50 వసంతాలకు చేరువలో అన్నపూర్ణ స్టూడియోస్
ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ 'స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ' అనే కొత్త సదుపాయంతో ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 14 Aug 2023 4:38 AM GMTవందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో దశాబ్ధాల పాటు మనుగడ సాగించిన ఫిలిం స్టూడియోస్ మనకు ఉన్నాయి. బాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిలింస్ సంస్థానం ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయింది. రామానాయుడు స్టూడియోస్ ... సారథి స్టూడియోస్ దిగ్విజయంగా 50 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. ఇప్పుడు అలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది అన్నపూర్ణ స్టూడియోస్.
13 ఆగస్ట్ 1975 లో తెలుగు సినిమాకు పునాది రాయిగా నిలిచిన అన్నపూర్ణ స్టూడియోస్ శంకుస్థాపన జరిగింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో. టాలీవుడ్ లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు దీని వ్యవస్థాపకుడు. 1976లో అప్పటి భారత రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ ఈ స్టూడియోను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇక వెనుదిరిగి చూడలేదు. హైదరాబాద్‌లో ఉన్న స్టూడియో దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందింది. అధునాతన సాంకేతికతకు ఫిలింస్కూల్ వంటి ఏర్పాట్లకు అంకురార్పణ చేసిన స్టూడియో ఇది. అవుట్‌డోర్ సెట్‌లు, ఇండోర్ అంతస్తులు, ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్ మొదలైన సేవలను ఈ స్టూడియో అందిస్తోంది.
ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ 'స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ' అనే కొత్త సదుపాయంతో ముందుకు వచ్చింది. ఇక్కడ దర్శకనిర్మాతలు రచయితలకు ఎటువంటి పరిమితులు లేకుండా కథలను చెప్పడానికి అనుమతించే ప్రత్యేక విభాగం. కొత్త సాంకేతికత సంక్లిష్టమైన ఫోటోరియలిస్టిక్ వర్చువల్ స్థానాలను రియల్ టైమ్ రెండరింగ్‌కు సహకరిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ అధునాతన మౌళిక సదుపాయాలు .. సేవలతో అంతర్జాతీయ స్థాయి స్టూడియోగా అవతరించింది. మరో రెండేళ్లలో అన్నపూర్ణ స్టూడియోస్ 50 వసంతాలు పూర్తి చేసుకోనుంది.
రామానాయుడు స్టూడియోస్- సారథి స్టూడియోస్- శబ్ధాలయా స్టూడియోస్ సహా అన్నపూర్ణ స్టూడియోస్ దశాబ్ధాల పాటు మనుగడ సాగించడమే గాక నేడు గొప్ప యోగ్యతను స్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ స్థాపించిన పద్మాలయా స్టూడియోస్ మనుగడను కోల్పోవడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ ఔటర్ లో ఒక ఫిలింస్టూడియో నిర్మాణాన్ని ప్రారంభించారు.