సినిమా పూర్తై రెండేళ్లవుతున్నా రిలీజ్ కాలేదంటున్న అనురాగ్
రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన చిత్రం కెన్నెడీ.
By: Tupaki Desk | 7 March 2025 3:30 PMరాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన చిత్రం కెన్నెడీ. ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. కానీ ఇప్పటికీ రిలీజవలేదు. వాస్తవానికి కెన్నెడీ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మూడేళ్ల కిందటే పూర్తైందట. అయినప్పటికీ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కు నోచుకోలేదు.
రీసెంట్ గా బాలీవుడ్ కు గుడ్ బై చెప్పి సౌత్ కు వచ్చిన అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో కెన్నెడీ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెన్నెడీ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తైందని, సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిందని ఆయన తెలిపారు.
సెన్సార్ అయ్యాక సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నామని, ఓ స్ట్రీమింగ్ కంపెనీకు దానికి సంబంధించిన బాధ్యతల్ని అప్పజెప్పినట్టు అనురాగ్ తెలిపారు. అయితే ఆ స్ట్రీమింగ్ సంస్థ పలు సినిమాలతో ఎంతో నష్టపోయిందని, ఆ సినిమాలను తీసిన వాళ్లందరూ దాన్ని వదలి వెళ్లిపోయారని ఆయన వెల్లడించారు.
అందుకే తన కెన్నెడీ ఇంకా రిలీజ్ కాలేదని, ఈ క్రమంలోనే నష్టపోయిన ఆ సంస్థకు కొత్త షో కోసం ఓ ఐడియా చెప్పానని వాళ్లకు కూడా ముందు ఆ ఐడియా నచ్చిందన్నారని కానీ తర్వాత పెద్దగా బాలేదన్నారని చెప్పారన్నారు. తర్వాత మరో కొత్త ఐడియా చెప్పానని, అయితే దాన్ని వాళ్లు మనీ హెయిస్ట్ రేంజ్ లో చేయాలనుకున్నారని, దీంతో వారి మాటలకు విసుగొచ్చి దండం పెట్టి అక్కడి నుంచి వచ్చేసినట్టు ఆయన తెలిపారు.
కెన్నడీ మూవీ కరప్షన్ తో ఉన్న సమాజాన్ని బాగుచేయడానికి ఓ ఎక్స్ పోలీసాఫీసర్ ఏం చేశాడు? ఆ క్రమంలో అతనికి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయనే నేపథ్యంలో తెరకెక్కిందని, 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈ సినిమా ప్రదర్శించబడిందని, కేన్స్ లో తమ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయని అనురాగ్ చెప్పారు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ టాలీవుడ్ లో డెకాయిట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.