ఆయన బ్రాండ్ తోనే ఇదంతా సాధ్యమా?
రెహమాన్ సంగీతమంటే ఒకప్పుడు చెవుకొసుకునే అభిమానులెంతో మంది. కానీ ఇప్పుడా సీన్ పెద్దగా కనిపించడం లేదు
By: Tupaki Desk | 2 Jun 2024 7:27 AM GMTరెహమాన్ సంగీతమంటే ఒకప్పుడు చెవుకొసుకునే అభిమానులెంతో మంది. కానీ ఇప్పుడా సీన్ పెద్దగా కనిపించడం లేదు. చాలా కాలంగా ఆయన చేస్తోన్న సినిమాలు మ్యూజికల్ గా సక్సెస్ అవ్వడం లేదు. శ్రోతలకు బలంగా రీచ్ అవ్వడం లేదనే విమర్శ చాలా కాలంగా వినిపిస్తుంది. ఒకప్పుడు రెహమాన్ ఏమైపోయాడంటూ? ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన వారే. ఈ క్రమంలోనే ఆయన విదేశాల్లో మ్యూజిక్ కన్సర్ట్ లు చేసుకోవడం జరిగింది.
సినిమాలకంటే ఎక్కువ ఆదాయం వాటి ద్వారానే వస్తుందని ప్రచారం సాగింది. రెహమాన్ పనితనం గురించి ఓ సందర్భంలో రామ్ గోపాల్ వర్మ కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మార్కెట్ లోకి ఆ రకమైన అసంతృప్తి అంతే బలంగా వెళ్లింది. అవకాశాలు ఇద్దామనుకున్న వారు కూడా ఆ వీడియో చూసిన తర్వాత ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్న వాళ్లు లేకపోలేదు. ఇలా రెహమాన్ పై 50 శాతం ప్రతికూలత అయితే కనిపిస్తుంది.
కానీ ఆయన లైనప్ చూస్తే మాత్రం స్టన్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఆయన చాలా సినమాలకు సంగీతం అందిస్తున్నారు. ఏక కాలంలో మూడు భాషల్లో పనిచేస్తున్నారు. తెలుగులో రామ్ చరణ్ 16వ చిత్రానికి ఆయనే సంగీతం అందిస్తున్నారు. అలాగే ధనుష్ -సందీప్ కిషన్ నటిస్తోన్న `రాయన్` కి కూడా ఆయనే బాణీలు సమకూర్చుతున్నారు. కమల్ హాసన్ -మణిరత్నం కాంబోలో రూపొందుతున్న `థగ్ లైఫ్` కి కూడా ఆయనే బాధ్యతలు తీసుకున్నారు.
ఇక హిందీలో రణబీర్ కపూర్ - సాయిపల్లవి జంటగా నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం` రామాయణం` ఆయనే సంగీతం అందిస్తున్నారు. ఇంకా `లాహోర1947`, ధనుష్ మరో మూవీ `తేరే ఇష్క్ మేన్`, విక్కీ కౌశల్ రష్మిక మందన్నల `చావా` అన్నీ, జయం రవి నటిస్తోన్న `జీని` చిత్రాలకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా మూడు-నాలుగు సినిమాలు చర్చలో దశలో ఉన్నాయి. మరి రెహమాన్ పై నెగిటివిటీ ఉన్నా? ఇదంతా ఎలా సాధ్యమంటే? ఆయన బ్రాండ్ ఇమేజ్ తోనే ఇన్ని సినిమాలకు పని చేస్తున్నట్లు చెప్పొచ్చు.