Begin typing your search above and press return to search.

శ్రీ‌దేవి 60వ పుట్టినరోజున‌ గూగుల్ అరుదైన‌ స‌త్కారం

అతిలోక సుంద‌రి శ్రీదేవి 60వ పుట్టినరోజు సందర్భంగా సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో నివాళులర్పించింది.

By:  Tupaki Desk   |   13 Aug 2023 7:32 AM GMT
శ్రీ‌దేవి 60వ పుట్టినరోజున‌ గూగుల్ అరుదైన‌ స‌త్కారం
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి 60వ పుట్టినరోజు సందర్భంగా సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో నివాళులర్పించింది. భారత‌దేశ‌ సినీచరిత్రలో ఒక‌ వెలుగు వెలిగిన అసాధార‌ణ న‌టిగా శ్రీ‌దేవికి గొప్ప గౌర‌వం గుర్తింపు ఉన్నాయి. కేవ‌లం నాలుగేళ్ల వ‌య‌సులో బాల‌న‌టిగా ఆరంగేట్రం చేసిన శ్రీ‌దేవి 1976లో కె. బాలచందర్ `మూండ్రు ముడిచు`తో క‌థానాయిక‌గా తొలి అడుగులు వేసింది. ర‌జ‌నీకాంత్- క‌మ‌ల్ హాస‌న్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారులు. అటుపై గురు- శంకర్‌లాల్ వంటి హిట్ చిత్రాల్లోను న‌టిగా మెప్పించింది. పదహారేళ్ల వయసు -కొండవీటి సింహం-వేటగాడు స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో శ్రీ‌దేవి న‌టించింది. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో చెరగని ముద్ర వేసిన అసాధార‌ణ న‌టిగా శ్రీ‌దేవికి గుర్తింపు ద‌క్కింది. తెలుగు, త‌మిళం స‌హా హిందీలోను అగ్ర క‌థానాయిక‌గా ఏలిన గొప్ప చ‌రిత్ర శ్రీ‌దేవికి ఉంది.

హిమ్మత్‌వాలా-సద్మా-చాల్‌బాజ్ స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిందీ చిత్రాల్లో శ్రీ‌దేవి న‌టించింది. కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమాల నాయిక‌గానే కాకుండా న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల‌తో శ్రీ‌దేవి అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకుంది. అలాగే నాయికా ప్ర‌ధాన పాత్ర‌ల్లోను శ్రీ‌దేవి సత్తా చాటారు. నిబంధనలను సవాలు చేస్తూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో అల‌రించిన మేటి న‌టిగా కీర్తినందుకుంది. విరామం తర్వాత శ్రీదేవి 2012లో `ఇంగ్లీష్ వింగ్లీష్` చిత్రంతో తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ఇక సినీరంగానికి శ్రీ‌దేవి చేసిన కృషికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారం లభించింది. 2017లో క్రైమ్ థ్రిల్లర్ `మామ్`లో అద్భుత న‌ట‌ ప్రతిభతో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును సంపాదించింది.

అకాల మ‌ర‌ణంతో ప్ర‌పంచానికి షాక్:

2018లో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి అకాల మరణం చెంద‌డం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌ను క‌ల‌చివేసింది. దుబాయ్ లో జ‌రిగిన ఓ వేడుక కోసం అటెండ‌యిన శ్రీ‌దేవి హోటల్ బాత్రూమ్ లో కాలు జారి మ‌ర‌ణించారు. నేడు శ్రీ‌దేవి 60వ పుట్టినరోజు సందర్భంగా శ్రీదేవికి ఘ‌న‌మైన నివాళిని ఇస్తూ గూగుల్ డూడుల్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మామ్ శ్రీ‌దేవి బౌతికంగా మ‌ర‌ణించినా కానీ ప్ర‌జ‌ల గుండెల్లో ఎప్ప‌టికీ స్థిరంగా నిలిచి ఉంది. శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వ క‌పూర్ ఇప్ప‌టికే ప‌రిశ్ర‌మ‌లో క్రేజీ నాయిక‌గా వెలిగిపోతోంది. త‌దుప‌రి ఖుషీ క‌పూర్ క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేస్తోంది. పాపా బోనీ క‌పూర్ ఆ ఇద్ద‌రి కెరీర్ ని తీర్చిదిద్దేందుకు త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తున్నారు.