Begin typing your search above and press return to search.

మెగా వారసుడి సినీ ప్రస్థానానికి 14 ఏళ్ళు..!

By:  Tupaki Desk   |   28 Sep 2021 7:36 AM GMT
మెగా వారసుడి సినీ ప్రస్థానానికి 14 ఏళ్ళు..!
X
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్.. 'మెగా పవర్ స్టార్' గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'చిరుత' సినిమాతో హీరోగా పరిచయమైన చరణ్.. యాక్టింగ్ - ఫైట్స్ - డ్యాన్స్ - డైలాగ్ డెలివరీలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న చెర్రీ.. ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్ళు పూర్తయ్యింది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ''చిరుత''. వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మాత సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నేహా శర్మ హీరోయిన్ గా నటించగా.. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 2007 సెప్టెంబర్ 27న విడుదల అయిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న చరణ్.. నేటితో 14 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు చెర్రీ సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

'చిరుత' సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో 'మగధీర' లో నటించిన రామ్ చరణ్.. రెండో చిత్రంతోనే ఇండస్ట్రీ రికార్డ్ సాధించాడు. ఈ క్రమంలో వచ్చిన 'ఆరెంజ్' సినిమా నిరాశ పరిచింది. అయితే వెంటనే వచ్చిన 'రచ్చ' 'నాయక్' 'ఎవడు' లాంటి మాస్ సినిమాలతో మెప్పించాడు. ఈ క్రమంలో 'బ్రూస్లీ' 'గోవిందుడు అందరి వాడే' 'వినయ విధేయ రామ' సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక బాలీవుడ్ డెబ్యూ 'జంజీర్' మూవీ కూడా డిజాస్టర్ అవడమే కాకుండా.. మంచి సినిమాని రీమేక్ చేసి చెడ గొట్టారనే విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఎన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ రామ్ చరణ్ డిజప్పాయింట్ అవ్వకుండా.. కథల ఎంపికలో వైవిధ్యం చూపించి సక్సెస్ అయ్యారు. 'ధృవ' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన చరణ్.. 'రంగస్థలం' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబర్చిన చెర్రీ.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇలా తన ఇమేజ్ ను మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్న చరణ్.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపై దృష్టి సారించాడు.

'మగధీర' 'బ్రూస్లీ' 'ఖైదీ నెం.150' వంటి చిత్రాల్లో తండ్రితో కాసేపు కలిసి నటించిన చరణ్.. 'ఆచార్య' లో తొలిసారి చిరంజీవి తో పూర్తి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చివరి దశకు వచ్చేసింది. ఇదే క్రమంలో భారతదేశం గర్వించదగ్గ దర్శకులు శంకర్ - రాజమౌళి లతో రెండు భారీ సినిమాలు చేస్తున్నాడు చెర్రీ. ఈ ఘనత చిత్ర పరిశ్రమలో మరే హీరోకి దక్కలేదు. ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. శంకర్ తో చేస్తున్న '#RC15' చిత్రాన్ని ఇటీవలే సెట్స్ మీదకు తీసుకెళ్లారు.

ఇకపోతే రామ్ చరణ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి తన తండ్రితో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రాన్ని నిర్మించాడు. ఆ తర్వాత చిరు చేసిన 'సైరా నరసింహా రెడ్డి' చిత్రానికి కూడా చెర్రీ నే నిర్మాత. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమాతో పాటుగా 'గాడ్ ఫాదర్' చిత్రానికి కూడా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇలా చరణ్ ఓవైపు హీరోగా మరో నిర్మాతగా కూడా కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.