ఆఫీస్ దోచేసి ఫిలిం నెగెటివ్ కూడా ఎత్తుకెళ్లారు
అనుపమ్ ఖేర్ తన కార్యాలయంలో జరిగిన దోపిడీ వివరాలను వెల్లడించారు. అతడి పోస్ట్ ప్రకారం.. ఇద్దరు దొంగలు రెండు తలుపులు పగులగొట్టి ప్రవేశించారు.
By: Tupaki Desk | 21 Jun 2024 3:30 PM GMTనటుడి ఆఫీస్‌లో డబ్బు దోచేయడమే గాక ఫిలిం నెగెటివ్ కూడా ఎత్తుకెళ్లారట. ముంబైలోని వీర దేశాయ్ ప్రాంతంలోని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కార్యాలయంలో బుధవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. దొంగిలించిన వస్తువుల వివరాలను అనుపమ్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో గురువారం షేర్ చేసారు.
అనుపమ్ ఖేర్ తన కార్యాలయంలో జరిగిన దోపిడీ వివరాలను వెల్లడించారు. అతడి పోస్ట్ ప్రకారం.. ఇద్దరు దొంగలు రెండు తలుపులు పగులగొట్టి ప్రవేశించారు. ఖేర్ కంపెనీ నిర్మించిన సినిమాకి సంబంధించిన నెగెటివ్‌తో కూడిన బాక్స్‌ను.. అలాగే ఖాతాల విభాగంలోని మొత్తం సేఫ్ లాకర్‌ను వారు దొంగిలించారు. అనుపమ్ ఖేర్ తన పోస్ట్‌లో దొంగలు సేఫ్ లాకర్‌ను బ్రేక్ చేయలేరని కూడా పేర్కొన్నాడు.
ఎఫ్ఐఆర్ దాఖలు..
అనుపమ్ ఖేర్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) దాఖలు చేశారు. చోరీకి గురైన వస్తువులతో ఆటో రిక్షాలో ఆఫీసు నుంచి బయలుదేరిన దొంగలు సీసీటీవీ ఫుటేజీలో చిక్కుకున్నారని ఖేర్ పేర్కొన్నారు. త్వరితగతిన విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని పోలీసులు తనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇన్‌స్టాలో అనుపమ్ ఖేర్ పోస్ట్ లకు అభిమానుల నుండి ఆందోళన వ్యక్తమైంది. చోరీకి గురైన వస్తువులు త్వరగా రికవరీ అవుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. అనుపమ్ నటించిన చివరి చిత్రం ఛోటా భీమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమ్యాన్.