Begin typing your search above and press return to search.

ఏపీలో ఒక్క జిల్లాలోనే 15 థియేటర్స్ సీజ్..!

By:  Tupaki Desk   |   22 Dec 2021 4:20 PM GMT
ఏపీలో ఒక్క జిల్లాలోనే 15 థియేటర్స్ సీజ్..!
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్లపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తోన్న థియేటర్లపై కఠిన చర్యలు తీసుకోడానికి సిద్ధమైన ప్రభుత్వం.. కృష్ణా - విజయనగరం - ప్రకాశం జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. సినిమా టికెట్ల ధరలు - థియేటర్లలోని ఫైర్ సేఫ్టీ సదుపాయాలు - క్యాంటీన్ నిర్వహణ గురించి వివరాలు తెలుసుకుంటున్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్ ను పాటిస్తున్నారా లేదా అనే విషయాలపై ఆరాలు తీస్తున్నారు. థియేటర్లకు లైసెన్సులు జారీ చేసే జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

కృష్ణా జిల్లా విజయవాడలో బుధవారం జేసీ మాధవీలత ఆధ్వర్యంలో థియేటర్ల తనిఖీలు కొనసాగాయి. నగరంలోని 15 థియేటర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న 15 థియేటర్లను మూసివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు జేసీ మీడియాకు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్లలో తనిఖీలు చేస్తున్నామని.. నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ప్రేక్షకుల భద్రత కోసం నిబంధనలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నామని.. కొన్ని థియేటర్లలో టికెట్ ధరల కంటే తినుబండారాల ధరలు ఎక్కువగా ఉన్నాయని మాధవీలత అన్నారు. త్వరలోనే మల్టీఫ్లెక్స్ లతో పాటు అన్ని థియేటర్లకు ఫిక్స్డ్ రేట్లు నిర్ణయించి బోర్డులు పెడతామని తెలిపారు. జీవో 35ను కోర్టులో కొట్టేయడంతో అంతకు ముందు రేట్లు అమలుపై దృష్టి పెట్టామని.. టికెట్ రేట్ల పెంపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని జేసీ పేర్కొన్నారు.

ఇక విజయనగరం జిల్లాలోని థియేటర్లలో జాయింట్ కలెక్టర్ కిషోర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మూడు సినిమా థియేటర్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. 2015 నుంచి సేఫ్టీ లైసెన్స్ రెన్యువల్ చేయని పూసపాటిరేగ లోని ఓ సినిమా హాలును సీజ్ చేశారు. అలాగే భోగాపురం - నెల్లిమర్ల లో అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న రెండు థియేటర్లను మూసివేశారు. ఒంగోలులోని పలు థియేటర్లలో అధికారులు తనిఖీలు చేసినట్లు సమాచారం. టికెట్లు - తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని తెలుస్తోంది.

కాగా, ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉత్తర్వులపై థియేటర్ల యాజమానులు కోర్టుకు వెళ్లడంతో.. జీవో నెం.35 ని రద్దు చేస్తూ పాత పద్ధతిలోనే టికెట్లు విక్రయించాలని ధర్మాసనం తెలిపింది. జాయింట్ కలెక్టర్ల ముందస్తు అనుమతితోనే టికెట్ రేట్లను పెంచుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లపై తనిఖీలు చేస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సినిమా హాళ్లపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా అధికారుల తీరుపై ఎగ్జిబిటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో జరుగుతున్న తనిఖీల గురించి చర్చించడానికి రేపు గురువారం (డిసెంబర్ 23) థియేటర్ యజమానులు విజయవాడలో సమావేశం కానున్నారని తెలుస్తోంది.