సినీ ఇండస్ట్రీకి దూరమవడానికి కారణమదే: అన్షు
ఆ తర్వాత చదువుల కోసం లండన్ వెళ్లిన అన్షు అక్కడే ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని ఒక బాబు, పాపతో సెటిలైపోయింది.
By: Tupaki Desk | 8 Feb 2025 11:30 PM GMTమన్మథుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న నటి అన్షు. మన్మథుడు తర్వాత అన్షు రాఘవేంద్ర అనే సినిమాతో పాటూ మిస్సమ్మ సినిమాలో గెస్ట్ రోల్ మాత్రమే చేసింది. ఆ తర్వాత చదువుల కోసం లండన్ వెళ్లిన అన్షు అక్కడే ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని ఒక బాబు, పాపతో సెటిలైపోయింది.
దాంతో సినిమాలకు దూరమైన అన్షు ఇప్పుడు మళ్లీ రెండు దశాబ్ధాల తర్వాత సందీప్ కిషన్ హీరోగా వస్తున్న మజాకా సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా మజాకా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అన్షు ఆ చిత్ర ప్రమోషన్స్ లో పలు ఇంటర్వ్యూలిస్తూ మీడియాతో మాట్లాడుతుంది.
గతంలో తను సినిమాల్లో నటించినప్పుడు ఆమె వయసు 16 ఏళ్లని, అప్పుడు సినిమాలను కెరీర్ గా భావించకపోవడం వల్లే లండన్ కు వెళ్లి చదువుకున్నానని తెలిపిన అన్షు, ఒకవేళ తాను ఆ సినిమాలు 25 ఏళ్ల వయసులో చేసి ఉంటే మాత్రం కచ్ఛితంగా యాక్టింగ్ ను సీరియస్ గా తీసుకుని సినిమాల్లో కొనసాగేదాన్నని తెలిపింది.
మన్మథుడు రీరిలీజ్ తనకెంతో స్పెషల్ అని, ఆ సినిమా రీరిలీజ్ సందర్భంగా తనను ఓ వీడియో బైట్ అడగటంతో వీడియో చేసి రిలీజ్ చేసినట్టు చెప్పిన అన్షు, ఆ సినిమా రీరిలీజ్ తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఇండియా రావాలనిపించి హైదరాబాద్‌కు వచ్చి కొన్ని పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నట్టు చెప్పింది. ఆ పాడ్‌కాస్ట్‌లు చూసి కొంతమంది తనను సంప్రదించి సినిమా అవకాశాలిచ్చినట్టు అన్షు వెల్లడించింది.
మజాకా సినిమాలో నటించడానికి కారణం కథ నచ్చడమేనని, సినిమాలో తన పాత్ర చాలా గొప్పగా ఉంటుందని ఆమె తెలిపింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ సెట్స్ లో అడుగుపెట్టడం చాలా కొత్తగా అనిపించిందని, మొదటి రోజు ఎంతో కంగారు పడ్డానని, కానీ మిగిలిన టీమ్ అంతా తనకెంతో సాయంగా నిలిచారని అన్షు ఈ సందర్భంగా తెలిపింది.
అయితే లండన్ వెళ్లిన కొత్తలో అక్కడ ఏజెన్సీలతో కలిసి పని చేయాలనుకుని సంప్రదించగా తన ప్రొఫైల్ ను రిజెక్ట్ చేయడంతో పాటూ నువ్వేం సినిమాలు చేశావు? ఆ సినిమా పేర్లు మేమెప్పుడూ వినలేదు. నువ్వెవరు అన్నట్టు మాట్లాడారని, ఆ రోజుల్లో తెలుగు సినిమాకు అంత స్థాయి లేదని, అదే తానొక హిందీ సినిమాలో చేసి ఉన్నట్టైతే తనను గుర్తు పట్టి అవకాశాలిచ్చేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని తెలుగు సినిమా స్థాయి పెరిగిందని, సౌత్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కుతుందని ఆమె తెలిపారు.