Begin typing your search above and press return to search.

తాగుబోతు ప్ర‌శ్నించాక‌.. నాకు ఏడేళ్లు ప‌ట్టింది: AR రెహమాన్

స్వ‌ర‌మాంత్రికుడు AR రెహమాన్ సంగీతం గురించి ప్ర‌శ్నించే ధైర్య‌మా? స‌మ‌కాలీన సంగీత‌జ్ఞులు ఎవ‌రూ లివింగ్ లెజెండ్‌ని ప్ర‌శ్నించ‌లేరు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 3:45 AM GMT
తాగుబోతు ప్ర‌శ్నించాక‌.. నాకు ఏడేళ్లు ప‌ట్టింది: AR రెహమాన్
X

స్వ‌ర‌మాంత్రికుడు AR రెహమాన్ సంగీతం గురించి ప్ర‌శ్నించే ధైర్య‌మా? స‌మ‌కాలీన సంగీత‌జ్ఞులు ఎవ‌రూ లివింగ్ లెజెండ్‌ని ప్ర‌శ్నించ‌లేరు. ఆయ‌న సుస్వ‌ర ప్ర‌పంచంలో లెజెండ్ గా శిఖ‌రం ఎత్తున ఉన్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఆస్కార్ విజేత‌గా, గ్రామీ విజేత‌గా, జాతీయ అవార్డు గ్ర‌హీత‌గా రెహ‌మాన్ కీర్తి ప్రతిష్ఠలు అంతా ఇంతా కాదు. ప‌ద్మ‌శ్రీ అందుకున్న మేటి సంగీత ద‌ర్శ‌కుడు రెహ‌మాన్. వీట‌న్నిటినీ మించి ద‌శాబ్ధాలుగా ప్రజ‌లను ఉర్రూత‌లూగించిన సంగీత మేధావి.

అందుకే ఏ.ఆర్.రెహ‌మాన్ ప‌నిని ప్ర‌శ్నించేందుకు నేటిత‌రంలో ఎవ‌రూ సాహ‌సించ‌రు. అలాగే గాయ‌నీ గాయ‌కులు సైతం ఆయ‌న‌ను త‌ప్పు ప‌డుతూ మాట్లాడిన సంద‌ర్భాలు లేవు. అయితే త‌నను ఒక తాగుబోతు గిటారిస్ట్ ప్ర‌శ్నించాడ‌ని ఏ.ఆర్. రెహ‌మాన్ వెల్ల‌డించారు. కానీ తాగుబోతు ప్ర‌శ్నించి ఉండ‌క‌పోతే తాను మారేవాడిని కాద‌ని కూడా అన్నారు. ఆయ‌న ప్ర‌శ్నించిన కొన్ని వారాల‌ త‌ర్వాత నాకు నెమ్మ‌దిగా అస‌లు విష‌యం అవ‌గాహ‌న అయింది. చాలా ఆలోచించాక నేను మూస‌లో ఉన్నాన‌ని గ్ర‌హించాను. ఇత‌రులు ప్లే చేసే సినిమా మ్యూజిక్ నేను ప్లే చేస్తున్నాన‌ని అర్థం చేసుకున్నాను. నేను అలా చేయ‌కూడ‌ద‌ని కూడా అనుకున్నాను.. ఈ ప్ర‌యాణంలో నేను మారేందుకు ఏడేళ్లు ప‌ట్టింది అని రెహ‌మాన్ తెలిపారు.

తాగుబోతు గిటారిస్ట్ తన సంగీత జ్ఞానాన్ని ప్ర‌శ్నించిన వైనంపై రెహ‌మాన్ ప‌దే ప‌దే గుర్తు చేసుకున్నాన‌ని తెలిపారు. త‌న‌ మనస్సులో ఆ తాగుబోతు లోతైన ముద్ర వేసాడ‌ని తెలిపాడు. ఒక బ్యాండ్ లో ప‌ని చేస్తున్న‌ప్పుడు స‌హ స్వ‌ర‌క‌ర్త‌లు త‌న‌ను ప్ర‌భావితం చేసిన విష‌యం గ్ర‌హించ‌లేక‌పోయాన‌ని తెలిపారు. రెహమాన్ తన చిన్న వయస్సులోనే సంగీత సాధనను ప్రారంభించారు. చిన్నతనంలో ఒక బ్యాండ్ కి ప‌ని చేసేప్పుడు ఆ బ్యాండ్‌లోని గిటారిస్ట్ తాగి ఉన్నాడు.. అతడు నా వైపు తిరిగి ``మీరు సినిమా సంగీతాన్ని ప్లే చేస్తున్నారు`` అని అన్నాడు. ఈ ఘ‌ట‌న‌ 1985 లేదా 86లో జరిగింది.

నా గురించి అతడు చేసిన వ్యాఖ్యపై లోతుగా ఆలోచించినప్పుడు నేను స‌హ‌చ‌ర‌ స్వరకర్తలచే ప్రభావితమవుతున్నానని గ్రహించాను. దీని తర్వాత నేను స్పృహతో ఉన్నాను. రొటీనిటీకి దూరంగా వెళ్లడం ప్రారంభించాను. నా శైలి ఎలా ఉంటుందో గుర్తించే నా మానసిక ప్రయాణం మొద‌లైంది. దాదాపు ఏడేళ్లు పట్టింది. నేను పూర్తిగా ఇత‌రుల‌ ప్రభావాలకు దూరంగా ఉన్నాను అని ఏ.ఆర్. రెహమాన్ వెల్ల‌డించారు. త‌న‌ను విమ‌ర్శించిన‌ గిటారిస్ట్ చెడుగా అన్నాడ‌ని అనుకోలేద‌ని కూడా రెహ‌మాన్ తెలిపారు. అత‌డి మాట‌లు త‌న మ‌న‌సుపై ఎలా ముద్ర వేసాయో గుర్తుంచుకున్నాను అని అన్నారు. ఆ మాట‌లు గుర్తున్నాయి. నాకు ఉప‌యోగ‌ప‌డ్డాయి. నేను నా సంగీతం ఆత్మను పునరుజ్జీవింపజేసాను.. కానీ రొటీన్ ప్యాకేజింగ్ నుండి దూరంగా ఉన్నాను అని రెహమాన్ చెప్పారు. రెహ‌మాన్ ప్ర‌స్తుతం రామ్ చరణ్ -బుచ్చి బాబుల RC 16 కి సంగీతం అందిస్తున్నారు.