ఇంటిపేరు విషయంలో హెల్ప్ చేయమంటున్న అన్షు
మజాకా ప్రమోషన్స్ లో భాగంగా అన్షు తన ఇంటిపేరు గురించి రెస్పాండ్ అయింది.
By: Tupaki Desk | 8 Feb 2025 5:30 PM GMTటాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో ప్రేమ కథలు రాగా అందులో మన్మథుడు సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా రిలీజై ఇప్పటికే 20 ఏళ్లు పూర్తవుతున్నా ఆడియన్స్ ఆ సినిమా వస్తుందంటే ఎంతో ఇష్టంగా టీవీలకు అతుక్కునిపోతారు. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మథుడు సినిమాకు అప్పట్లో ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన మన్మథుడు సినిమా నాగార్జున కెరీర్లో వచ్చిన క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో సోనాలీ బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించారు. మన్మథుడు సినిమాలో తెలుగు ఆడియన్స్ గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్నదంటే అన్షునే. సినిమాలో తన పాత్ర కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది.
మన్మథుడు తర్వాత అన్షు ప్రభాస్ తో కలిసి రాఘవేంద్ర సినిమాలో నటించింది. ఆ తర్వాత మిస్సమ్మ మూవీలో గెస్ట్ పాత్ర చేసింది. అటుపై అన్షు మళ్లీ సినిమాల్లో కనిపించింది లేదు. లండన్ వెళ్లిపోయి అక్కడి బిజినెస్ మ్యాన్ సచిన్ సగ్గార్ ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైపోయింది. ఇప్పుడు అన్షుకు బాబు, పాప కూడా ఉన్నారు.
మన్మథుడు రీరిలీజ్ సందర్భంగా ఒక్కసారిగా ఆమె మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. అయితే అందరూ అన్షు ఆ క్రేజ్ ను ఎంజాయ్ చేయడానికి వచ్చిందనుకున్నారు. కానీ ఆమె ఇప్పుడు సినిమాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తోంది. అమ్మడు నటించిన మజాకా సినిమా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మజాకా ప్రమోషన్స్ లో భాగంగా అన్షు తన ఇంటిపేరు గురించి రెస్పాండ్ అయింది. వాస్తవానికి అన్షు గురించి గూగుల్ లో వెతికితే ఆమె పేరు అన్షు అంబానీగా గూగుల్ చూపిస్తుంది. మరి అన్షు నిజంగా అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తేనా అని అడిగితే, తనకు అంబానీ కుటుంబానికీ ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, గతంలో ఒక రిపోర్టర్ చేసిన పని వల్ల ఇప్పటికీ తన పేరు అన్షు అంబానీలానే ఉండిపోయిందని, ఎవరైనా ఆ పేరు మార్చడానికి హెల్ప్ చేయమని కోరింది.