గొప్ప వ్యక్తిత్వంతో మనసులు గెలుచుకున్న గాయకుడు
ప్రతిభావంతులైన గాయనీగాయకులు, సంగీత దర్శకులు స్వదేశంలో సినిమాలతో కంటే, విదేశాలలో కచేరీలతో సంపాదించేది చాలా ఎక్కువ
By: Tupaki Desk | 27 Sep 2024 1:30 AM GMTప్రతిభావంతులైన గాయనీగాయకులు, సంగీత దర్శకులు స్వదేశంలో సినిమాలతో కంటే, విదేశాలలో కచేరీలతో సంపాదించేది చాలా ఎక్కువ. ఇళయరాజా, ఏ.ఆర్.రెహమాన్, ఎస్పీ బాలు, దేవీశ్రీ ప్రసాద్ సహా చాలామంది సంగీత దర్శకులు, గాయకులు వారి విదేశీ ప్రదర్శనల ద్వారా భారీగా ఆర్జించారు.
బాలీవుడ్ నుంచి నవతరంలో అరిజిత్ సింగ్, బాద్ షా లాంటి వారికి విదేశాలలో గొప్ప క్రేజ్ ఉంది. ప్రస్తుతం అరిజిత్ సింగ్ బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు. కానీ అతడి షోలో ఊహించని ఒక సంఘటన అతడిని కలచివేసింది. తనకు చేరువగా వచ్చేందుకు ప్రయత్నించిన ఒక మహిళా అభిమాని మెడ పట్టుకుని సెక్యూరిటీ నిలవరించడం .. దానిని ఆచేతనంగా చూస్తూ అరిజిత్ అలా ఉండిపోవడం.. తర్వాత సారీ చెప్పడం ఇవన్నీ వీడియో ఫుటేజీలో కనిపించగా, అరిజిత్ వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
అతడి ఇటీవలి షోలలోని ఒక వీడియో ఆన్‌లైన్‌లో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఫుటేజీలో గాయకుడు అరిజీత్ వేదిక వద్దకు చేరుకోవడానికి వస్తుండగా ఒక అభిమానిని సెక్యూరిటీ దూరంగా నెట్టారు. అరిజిత్ ప్రదర్శన సమయంలో ఒక మహిళ వేదికపైకి వస్తున్నట్లు క్లిప్ లో కనిపిస్తోంది. సెక్యూరిటీ జోక్యం చేసుకున్నప్పుడు గాయకుడు అరిజిత్ ఆ అభిమానిని ముందుకు రమ్మని సైగ చేసారని ఆమె చెబుతోంది. అయితే ఆమె విషయంలో జరిగిన దానికి గాయకుడు తన అసౌకర్యాన్ని వ్యక్తం చేశాడు. నన్ను క్షమించండి మేడమ్. మిమ్మల్ని రక్షించడానికి నేను అక్కడ ఉంటే బాగుండేది.. అని అన్నారు.
ఒక మహిళ మెడ మీద చెయ్యి వేయడాన్ని అరిజిత్ ఖండించారు. అలా ఎవరినైనా పట్టుకోవడం సరికాదు! అని అతడు అన్నారు. ప్రేక్షకులనుద్ధేశించి మాట్లాడుతూ `దయచేసి కూర్చోండి` అని అభ్యర్ధించాడు. ఆ సమయంలో ఆ స్త్రీకి అరిజిత్ భేషరతుగా క్షమాపణలు చెప్పాడు. ``నన్ను క్షమించండి మేడమ్. మిమ్మల్ని రక్షించడానికి నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను.. కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితి.. దయచేసి కూర్చోండి`` అని అభ్యర్థించాడు. అనంతరం అతడు తన ప్రదర్శనను కొనసాగించడంతో ప్రేక్షకులు హర్షధ్వానాలతో స్పందించారు. అతడి వ్యాఖ్యలు, చర్యలను నెటిజనులు ప్రశంసించారు. చాలామంది అతడిని ``మర్యాదస్థుడైన మనిషి` అని పొగిడేసారు.
అలాగే ఒక క్లిప్‌లో అరిజిత్ `ఏ దిల్ హై ముష్కిల్` టైటిల్ సాంగ్‌ని పాడుతున్నప్పుడు ఒక అభిమాని వేదికపై ఆహారాన్ని ఉంచాడు. అది గమనించిన అరిజిత్ ఆహారాన్ని తీసుకుని తన భద్రతా బృందానికి అందజేసి, అభిమానికి క్షమాపణలు చెబుతూ ``నన్ను క్షమించండి.. ఇది నా ఆలయం. మీరు ఇక్కడ ఆహారం పెట్టలేరు`` అని వ్యాఖ్యానించారు. ఇటీవల అరిజిత్ తన లండన్ సంగీత కచేరీలో బ్రిటిష్ గాయకుడు ఎడ్ షీరన్‌తో కలిసి కనిపించారు. అతడు వారితో కలిసి గడిపిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అరిజిత్ సింగ్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా స్పోటిఫైలో అత్యధికంగా అనుసరించే కళాకారుడు అయ్యాడు. టేలర్ స్విఫ్ట్, ఎడ్ షీరాన్, అరియానా గ్రాండే వంటి పెద్ద స్టార్ సింగర్లను అధిగమించాడు. అనేక రకాల భావోద్వేగాలను అందంగా ప్రదర్శించే అతడి స్వరానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అతడి ఆరంగేట్రం నుండి అతని పాటలు మంచి ఆదరణ పొందినా కానీ, 2013 చిత్రం `ఆషిఖి 2`లో పాడిన తర్వాత అతడి పాపులారిటీ అమాంతం పెరిగింది.