సినిమా టిక్కెట్ల ధరలు.. హైకోర్టు ఏం చెప్పిందంటే..
కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాల టిక్కెట్ల ధరలని పెంచే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అనే విషయంపై లోతైన విచారణ చేస్తామని ఏపీ హైకోర్టు తాజాగా తెలియజేసింది.
By: Tupaki Desk | 11 July 2024 5:06 AM GMTఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం రెండేళ్ల నుంచి వివాదాస్పదంగా మారింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ రిలీజ్ సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం టికెట్ ధరల్ని తగ్గిస్తూ జీవో జారీ చేసింది. వాటిని సీరియస్ రెవెన్యూ అధికారులతో అమలు చేయించింది. నిర్ణయించిన ధరలలో తప్ప ఎక్కువ మొత్తానికి అమ్మకూడదని ఆదేశాలు చేసింది. అయితే ఆ ఇష్యూ పెద్ద వివాదంగా మారింది. కేవలం పవన్ కళ్యాణ్ ఆర్ధిక మూలాలు దెబ్బతీసే ఉద్దేశ్యంతో కుట్రపూరితంగా వైసీపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించిందని మెగా అభిమానులు ఆరోపణలు చేశారు.
తరువాత కొంతకాలానికి సినీ పెద్దలు అమరావతి వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి జగన్ కి టికెట్ ధరల గురించి విన్నవించుకున్నారు. టికెట్ ధరలపై విషయం సరైన నిర్ణయం తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. తరువాత సినిమా బడ్జెట్ బట్టి టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ వస్తున్నారు. కొన్ని సినిమాలకి ధరల పెంపుకి రిక్వెస్ట్ పెట్టుకున్న ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అలాంటి వాటిలో భీమ్లా నాయక్ ఉంది.
2024 ఎన్నికలలో అధికారంలోకి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వచ్చింది. వీరు అధికారంలోకి వచ్చిన తర్వాతగా కొద్ది రోజులకి కల్కి 2898ఏడీ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి టికెట్ ధరల్ని రెండు వారాల పాటు పెంచుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. అలాగే ఐదు షోలకి పర్మిషన్ ఇచ్చింది. అయితే టికెట్ ధరల పెంపుపై నెల్లూరుకి చెందిన రాకేష్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించాడు.
కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాల టిక్కెట్ల ధరలని పెంచే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అనే విషయంపై లోతైన విచారణ చేస్తామని ఏపీ హైకోర్టు తాజాగా తెలియజేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని, ప్రతివాదులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. 14 రోజులు టికెట్ ధరలు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై రాకేష్ రెడ్డి కోర్టులో పిటీషన్ వేశారు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇచ్చింది. హైకోర్టు ఇచ్చే తీర్పు నెక్స్ట్ రిలీజ్ కాబోయే సినిమాల విషయంలో ప్రభావం చూపించే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. కల్కి మూవీ విషయంలో పిటీషన్ వేసిన ఇప్పటికే ఈ సినిమా రెండు వారాల సమయం దాటిపోయింది. అలాగే టికెట్ ధరలు కూడా తగ్గించేశారు.