OTTల సిండికేట్ ప్లాన్‌పై అనురాగ్ పంచ్!
ఇక ఓటీటీల గేమ్ ముగిసిందని, మునుముందు బుల్లితెర హవా పెరుగుతుందని కొత్త సూత్రాన్ని చెప్పాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..?
By: Tupaki Desk | 14 Jun 2024 2:45 AM GMTఓటీటీలపై ప్రముఖ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక ఓటీటీల గేమ్ ముగిసిందని, మునుముందు బుల్లితెర హవా పెరుగుతుందని కొత్త సూత్రాన్ని చెప్పాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..?
ఓటీటీ సిరీస్ లలో కీలక మలుపునిచ్చే ఓ వెబ్ సిరీస్ తో అనురాగ్ పేరు మార్మోగింది. ఆ సిరీస్ సేక్రేడ్ గేమ్స్. అనురాగ్ కశ్యప్ నెట్‌ఫ్లిక్స్ మొదటి ఇండియా ఒరిజినల్స్ సేక్రేడ్ గేమ్స్ సహ-సృష్టికర్తలలో ఒకరు. సేక్రేడ్ గేమ్స్ విజయం తర్వాత OTT ప్లాట్‌ఫారమ్‌లు భారీ స్థాయిలో జనాదరణ పొందాయి. క్రైమ్ థ్రిల్లర్ శైలి కూడా పుంజుకుంది. అయితే ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవని OTT గోల్డెన్ పీరియడ్ ఇప్పుడు ముగిసిందని అనురాగ్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యపరుస్తోంది. పాపులర్ రేడియో నాషాతో అనురాగ్ మాట్లాడుతూ- ''మనం OTT గోల్డెన్ టైమ్‌ను దాటిపోయామని నేను భావిస్తున్నాను. ఇప్పుడు OTT టీవీగా మారడం ప్రారంభించింది. లాంగ్-ఫార్మాట్ స్టోరీటెల్లింగ్ ఎల్లప్పుడూ విశేష ఆదరణను కలిగి ఉంటుంది.. కానీ ఇప్పుడు అది నాణ్యతతో నిర్దేశించబడలేదు. ఇది అల్గోరిథం ద్వారా నిర్దేశితమవుతుంది'' అని విశ్లేషించారు. టీఆర్‌పిలు ఎలాంటి టెలివిజన్‌ను రూపొందించాలో నిర్ణయించడం ప్రారంభించాయి.. మునుముందు టీవీ తెర సన్నివేశం పూర్తిగా మారిపోతుంది. నిజానికి ఓటీటీలకు కొత్త సబ్‌స్క్రైబర్‌లు అవసరమయ్యే వరకు కొత్త విషయాలతో ప్రయోగాలు చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఓటీటీలే టీవీలుగా మారుతాయి. ఇదొక చక్రం. నేను ఇప్పుడు 32 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. అనుభవంతో చెబుతున్నాను''అని అన్నారు.
నిజానికి ఓటీటీలు ఒరిజినల్ కంటెంట్ ని తెరకెక్కిస్తూ సబ్ స్క్రైబర్లను పెంచుకునే ఎత్తుగడలో ఉన్నాయి. అంతేకాదు..ఒరిజినల్ కంటెంట్ సృష్టి కోసం బాగా డబ్బు ఖర్చవుతుంది కాబట్టి దానిని ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు కూడా సేల్ చేస్తున్నాయి. భాగస్వామ్య ఒప్పందాలతో సిరీస్ లను నిర్మిస్తున్నాయి. ఇది ఇటీవల విస్తరిస్తున్న నయా ట్రెండ్. ఇలా చేయడం వల్ల ఒక సినిమా లేదా సిరీస్ విభిన్న ప్లాట్ ఫామ్ లలో విశేష ఆదరణ పొందుతుందని అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు MX ప్లేయర్ - స్టార్ భారత్ జోడీగా కలిసాయి. ZEE5 - ALT బాలాజీ కూడా ఇంతకు ముందు చేతులు కలిపాయి. భాగస్వామ్యంలో ఒరిజినల్ కంటెంట్ ని మేనేజ్ చేస్తున్నాయి. రెండు చోట్లా కంటెంట్ ని వీక్షించే వెసులుబాటు సబ్ స్క్రైబర్లకు పెరుగుతోంది. ఇది ధనార్జనలో తెలివైన ఎత్తుగడగా భావిస్తున్నారు.
ఇటీవల ఓటీటీలకు ప్రత్యేకించి ఇప్పుడు సభ్యత్వాలు పెద్దగా పెరగడం లేదు. వాణిజ్య ప్రకటనల ఆదాయం పెరగలేదు. కొత్త కంటెంట్‌ని సృష్టించడానికి చాలా శ్రమ పడాల్సి ఉంది. ఎక్కువ సమయం, డబ్బు అవసరం పడుతుంది. కాబట్టి ఓటీటీలు దాని ప్రకారం గేమ్ ని మార్చాయి. ఒరిజినల్ కంటెంట్ షేరింగ్ ద్వారా వ్యూవర్ షిప్ ని పెంచుకోవడం అనే ఎత్తుగడను అనుసరిస్తున్నాయి. ఈ విధానం భవిష్యత్ కి ఉపకరిస్తుందని అంచనా. తమ కంటెంట్ ని ఎక్కువమందికి చేర్చడమే ఓటీటీల లక్ష్యం. అలాగే చోటా మోటా ఓటీటీలకు ఆదరణ తక్కువ. అందువల్ల పెద్ద ప్లేయర్లతో చేతులు కలపడం ద్వారా అవి కూడా ఆదరణ పొందుతున్నాయని కూడా విశ్లేషిస్తున్నారు. అనురాగ్ ప్రకారం... ఓటీటీలు ప్రతిసారీ గేమ్ ప్లాన్ ని ఛేంజ్ చేస్తూ ఆర్జనను పెంచుకునే ఎత్తుగడల్లో ఉన్నాయి. చివరికి ఇది టీవీ పరిశ్రమ ఎదుగుదలకు సహకరిస్తుందని, ఓటీటీలు కూడా టీవీల మాదిరిగా మారతాయని, ఇది ఒక చక్రం అని అతడు విశ్లేషిస్తున్నాడు.