ఎన్నటికీ ఒరగని శిఖరం ANR శతజయంతి ఉత్సవాలు
ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.
By: Tupaki Desk | 20 Sep 2023 5:16 AM GMTలెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు భారతీయ సినిమా ఐకాన్ గా ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారు. ఆయన జీవితం పూర్తిగా తెలుగు సినీపరిశ్రమకు అంకితం. నేడు హైదరాబాద్ లో చిత్రపరిశ్రమ అభివృద్ధిలో ఆయన పాత్ర అనన్య సామాన్యం. 20 సెప్టెంబర్ లెజెండ్ ఏఎన్నార్ 100వ జయంతి (పుట్టినరోజు) సందర్భంగా అక్కినేని కుటుంబం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆయన పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించి ANR శత జయంతి వేడుకలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏడాది పొడవునా అనేక గొప్ప కార్యక్రమాలను అక్కినేని కుటుంబం ప్లాన్ చేసింది.
వందేళ్లు పైబడిన భారతీయ సినీచరిత్రలో 90ఏళ్ల చరిత్ర టాలీవుడ్ కి ఉంది. తెలుగు సినిమాకి ఏఎన్ఆర్ చేసిన సేవ ఎనలేనిది. ధర్మపత్ని (1941) సినిమాతో కెరీర్ ని ప్రారంభించిన ఆయన ఏడు దశాబ్దాల పాటు కెరీర్ ని అజేయంగా సాగించారు. ANR ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించారు. రొమాంటిక్ హీరోగా ప్రేమకథా చిత్రాల కథానాయకుడిగా మహిళా అభిమానుల గుండెల్లో నిలిచి ఉన్నారు. నటుడిగా అతని బహుముఖ ప్రజ్ఞ అసాధారణం.
కొన్ని గొప్ప నాటకాల నుండి రొమాంటిక్ క్లాసిక్‌ల వరకు విస్తృతమైన పాత్రలలో రాణించిన మేటి నటుడాయన. (1953)లో దేవదాసు అనే విషాద పాత్రను ఆయన పోషించిన తీరు భారతీయ సినిమా చరిత్రలో ఒక చిరస్మరణీయ ప్రదర్శనగా నిలిచింది. మాయాబజార్ (1957) లాంటి ఫాంటసీ ఇతిహాసంలో గొప్ప నటనతో ఆకట్టుకున్నారు ఏఎన్నార్. ప్రేమ్ నగర్ (1971) తో ప్రేమకథల్లో గొప్ప కథానాయకుడిగా మెప్పించారు.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దివంగత నటుడు ఏఎన్నార్ సినిమాలు తరచుగా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నెలకొల్పాయి. పరిశ్రమకు ఆయన చేసిన సేవల కారణంగా, అతను 1991లో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఇది భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం. భారతదేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ 2011లో లభించింది. ఫిలింఫేర్ లు సహా ఎన్నో అవార్డులను ఏఎన్నార్ అందుకున్నాడు. తెలుగు సినిమాకి ఆయన చేసిన విశిష్ట సేవలకు నంది అవార్డులు కూడా దక్కాయి.
ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. 1975లో ల్యాండ్‌మార్క్ అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించారు. ఇది చలనచిత్ర నిర్మాణానికి అత్యాధునిక సౌకర్యాలను అందించిన గొప్ప స్టూడియో. నేటికీ ఈ స్టూడియో దినదినాభివృద్ది చెందుతోంది. లెజెండరీ నటుడు నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి సినిమాలు నిర్మించారు. పరిశ్రమ అభివృద్ధికి స్టూడియో దోహదపడింది. అలాగే అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అత్యుత్తమ ప్రతిభను పెంపొందించడం ద్వారా చిత్ర పరిశ్రమకు గొప్ప సహకారం అందిస్తోంది.
అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ప్రతిభకు ప్రోత్సాహం అందించడం మరో మేలిమలుపు. ఇది ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి, సినిమాలను ప్రచారం చేసే సంస్థ. అలాగే అక్కినేని నాగేశ్వరరావు అంతర్జాతీయ పురస్కారాలను పలువురు ప్రతిభావంతులకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. అక్కినేని లెగసీని విజయవంతంగా ముందుకు నడిపించిన కింగ్ నాగార్జున ఇప్పుడు తన వారసులను పరిశ్రమకు అంకితమిచ్చారు. నాగ చైతన్య, అఖిల్ నటులుగా రాణిస్తున్నారు. ఇతర కుటుంబ సభ్యులు అక్కినేని వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. నేడు అక్కినేని శతజయంతి సందర్భంగా ఈ స్పెషల్.