జానకిగా అనుపమ.. ఇంట్రస్టింగ్ అప్‌డేట్
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సౌత్‌లోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ సక్సెస్‌లను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది
By: Tupaki Desk | 15 Nov 2024 5:38 AM GMTమలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సౌత్‌లోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ సక్సెస్‌లను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. కమర్షియల్ సినిమాల కంటే ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్న అనుపమ ప్రస్తుతం 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాలో నటిస్తోంది. లీగల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు సురేష్ గోపి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. జానకి అనే అమ్మాయి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఆమెకు జరగిన అన్యాయంపై లాయర్ గా సురేష్ గోపి న్యాయస్థానంలో పోరాటం చేస్తారు. కథ సింపుల్‌గా ఉన్నా కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారట.
ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కిరణ్ నిర్మిస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. యూనిట్ సభ్యులు షేర్ చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఒక అమ్మాయి కేసు చుట్టూ తిరిగే కథను కోర్టులో ఎలా ముగించారు అనేది వెండి తెరపై చూపించబోతున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ను జానకి పాత్రలో చూడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలు వచ్చినప్పుడు అనుపమ తన ప్రతిభను కనబర్చడం మనం చూస్తూ ఉంటాం. మరోసారి అనుపమ తన ప్రతిభ చూపడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సీనియర్ నటుడు సురేష్ గోపీ కీలక పాత్రలో నటించడం ద్వారా మలయాళంలో మంచి బజ్ క్రియేట్ అయింది. తెలుగులోనూ ఈమెకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇక్కడ సైతం రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య కాలంలో సినిమాలు కాస్త తక్కువ చేస్తోంది. సినిమాల సంఖ్య పెంచుకోవడం కంటే మంచి సినిమాలు చేశాం అనిపించుకోవాలని ఆమె భావిస్తుందట. అందుకే తెలుగు నుంచి వచ్చిన కొన్ని ఆఫర్లను సైతం ఆమె సున్నితంగా తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. ఆ విషయమై ఆమె నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
'జానకి వర్సెస్ స్టేఫ్ ఆఫ్ కేరళ' సినిమాలో ముఖ్య పాత్రల్లో దివ్యా పిళ్లై, శృతి రామచంద్రన్, అస్కర్ అలీ, బైజు సంతోష్ కీలక పాత్రల్లో నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు. త్వరలోనే సినిమా విడుదల తేదీపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగులో పరదా అనే సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లోనూ నటించేందుకు చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా మలయాళం, తమిళ్ లో కలిపి అనుపమ ఆరు ఏడు సినిమాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఆ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.