Begin typing your search above and press return to search.

100శాతం ఆక్యుపెన్సీ ఆత్మహత్యే.. ఒకరి దురాశకు జనం బలవ్వాలా..? గుండెల్ని తాకుతున్న వైద్యుడి లేఖ!

By:  Tupaki Desk   |   6 Jan 2021 9:27 AM GMT
100శాతం ఆక్యుపెన్సీ ఆత్మహత్యే.. ఒకరి దురాశకు జనం బలవ్వాలా..? గుండెల్ని తాకుతున్న వైద్యుడి లేఖ!
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయ తాండవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలదన్నట్టుగా దూసుకొస్తున్న కరోనా మరోరూపం ‘స్ట్రెయిన్’తో ప్రపంచం ప్రాణభయంతో భీతిల్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీని 50శాతం నుంచి 100కు పెంచుతూ ఆదేశాలు జారీచేయడంతో జరగబోయే ఉపద్రవాన్ని తలుచుకొని భయాందోళనకు గురవుతున్నారు చాలా మంది. కోలీవుడ్ సినీ పరిశ్రమకే చెందిన అరవింద్ స్వామి సహా పలువురు సినీప్రముఖులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ‘అరవింద్ శ్రీనివాస్’ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ అందరి గుండెల్నీ తాకుతోంది. కొందరి దురాశ కోసం.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఎంతో మందిని ప్రమాదంలోకి నెట్టబోతోందన్న ఆ డాక్టర్.. ఇప్పటి వరకూ వేలాదిమంది వైద్యులు, ఇతర రంగాల వారు పడిన కష్టాన్ని బుగ్గిపాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ లేఖ.. సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతోంది.. అందర్నీ తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. ఆ పోస్టు ఇలా ఉంది.

"ప్రియమైన నటులు విజయ్ సర్, సిలంబరసన్ (శింబు) సర్ మరియు గౌరవనీయ తమిళనాడు ప్రభుత్వం...

నేను అలసిపోయాను. మేమంతా అలసిపోయాం. నాలాంటి వేలాది మంది వైద్యులు అలసిపోయారు. హెల్త్ కేర్ వర్కర్స్ అలసిపోయారు. పోలీసు అధికారులు అలసిపోయారు. శానిటరీ కార్మికులు అలసిపోయారు. కరోనా వల్ల జరిగిన నష్టాన్ని సాధ్యమైనంత తక్కువ చేయాలని మేమంతా క్షేత్రస్థాయిలో ఇన్నాళ్లూ చాలా కష్టపడ్డాం.

మేము మా పనికి గొప్పగా ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే దాని గురించి అంత గొప్పగా ఏమీ లేదు. మా ముందు కెమెరాలు లేవు. మేము స్టంట్ విన్యాసాలు చేయం. మేము హీరోలం కాదు. కానీ మాకు కొంచెం ఊపిరి తీసుకునే సమయం ఇవ్వండి. దానికి మేం అర్హులమని భావిస్తున్నాం. ఒకరి స్వార్థానికి, దురాశకు మనం బలైపోకూడదు.మహమ్మారి ఇంకా ముగియలేదు. ఈరోజుకీ ప్రజలు కరోనా బారినపడి చనిపోతున్నారు.

వంద శాతం థియేటర్ ఆక్యుపెన్సీ ఆత్మహత్యాసదృశం. దీనికి బదులుగా నరమేధం చేస్తే సరిపోయేది. ఈ పాలసీలు రూపొందించేవాళ్లు, సినిమా హీరోలు ఎవ్వరూ జనం మధ్య, తోసుకుంటూ వెళ్లి సినిమా చూడరు. ఇదొక నికృష్టమైన వ్యవస్థ. డబ్బు కోసం జీవితాలతో వ్యాపారం చేస్తున్నారు.

థియేటర్లలో వందశాతం ఆక్యుపెన్సీ ఇచ్చేబదులు, అంతా కలిసి ఇంకాస్త శ్రమంచి వైరస్ ను అడ్డుకునేందుకు ఓ విధానాన్ని తయారుచేయలేమా? ఎగసిపడుతున్న మంటల్ని కాస్త చల్లార్చలేమా? మనం ఇంకా ప్రమాదంలోనే ఉన్నామని ఈ పోస్టులో శాస్త్రీయంగా చెప్పాలనుకున్నాను. కానీ ఇదంతా చూసిన తర్వాత "నాకు అవసరమా" అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.

ఇట్లు..
బాగా అలిసిపోయిన ఓ స్థానిక వైద్యుడు’’

ఈ విధంగా లేఖను ముగించారు డాక్టర్ అరవింద్ శ్రీనివాస్. ఈ లేఖను చూసిన వారంతా ఆవేదనతో నిట్టూరుస్తున్నారు. శ్రీనివాస్ లేఖలో చెప్పినవి నూటికి నూరుపాళ్లు వాస్తవమని అంటున్నారు. మరి, అందరి హృదయాలను తాకుతున్న ఈ లేఖ.. అటు హీరోలను, ఇటు ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తుందో లేదో చూడాలి.