Begin typing your search above and press return to search.

కూతురు పెళ్లి మ‌ధ్య‌లో వ‌దిలేసి వెళ్లిపోవాల‌నుకున్న దర్శ‌కుడు

అలాంటి ఒక ఎమోష‌న్ గురించి మాట్లాడాడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ కశ్యప్. అత‌డి కుమార్తె ఆలియా క‌శ్య‌ప్ విదేశీయుడిని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Feb 2025 3:46 AM GMT
కూతురు పెళ్లి మ‌ధ్య‌లో వ‌దిలేసి వెళ్లిపోవాల‌నుకున్న దర్శ‌కుడు
X

కుమార్తె పెళ్లి చేయ‌డం అంటే అది ఎమోష‌న్స్‌తో ముడిప‌డిన‌ది. చాలా భావోద్వేగాలు ఉంటాయి. ఇంత‌కుముందు అమీర్ ఖాన్ త‌న కుమార్తె ఇరా ఖాన్ పెళ్లి చేసిన‌ప్పుడు ఎంత‌గా ఎమోష‌న‌ల్ అయ్యాడో చూసాం. అత‌డు ఆ పెళ్లి కోసం త‌న సినిమాల‌ను కూడా వ‌దులుకున్నాడు. కుటుంబంతో చాలా ఎక్కువ స‌మ‌యం గ‌డిపాడు. సినిమాలతో ద‌శాబ్ధాల పాటు వ్య‌క్తిగ‌త జీవితంలో చాలా కోల్పోయాన‌ని కూడా అత‌డు అన్నాడు.

అలాంటి ఒక ఎమోష‌న్ గురించి మాట్లాడాడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ కశ్యప్. అత‌డి కుమార్తె ఆలియా క‌శ్య‌ప్ విదేశీయుడిని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. ఈ జంట చాలా కాలం పాటు డేటింగ్ చేసి, చివ‌ర‌కు పెళ్లితో ఒక‌ట‌య్యారు. అయితే పెళ్లి స‌మ‌యంలో భావోద్వేగాన్ని అణ‌చుకోలేక అనురాగ్ ఏడ్చేసాన‌ని తెలిపాడు. త‌న కూతురు గురించి మాట రాగానే, త‌న‌కు ఏడుపు త‌న్నుకు వ‌చ్చేసేద‌ట‌. పెళ్లి మ‌ధ్య‌లోనే తాను అన్నీ వ‌దిలేసి అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌నుకున్నాడు. అంతేకాదు త‌న కుమార్తె పెళ్ల‌యిన ప‌ది రోజుల వ‌ర‌కూ అలా ఏడుస్తూనే ఉన్నానని అత‌డు చెప్పాడు. ఏడుపును ఆపుకోలేకే తాను పెళ్లిని మ‌ధ్య‌లో వ‌దిలేసి వెళ్లిపోవాల‌నుకున్నాన‌ని అనురాగ్ తెలిపాడు.

అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. వివాహ వేడుకల ఆద్యంతం భావోద్వేగాలు క‌నిపించాయి. ఆలియా వివాహం తర్వాత 10 రోజులు తాను ఏడ్చానని త‌ను పుట్టినప్పుడు అలాంటి అనుభ‌వ‌మే అయింద‌ని అనురాగ్ అన్నాడు. ఆలియా అనురాగ్‌కి మొదటి భార్య అయిన‌ ఫిల్మ్ ఎడిటర్ ఆర్తి బజాజ్‌కి ఏకైక సంతానం. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో ఇంట‌ర్వ్యూలో త‌న ఉద్వేగం గురించి వివ‌రించాడు.

నా కూతురు పుట్టినప్పుడు నాకు అదే అనుభూతి కలిగింది. నేను ఎందుకు అంతగా ఏడ్చానో నాకు తెలియదు, కానీ నేను ఏడ్చాను. ఆమె పెళ్లిలో కూడా అదే జ‌రిగింది. నేను 10 రోజులు ఆగకుండా ఏడ్చాను. ఎందుకో నాకు తెలియదు అని అనురాగ్ అన్నాడు. కూతురి పెళ్లి త‌ర్వాత తాగుడు కూడా మానేశాన‌ని అనురాగ్ చెప్పాడు. ''అకస్మాత్తుగా నేను తాగడం మానేశాను.. ఏడవడం మానేశాను.. అంతా ఆగిపోయింది. ఇది నాకు పెద్ద కాథర్సిస్ అని అనుకుంటున్నాను... 10 రోజులు ఇలా కొనసాగింది'' అని అతను చెప్పాడు. నేను చాలా ఉక్కిరిబిక్కిరి అయ్యాను.. భావోద్వేగానికి గురయ్యాను.. రిసెప్షన్ ప్రారంభం కాకముందే నేను పెళ్లి నుండి వెళ్లిపోవాలనుకున్నాను.. అని చెప్పాడు. త‌న కూతురుకు తాను ఎప్పుడూ అందుబాటులో లేన‌ని, కెరీర్ బిజీ కార‌ణంగా అలా జ‌రిగింద‌ని కూడా అనురాగ్ చెప్పాడు. త‌న కుమార్తె ఆలియా త‌న‌ను చాలా అర్థం చేసుకుంద‌ని అన్నాడు.