Begin typing your search above and press return to search.

అనుదీప్ పాటతో మ్యాడ్ స్క్వేర్ కుర్రాళ్లు.. ‘వచ్చార్రోయ్’

‘మ్యాడ్’ సినిమాతో యువతను ఆకట్టుకున్న టీం.. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

By:  Tupaki Desk   |   18 March 2025 5:58 PM IST
అనుదీప్ పాటతో మ్యాడ్ స్క్వేర్ కుర్రాళ్లు.. ‘వచ్చార్రోయ్’
X

‘మ్యాడ్’ సినిమాతో యువతను ఆకట్టుకున్న టీం.. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సీక్వెల్ సినిమాలంటే కొంచెం ఒత్తిడి ఉంటుందనే భావనను చెరిపేసేలా, ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇప్పటికే టీజర్, ప్రొమో వీడియోలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన ‘వచ్చార్రోయ్’ పాట ఈ ఉత్సాహాన్ని మరింత పెంచేసింది.

సినిమాలో మూడో పాటగా విడుదలైన ‘వచ్చార్రోయ్’ గీతం ప్రేక్షకుల ముందుకు రాగానే ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటను స్వయంగా ఆయనే ఆలపించారు. ఇప్పటికే ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటలు హిట్ కావడంతో, ‘వచ్చార్రోయ్’ పాట కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే, ఈ పాట వాటిని మించేలా ఆకట్టుకుంటోందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఈ పాటకు ముఖ్య ఆకర్షణ భీమ్స్ మ్యూజిక్‌తో పాటు, దర్శకుడు కె.వి. అనుదీప్ రాసిన సాహిత్యం. "ఏసుకోండ్రా మీమ్స్, చేసుకోండ్రా రీల్స్" అంటూ యువతను టార్గెట్ చేస్తూ, పాటను పూర్తిగా ట్రెండింగ్ ఫార్మాట్‌లో రూపొందించారు. సాంగ్ ట్యూన్ మాస్ బీట్‌తో నడుస్తూ, డ్యాన్స్ చేయించేలా ఉంది. ఈ పాట విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రత్యేకంగా రీల్స్, షార్ట్ వీడియోల్లో ఇది ట్రెండింగ్ అవుతోంది.

‘మ్యాడ్’ ఫ్రాంచైజీ ప్రధాన ఆకర్షణ నటీనటుల క్యామిస్ట్రీ, వారి కామెడీ. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ల త్రయం ఈ సినిమాలో మరో లెవెల్ మజాను తెచ్చేలా కనిపిస్తోంది. అలాగే రెబా మోనికా జాన్ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా కళ్యాణ్ శంకర్ టేకింగ్, స్క్రీన్‌ప్లే ఈ సినిమాను పూర్తి క్రేజీగా మలచనుందని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది.

ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తుండగా, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘మ్యాడ్’ మొదటి భాగం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నేపథ్యంలో, ‘మ్యాడ్ స్క్వేర్’ మరింత ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుందని టీమ్ ధీమాగా ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సీక్వెల్ మజా ఎలా ఉంటుందో చూడాలి.