Begin typing your search above and press return to search.

సినిమాల రిలీజా.. క్లియరెన్స్ సేలా?

By:  Tupaki Desk   |   14 Dec 2017 5:30 PM GMT
సినిమాల రిలీజా.. క్లియరెన్స్ సేలా?
X
పెద్ద సినిమాలు కొంచెం ఖాళీ ఇస్తే చాలు.. చిన్న సినిమాలు వరస కట్టేస్తుంటాయి. ఐతే ఎంత ఖాళీ దొరికినా ఒక వీకెండ్లో రెండంకెల సంఖ్యలో సినిమాలు రిలీజైతే పరిస్థితి ఎలా ఉంటుంది..? జనాలకు ఆ సినిమాలపై ఏమాత్రం ఆసక్తి పుడుతుంది..? ఇదేమీ ఆలోచించకుండా ఎవరికి వాళ్లు తమ సినిమాల్ని విడుదలకు సిద్ధం చేసేస్తున్నారు. గత నెలలో ఇలాగే ఒక వారం ఐదారు.. ఇంకో వారం ఏడెనిమిది సినిమాలు రిలీజ్ చేశారు. నవంబరు మొత్తంగా 30 సినిమాలకు పైగా రిలీజయ్యాయి. ఇప్పుడు డిసెంబర్లో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. ఈ వీకెండ్లో ఏకంగా 13 సినిమాలు చేస్తుండటం విశేషం.

‘కుటుంబ కథా చిత్రం’.. ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’.. ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’.. ‘లచ్చి’.. ‘ఇది మా ప్రేమకథ’.. ‘సీత.. రాముని కోసం’... ‘మరో దృశ్యం’.. ‘ప్రేమ పందెం’.. ‘మామా ఓ చందమామ’?. ‘ఉందా లేదా’.. ‘తొలి పరిచయం’.. ‘పడిపోయా నీ మాయలో’.. ‘10’.. ఇవీ ఈ వీకెండ్లో విడుదలవుతున్న సినిమాలు. ఉన్న మాట చెప్పాలంటే.. వీటిలో జనాల్ని థియేటర్లకు రప్పించే సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. గత నెలలో కూడా ఇలాగే లెక్కకు మిక్కిలి సినిమాలు రిలీజయ్యాయి కానీ.. వాటిలో ఒకటో రెండో అయినా ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి రేకెత్తించాయి. కానీ ఈ వీకెండ్ సినిమాల్లో అలాంటిది ఒక్కటీ కనిపించడం లేదు. వీటిలో చాలా వరకు రిలీజయ్యాయంటే అయ్యాయి అనిపించే సినిమాలే. వచ్చేవారం ‘ఎంసీఏ’.. ‘హలో’ లాంటి క్రేజీ సినిమాలు వస్తుండటంతో ఈ వారం ఓ మోస్తరు సినిమాలు ఏవీ రిలీజ్ కావట్లేదు. ఇయర్ ఎండ్ క్లియరెన్స్ సేల్ లో స్టాక్ మొత్తం బయటికి పంపించేస్తున్న తరహాలో కనిపిస్తోంది పరిస్థితి. చూద్దాం మరి.. వీటిలో ఒక్క సినిమా అయినా ప్రేక్షకాదరణ పొందుతుందేమో.