వివాదంతో ప్రచారం కోసం మతాన్ని కెలకాలా?
బాలీవుడ్ సీనియర్ నటుడు అన్ను కపూర్ మీడియా ఎదుట చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
By: Tupaki Desk | 26 Oct 2024 5:08 AM GMTకొందరు వివాదంతో ప్రచారం కొట్టేయాలని ఆశపడుతున్నారు. దానికోసం నిరాధారమైన విచ్చలవిడి ప్రకటనలు చేసేందుకైనా వెనకాడటం లేదు. కొన్నిసార్లు కులమతాల్ని కూడా తెరపైకి తెచ్చి పబ్లిసిటీ కోరుకోవడం విచారకరం. సెన్సిటివ్ విషయాలను మీడియా ఎదుట మాట్లాడటం ద్వారా తమను తాము ప్రమోట్ చేసుకోవాలనే ఎత్తుగడను అనుసరించడం ఇటీవల చర్చనీయాంశమైంది.
బాలీవుడ్ సీనియర్ నటుడు అన్ను కపూర్ మీడియా ఎదుట చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అతడిని పరిశ్రమ దాదాపుగా మర్చిపోయింది. కానీ అతడు ఇంకా లైమ్ లైట్ లో ఉండేందుకు చేయకూడని కొన్ని తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. షారూఖ్ నటించిన చక్ దే ఇండియా సినిమాని ఉదహరిస్తూ ఆ సినిమాలో ముస్లిమ్ యువతులను హీరోలుగా చిత్రీకరించి, హిందూ పండిట్ యువతులను విలన్లుగా చూపించారని అన్నూ కపూర్ ఆరోపించాడు. ఈ చిత్రంలో టీమ్ కోచ్ గా షారూఖ్ ఖాన్ నటించాడు.
మహిళా హాకీ టీమ్ ని విజయవంతంగా నడిపించిన భారతీయ కోచ్ రాంజన్ నేగి నిజ జీవిత కథ ఆధారంగా ఇది రూపొందింది. అయితే అన్ను కపూర్ ఆరోపణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అతడి ఆలోచన సరికాదని చాలా మంది వారించే ప్రయత్నం చేసారు. సీనియర్ నటుడు అన్ను కపూర్ కి వివాదాలు కొత్తేమీ కాదు. ఇంతకుముందు సాత్ ఖూన్ మాఫ్ చిత్రంలో నటించేప్పుడు ప్రియాంక చోప్రా అతడితో పెదవి ముద్దుకు అంగీకరించకపోవడంతో దానిపైనా వివాదాస్పద ప్రకటనలు చేసాడు. ఇప్పుడు షారూక్ ఖాన్ సినిమాని ప్రస్థావిస్తూ ప్రచారం కోసం వెంపర్లాడుతున్నాడని బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు.