ఘాటీ వాయిదా తప్పేలా లేదు
అనుష్క నుంచి సినిమా రిలీజై దాదాపు సంవత్సరంన్నర దాటుతుంది.
By: Tupaki Desk | 16 March 2025 12:06 PM ISTబాహుబలి సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఆ సినిమా తర్వాత వరుసపెట్టి సినిమాలు చేసి తన సత్తా చాటుతుందనుకున్నారు అందరూ. కానీ తను మాత్రం ఆ సినిమా తర్వాత స్లో అయిపోయింది. అనుష్క నుంచి సినిమా రిలీజై దాదాపు సంవత్సరంన్నర దాటుతుంది.
స్వీటీ నటించిన ఆఖరి సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటూ బాక్సాఫీస్ వద్ద కూడా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మంచి హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుంది అనుష్క.
చాలా టైమ్ తీసుకుని మొత్తానికి అనుష్క రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ఒకటి మలయాళంలో చేస్తున్న కథనర్ కాగా, రెండోది తెలుగులో చేస్తున్న ఘాటీ సినిమా. ఈ రెండు సినిమాలూ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. ఇందులో ఘాటీ సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.
అయితే ఘాటీ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అంటే రిలీజ్ కు ఇంకా నెల కూడా లేదు. కానీ ఇప్పటివరకు ఘాటీ టీమ్ సినిమా నుంచి టీజర్ ను తప్ప మరే ప్రమోషనల్ కంటెంట్ ను వదిలింది లేదు. రిలీజ్ దగ్గర పడుతున్నా కూడా మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో సైలైంట్ గానే ఉంటున్నారు.
దీంతో ఘాటీ వాయిదా పడుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఎప్పట్నుంచో ఈ సినిమా వాయిదా పడే ఛాన్సుందని అంటున్నారు తప్పించి నిర్మాతల నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది లేదు. విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు విద్యా సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో అనుష్క చాలా మాస్ లుక్ లో కనిపించనున్నట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది.