Begin typing your search above and press return to search.

భార‌తీయుడు 3 కోసం AR రెహమాన్?

ఉల‌గ‌నాయ‌గ‌న్ కమల్ హాసన్ న‌టించిన `భారతీయుడు 2` విడుదలైంది. ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

By:  Tupaki Desk   |   13 July 2024 7:41 AM GMT
భార‌తీయుడు 3 కోసం AR రెహమాన్?
X

ఉల‌గ‌నాయ‌గ‌న్ కమల్ హాసన్ న‌టించిన `భారతీయుడు 2` విడుదలైంది. ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ద‌ర్శ‌కుడు శంక‌ర్ భారీత‌నం నిండిన పాట‌లు, స‌న్నివేశాల‌తో మెప్పించినా కానీ, ఎమోష‌న్ ప‌రంగా క‌నెక్టివిటీ స‌రిగా కుద‌ర‌లేద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. దీంతో పాటు ప్ర‌ధానంగా భార‌తీయుడు 2 బీజీఎం, సంగీతం గురించి సోష‌ల్ మీడియాల్లో విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది.

చాలా మంది ఏ.ఆర్.రెహ‌మాన్ అభిమానులు అనిరుధ్ సంగీతం భార‌తీయుడు (పార్ట్ 1) రేంజులో లేద‌ని విమ‌ర్శించ‌గా, బీజీఎం విష‌యంలో అనిరుధ్ శ్ర‌మ‌ను ప్ర‌శంసించ‌ని వారు లేక‌పోలేదు. భార‌తీయుడు పాట‌లు ఇన్ స్టంట్ చార్ట్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. ఆ రేంజులో సీక్వెల్ పాట‌లు వ‌ర్క‌వుట్ కాలేదు కానీ నేప‌థ్య సంగీతం విష‌యంలో అనిరుధ్ ఫ‌ర్వాలేదనిపించాడ‌ని విశ్లేషిస్తున్నారు. కొంద‌రికి థీమ్ మ్యూజిక్ కూడా అంత‌గా క‌నెక్ట్ కాలేదు. పాట‌లతో పాటు నేప‌థ్య సంగీతం డ‌ల్ గా అనిపించాయ‌ని విమ‌ర్శించారు.

ఏది ఏమైనా కానీ రెహ‌మాన్ స్థాయిలో అనిరుధ్ నుంచి ఔట్ పుట్ ని ఆశించ‌డం అత్యాశే అవుతుంది. అస్కార్ రేంజ్ సంగీత ద‌ర్శ‌కుడితో అనిరుధ్ లాంటి నేటిత‌రం మ్యూజిక్ డైరెక్ట‌ర్ ని పోల్చ‌డం కూడా స‌రికాద‌నే చ‌ర్చా సాగుతోంది. అయితే శంక‌ర్ ముందే చెప్పిన‌ట్టు పార్ట్ 1లో ఉన్న థీమ్ మ్యూజిక్ ని రెండో భాగం కోసం అనిరుధ్ కొన్నిచోట్ల ఉప‌యోగించుకోవ‌డం మిన‌హా పెద్ద‌గా చెప్పుకోవ‌డానికి ఏదీ లేదు.

AR రెహమాన్ 1996 లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన భార‌తీయుడు కి సంగీతం అందించారు.. సీక్వెల్‌కి అనిరుధ్ రవిచందర్ ని ఎందుకు రీప్లేస్ చేసారు? అని చాలా మంది శంక‌ర్ ని ప్ర‌శ్నించారు. దానికి స‌మాధానం చెప్పేందుకు శంక‌ర్ చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. AR రెహమాన్ స్వరపరిచిన మొదటి భాగం ఐకానిక్ సౌండ్‌ట్రాక్ వలె ఇండియన్ 2 సంగీతం అంత ప్రజాదరణ పొందనప్పటికీ అనిరుధ్ తన వంతు కృషి చేశాడని చిత్ర‌బృందం వివ‌ర‌ణ ఇచ్చింది. మునుముందు భార‌తీయుడు 3 విడుద‌ల కానుంది. దానికోసం తిరిగి రెహ‌మాన్ ని శంక‌ర్ తీసుకుని వ‌స్తారా? అన్న‌ది వేచి చూడాలి.