలు చెప్పారు. గురువారం అర్థరాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో త‌లైవి న‌య‌న‌తార స్పందించారు. నెట్‌ఫ్లిక్స్‌లో అన్న‌పూర్ణి చిత్రం విడుదలైన తర్వాత బయటపడిన వివాదంపై త‌న స్పంద‌న తెలియ‌జేస్తూ ఒక ప్రకటనను అధికారికంగా విడుదల చేసారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు కానీ తన టీమ్‌కు కానీ లేద‌ని నయనతార ఈ సంద‌ర్భంగా చెప్పారు. అన్న‌పూర్ణి చిత్రంపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఇంత‌లోనే నెట్‌ఫ్లిక్స్ నుండి దీనిని తొల‌గించార‌ని క‌థ‌నాలు వెలువ‌డిన కొన్ని రోజుల తర్వాత న‌య‌న్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.

''సానుకూల సందేశాన్ని తెలియ‌జేయ‌డానికి మా హృదయపూర్వక ప్రయత్నమిది.. మేము అనుకోకుండా మీకు బాధ కలిగించి ఉండవచ్చు. OTT ప్లాట్‌ఫారమ్ నుండి గతంలో సెన్సార్ అయ్యి, థియేటర్‌లలో ప్రదర్శిత‌మైన సినిమాని తొల‌గిస్తార‌నేది మేం ఊహించలేదు. నా బృందం నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సమస్య తాలూకా ఘ‌ర్ష‌ణ‌ను మేము అర్థం చేసుకున్నాము. భగవంతుడిని పూర్తిగా నమ్మే వ్యక్తిగా.. దేశంలోని దేవాలయాలను తరచుగా సందర్శించే వ్యక్తిగా, నేను ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయ‌లేదు. మేము ఎవరి భావాలను కించ‌ప‌రిచినట్టు భావించినా వారికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను''అని అన్నారు. 'అన్నపూర్ణి' వెనుక ఉద్దేశం గురించి ప్ర‌స్థావిస్తూ.. ఒక‌రిని ఉద్ధరించడం, ప్రేరేపించడం, బాధ కలిగించడం కాదు.. గత రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో నా ప్రయాణం ఏకైక ఉద్దేశ్యంతో మార్గనిర్దేశం చేయబడింది. అది సానుకూలతను వ్యాప్తి చేయడం.. ఒకరి నుండి మరొకరు నేర్చుకునేలా చేయడం మాత్ర‌మేన‌ని నయతార సుదీర్ఘ వివ‌ర‌ణ‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. తాను క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డ‌మే గాక‌, జై శ్రీ‌రామ్ అంటూ హిందూత్వ‌కు అనుకూలంగా న‌య‌న‌తార నినాదాలివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. స్వ‌త‌హాగానే నాయ‌న‌తార క్రిస్టియన్ మ‌త‌స్తులు అయినా కానీ, గ‌తంలో ప‌లుమార్లు తిరుమ‌లేశుని సంద‌ర్శించారు. హిందూ దేవ‌త‌ల‌ను ఆరాధించ‌డం తెలిసిన‌దే. ఇప్పుడ న‌య‌న్ శ్రీ‌రాముని స్థుతించ‌డం మ‌తాల‌పై త‌న ఆలోచ‌న‌ల‌ను, మ‌నోజ్ఞ‌త‌ను బ‌హిర్గ‌తం చేస్తోంది.

అన్నపూర్ణి వివాదం వెన‌క కార‌ణం?

నయనతార అన్నపూర్ణి అనే టైటిల్ రోల్ లో న‌టించ‌గా, ఈ పాత్ర‌కు అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. అయితే భారతదేశంలో అగ్రశ్రేణి చెఫ్ కావాలనుకునే సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళగా న‌య‌న్ న‌టించ‌డం కొంద‌రి మ‌నోభావాల‌ను దెబ్బ తీసింది. ఆశించిన‌ది సాధించుకునే క్ర‌మంలో అడ్డంకులు.. ఆమె సనాతన కుటుంబ విశ్వాసాలతో స‌మ‌స్య‌లు.. ఈ సినిమాలో ఆమె కష్టాన్ని తెలిపే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అంతేకాదు.. న‌య‌న్ క్లాస్‌మేట్ మాంసం తినడానికి ప్రేరేపించే స‌న్నివేశం వివాదాస్ప‌దం అయింది. ఆమెను తినమని ఒప్పించే ప్రయత్నంలో, క్లాస్‌మేట్ రాముడి గురించి ప్రస్తావిస్తూ, అతడు (శ్రీ‌రామ్) కూడా మాంసం తినేవాడని.. అది పాపం కాదని పేర్కొన‌డం మ‌నోభావాల‌ను దెబ్బ తీసింది.

అన్న‌పూర్ణి చిత్రం హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపిస్తూ శివసేన మాజీ నాయకుడు రమేష్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ట్విటర్ వేదిక‌గా న‌య‌న్ త‌న సినిమాతో హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ తీసార‌ని ఆరోపించారు. ఈ చిత్రం చివరకు నెట్‌ఫ్లిక్స్ నుండి తొల‌గించ‌బ‌డింది.