అన్నపూర్ణ స్టూడియోస్... పేరుకు మాత్రమే గొప్ప!
మొదట 'శివ' సినిమా ను రీ రిలీజ్ చేయాలని అన్నపూర్ణ స్టూడియోస్ వారు భావించారు. కానీ శివ సినిమా ను ఇప్పటి వరకు డిజిటల్ గా మార్చలేదట.
By: Tupaki Desk | 14 Aug 2023 8:22 AM GMTతెలుగు సినిమా చరిత్రలో అన్నపూర్ణ స్టూడియోస్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది అనడంలో సందేహం లేదు. టాలీవుడ్ లెజెండ్రీ స్టార్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించిన అన్నపూర్ణ స్టూడియోస్ కి అర్ధ శతాబ్దం కాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలలో అన్నపూర్ణ స్టూడియో కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు.
ఫిల్మ్ స్టూడియో తో పాటు యాక్టింగ్ స్కూల్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం స్టూడియోలు, భారీ ఔట్ డోర్ మరియు ఇండోర్ స్టూడియోలు అన్నపూర్ణ స్టూడియో లో నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ప్రతి రోజు పదుల సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమాల షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నుండి వచ్చిన విషయం తెల్సిందే.
అన్నపూర్ణ స్టూడియోస్ నుండి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో 'శివ' సినిమా ఒకటి. రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమా అయినా కూడా శివ సినిమా ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలవడంతో పాటు నాగార్జునను స్టార్ హీరోగా నిలిపింది. శివ సినిమా తర్వాత తెలుగు సినిమా స్టైల్ పూర్తిగా మారింది. పూర్తిగా కొత్త పంథాలో కమర్షియల్ సినిమాలు చేయడం మొదలు పెట్టారు.
ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ సందడి కనిపిస్తోంది. మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ ఇలా చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఈసారి నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమా ను రీ రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొదట 'శివ' సినిమా ను రీ రిలీజ్ చేయాలని అన్నపూర్ణ స్టూడియోస్ వారు భావించారు. కానీ శివ సినిమా ను ఇప్పటి వరకు డిజిటల్ గా మార్చలేదట. రీల్ ఫార్మట్ లోనే ఉన్న శివ సినిమాను ఇప్పుడు డిజిటల్ కి మార్చేందుకు ప్రయత్నించగా చాలా వరకు రీల్ పాడవ్వడంతో దాన్ని సరిదిద్దేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
శివ సినిమా ను క్వాలిటీతో మార్చాలి అంటే చాలా కాలం పడుతుందని.. అంతే కాకుండా చాలా ఖర్చుతో కూడుకున్న పనిగా సమాచారం అందుతోంది. అందుకే ఇప్పటికిప్పుడు శివ సినిమాను రీ రిలీజ్ చేయలేమని అన్నపూర్ణ స్టూడియోస్ వారు తేల్చి చెప్పారట.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ తీరుపై స్వయంగా అక్కినేని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో పెద్ద స్టూడియోగా, గొప్ప స్టూడియోగా పేరు తెచ్చుకున్న సంస్థ తమ సినిమాలను కాపాడుకోలేక పోయిందా... ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇప్పటికి కూడా డిజిటల్ ఫార్మట్ లోకి తీసుకు రాలేక పోవడం విడ్డూరం అంటూ అభిమానులు పెదవి విరుస్తున్నారు.