Begin typing your search above and press return to search.

హీస్ట్ థ్రిల్ల‌ర్‌తో అనూ మ్యాజిక్ చేస్తుందా?

కెరీర్ ఆరంభ‌మే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించింది అను ఇమ్మాన్యుయేల్

By:  Tupaki Desk   |   7 Nov 2023 1:03 PM GMT
హీస్ట్ థ్రిల్ల‌ర్‌తో అనూ మ్యాజిక్ చేస్తుందా?
X

కెరీర్ ఆరంభ‌మే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించింది అను ఇమ్మాన్యుయేల్. త‌న న‌ట‌న‌కు పేరొచ్చినా సినిమాలు విజ‌యాలు సాధించ‌కపోవ‌డం మైన‌స్ అయింది. కానీ అనూ త‌న ఉనికిని చాటుకుంటూ వ‌రుస చిత్రాల్లో క‌నిపిస్తోంది. ఇప్పుడు కార్తీ జ‌పాన్ లోను క‌థానాయిక‌గా న‌టించింది. ఈ సినిమా న‌వంబ‌ర్ 10 నుంచి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియా హీస్ట్ థ్రిల్లర్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై SR ప్రకాష్ బాబు- SR ప్రభులు నిర్మించగా, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది.


విడుదలకు ముందు ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అను ఇమ్మాన్యుయేల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. అనూ మాట్లాడుతూ-''రాజు మురుగన్ చాలా ప్ర‌తిభావంతుడైన‌దర్శకుడు. ఆయన ప్రతి సినిమా ఒక్కో విధంగా ఉంటుంది. ఈ సినిమా కోసం కార్తీ , డ్రీమ్ వారియర్ పిక్చర్స్, డిఓపి రవి వర్మన్, జివి ప్రకాష్ కుమార్ అందరూ దిగ్గ‌జాలు క‌లిసి ప‌ని చేసారు. జపాన్ కథ, ఇందులో నా పాత్ర చాలా ప్రత్యేకమైనవి. నేను ఇంతకుముందు ఇలాంటి కథ వినలేదు. ఒక ప్రేక్షకుడిగా ఇలాంటి సినిమా చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నాను'' అన్నారు. అనూ తన సహనటుడు కార్తీని మంచి మనిషి అని పిలిచింది.

అతనిపై ప్రశంసలు కురిపిస్తూ, "కార్తీ అద్భుతమైన నటుడు.. టీమ్ ప్లేయ‌ర్.. ఏదైనా సీన్ చేసే ముందు చర్చించుకునేవాళ్లం. ఆఫ్‌స్క్రీన్‌లో కార్తీ గొప్ప మనిషి. ఇది కార్తీకి 25వ సినిమా.. ఆయనతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. అతను చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. చాలా సపోర్ట్ చేస్తాడు. కార్తీ గొప్ప సహనటుడు" అని అన్నారు. 'జపాన్‌'లో ప్రేక్షకులను అలరించే కొన్ని విలక్షణమైన అంశాల గురించి ప్ర‌స్థావిస్తూ... "ట్రైలర్‌, టీజర్‌ చూస్తుంటే జపాన్‌ ఓ ప్రత్యేకమైన సినిమా అని అర్థమవుతుంది. ఇంతకు ముందు ఇలాంటి పాత్ర ఎవరూ చేయలేదు. దీపావళికి ఇదే సరైన సినిమా. మంచి థియేట్రిక‌ల్ అనుభూతిని అందించే సినిమా ఇది. ప్రతి ఒక్కరూ థియేటర్లలో తప్పక చూడాలి. జ‌పాన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని తెలిపారు.

జ‌పాన్ గురించి మ‌రిన్ని అనూ మాట‌ల్లోనే..

*జపాన్ లో త‌న‌ పాత్ర గురించి ఎక్కువ వెల్లడించకుండా కొన్ని హింట్లు మాత్ర‌మే ఇచ్చింది. 'జపాన్'లో నా పాత్ర ఆశ్చర్యకరమైన అంశంగా ఉంటుంది. దాని గురించి ఇప్పుడే ఎక్కువగా వెల్లడించదలచుకోలేదు. నటిగా కనిపిస్తాను. జపాన్ జీవితంలో నా పాత్ర కీలకం. కార్తీ - నా పాత్ర మధ్య చాలా ఆసక్తికరమైన ట్రాక్ ఉంది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది. జపాన్ నేపథ్య సంగీతం అద్భుతం. థియేటర్‌లో గొప్ప అనుభూతిని ఇస్తుంది. పాటలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సంగీతం కథకు తగ్గట్టుగానే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

*జపాన్‌లో సునీల్‌తో సన్నివేశాలు ఉన్నాయి. సునీల్ నాకు ఇష్టమైన నటుడు. గతంలో ఊర్వశివో రాక్షసివో సినిమాకు ఆయనతో కలిసి పనిచేశాను. అతను చాలా బహుముఖ నటుడు. పుష్పలో అద్భుతమైన పాత్రను పోషించాడు. జపాన్‌లో కూడా అతని పాత్ర చాలా బాగుంది.

*ఎస్‌ఆర్ ప్రభు ప్రొడక్షన్ ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌ది. జ‌పాన్‌కు అత్యుత్తమ టీమ్ ని ఆయ‌న అందించారు. కార్తీ, రాజు మురుగమ్, రవి వర్మన్, జివి లాంటి అద్భుతమైన టీమ్‌తో కలిసి పనిచేశాం. కేరళ, కాశ్మీర్, చెన్నై వంటి ఎన్నో అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేశాం. ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీశారు. అలాగే, చెన్నై, హైదరాబాద్, కేరళ, దుబాయ్ వంటి చోట్ల‌ అద్భుతమైన ప్రమోషన్లు జరుగుతున్నాయి. నేను పనిచేసిన నిర్మాతల్లో ప్రభు ఒకరు.

*నాకంటూ డ్రీమ్ రోల్స్ ఏవీ లేవు.ప్రేక్షకులకు నచ్చే పాత్రలు చేయాలి. మంచి పాత్రలు, కథనాలు రావాలని కోరుకుంటున్నాను.. అని అను ఇమ్మాన్యుయేల్‌ చెప్పింది.