Begin typing your search above and press return to search.

లోకువ ప‌సిగ‌ట్టి పుష్ప‌రాజ్ మమ్మ‌ల్ని ఆడుకున్నాడు: అనురాగ్ క‌శ్య‌ప్

ఇలాంటి స‌మ‌యంలో బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌ అనురాగ్ క‌శ్య‌ప్ అగ్నికి ఆజ్యం పోస్తూ బాలీవుడ్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   2 Jan 2025 4:51 AM GMT
లోకువ ప‌సిగ‌ట్టి పుష్ప‌రాజ్ మమ్మ‌ల్ని ఆడుకున్నాడు: అనురాగ్ క‌శ్య‌ప్
X

హిందీ చిత్ర‌సీమ‌లో టాలీవుడ్ సినిమాల హ‌వా కొన‌సాగుతోంది. పుష్ప 2తో ఇది మ‌రోసారి నిరూప‌ణ అయింది. దీంతో ద‌క్షిణాది నుంచి వ‌చ్చి బాలీవుడ్ పై దాడి చేస్తున్న సినిమాల గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. దీనిని చాలామంది స‌మ‌ర్థిస్తుంటే, కొంద‌రు హిందీ సినీపెద్ద‌లు మాత్రం చాలా ఫీల‌వుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌ అనురాగ్ క‌శ్య‌ప్ అగ్నికి ఆజ్యం పోస్తూ బాలీవుడ్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాడు. సౌత్ ఇండియన్ సినిమాలతో పోలిస్తే బాలీవుడ్ ప‌రాయి భాషా కంటెంట్ ని ఎంపిక చేసుకుని సినిమాల‌ను నిర్మిస్తుందని అనురాగ్ కశ్యప్ విమ‌ర్శించారు. హిందీ చిత్రనిర్మాతలు తమ ప్రధాన ప్రేక్షకులను విస్మరించారని, ఇది హిందీ మాట్లాడే బెల్ట్‌లో సౌత్ ఇండియన్ డ‌బ్బింగుల మనుగడ, విజయానికి దారితీసిందని అతడు విశ్లేషించాడు.

అనురాగ్ సౌత్ ఇండియన్ సినిమాలు, వాటి డబ్బింగ్ వెర్షన్లు ఉత్తర భారతదేశంలో ఎలా భారీ విజయాన్ని సాధించాయో వివరించారు. హిందీ మాట్లాడే ప్రేక్షకులను బాలీవుడ్ పట్టించుకోకపోవడమే ఈ ధోరణికి కారణమని ఆయన అన్నారు. యూట్యూబ్ ఛానెల్‌లు అనుసరించిన వినూత్న వ్యూహాలు, తక్కువ ఖర్చుతో దక్షిణ భారత చిత్రాలను కొనుగోలు చేసి వాటిని హిందీలోకి డబ్ చేసి, ఈ గ్యాప్‌ను పెట్టుబడిగా పెట్టి లాభాలు దండుకున్నాయని కశ్యప్ తెలిపారు.

మేము హిందీ సినిమాలు చేస్తాం కానీ హిందీ సినిమా ప్రేక్షకులను పట్టించుకోలేదు. మా కంటే హిందీ యూట్యూబ్ ఛానెల్‌ని సృష్టించిన వ్యక్తి ప్రయోజనం పొందాడు. అతడు దక్షిణ భారతీయ చిత్రాలను చౌక ధరలకు కొనుగోలు చేసి వాటిని హిందీలోకి డబ్ చేసి స్థానిక‌ ప్రేక్షకులకు అందించాడు. దీనివ‌ల్ల అల్లు అర్జున్ లాంటి స్టార్లకు ఉత్త‌రాదిన చిన్న టౌన్ల‌లోను గుర్తింపు ద‌క్కింది. అతడి సినిమా ప్ర‌చార వేదిక‌ను పాట్నా (బీహార్)లో ప్లాన్ చేయ‌డానికి కార‌ణాన్ని అనురాగ్ లోతుగా విశ్లేషించాడు.

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాగ్ త‌న సినిమాల రిలీజ్ విష‌యంలో లోపభూయిష్ట పంపిణీ వ్యూహాలపైనా నిరాశను వ్యక్తం చేశాడు. త‌న సినిమాలు గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్, ముక్కాబాజ్ ఉత్తర భారతదేశంలో భారీగా విడుదల కాలేదని అన్నాడు. విశాలమైన ఉత్తర భారత ప్రాంతాన్ని పట్టించుకోకుండా ఢిల్లీ, ముంబై, చండీగఢ్, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ ప్రాంతాలకు తన ప్రేక్షకులు పరిమితమయ్యారని స్టూడియోలు తప్పుగా భావించాయని ఆయన పేర్కొన్నారు. కశ్యప్ పంపిణీ వ‌ర్గాలు, స్టూడియోల‌ చెత్త‌ నిర్ణయాన్ని విమర్శించారు. తన సినిమాల విష‌యంలో హిందీ చిత్ర‌సీమ త‌ప్పుడు జ‌డ్జిమెంట్ ని వేలెత్తి చూపించాడు. థియేట‌ర్ య‌జ‌మానులు త‌న సినిమాల‌ను త‌మ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల్సిందిగా కోరినా అధిక ఖ‌ర్చు, టెక్నిక‌ల్ కార‌ణాల‌తో రిలీజ్ చేయ‌లేద‌ని ఆరోపించాడు.