Begin typing your search above and press return to search.

ఇండియన్ మూవీ బాక్సాఫీస్ బాద్షా@19

By:  Tupaki Desk   |   11 Nov 2021 11:31 AM GMT
ఇండియన్ మూవీ బాక్సాఫీస్ బాద్షా@19
X
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్ అనడంలో సందేహం లేదు. ఎంత మంది బాలీవుడ్‌ స్టార్‌ లు ఉన్నా కూడా పాన్ ఇండియా స్టార్‌.. సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ మాత్రమే అంటూ అభిమానులు బల్లగుద్ది మరీ చెప్తారు. ఆ విషయాన్ని బాక్సాఫీస్ రికార్డులు రుజువు చేయగా.. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు పాన్ ఇండియాను మించి ఉంటున్నాయి అనడంలో సందేహం లేదు. బాహుబలి సినిమా తో ఏ బాలీవుడ్‌ స్టార్‌ కు అందనంత దూరంలో నిల్చున్నాడు. సాహో తో తన స్థానంను మరింతగా పదిలం చేసుకున్నాడు. ఇక ముందు రాబోతున్న ప్రతి సినిమా కూడా ఆయన్ను ఏ ఇండియన్ స్టార్‌ కు కూడా చిక్కకుండా.. అందకుండా చేయబోతున్నాయనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ప్రభాస్‌ సినీ రంగ ప్రవేశం చేసి 19 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్బంగా అభిమానులు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ప్రభాస్‌ 19 ఏళ్ల సినీ జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నారు. #19YearsForPrabhas హ్యాష్‌ ట్యాగ్‌ తో ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్ పై ప్రభాస్ అభిమానులు దేశ వ్యాప్తంగా ట్రెండ్ చేస్తున్నారు.

టాలీవుడ్ రెబల్‌ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న కృష్ణం రాజు ఫ్యామిలీ నుండి ఆయన నట వారసుడిగా 2002 లో సరిగ్గా ఇదే రోజున ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్‌ తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ లో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అందరితో స్నేహంగా ఉంటూ.. తనకు దక్కిన సినిమాలకు పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు ఎంత కష్టమైన పడుతూ పెదనాన్న రెబల్‌ స్టార్‌ ను తన పేరు ముందుకు అభిమానులు తెచ్చేలా చేసుకున్నాడు. విభిన్నమైన జోనర్‌ లో సినిమాలు చేసి ఎంతో మంది యంగ్‌ హీరోలకు ఆదర్శంగా నిలిచిన ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన చత్రపతి సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. ఆ తర్వాత కూడా ప్రభాస్ వరుగా భారీ యాక్షన్‌ సినిమాలను చేశాడు. మిర్చి వంటి ఒక విభిన్నమైన కమర్షియల్‌ సినిమా తర్వాత వెంటనే సినిమాలు చేయకుండా మూడు నాలుగు ఏళ్ల పాటు జక్కన్నకు డేట్లు ఇచ్చి బాహుబలి చేశాడు.

ఒక్క సినిమాకు అంత సమయం ఏంటీ.. ఎంతో కీలకమైన కెరీర్‌ ను ప్రభాస్ వృదా చేసుకుంటున్నాడు అంటూ కొందరు విమర్శలు చేశారు. కాని ప్రభాస్ మాత్రం బాహుబలిని నమ్మాడు. రాజమౌళి అద్బుతంగా ఆ సినిమాను తెరకెక్కించి ఇండియన్ సినీ చరిత్రలో నిలిచి పోయేలా చేసి ప్రభాస్ కు కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్ ను ఇచ్చాడు. బాహుబలి తో వచ్చిన సక్సెస్‌.. క్రేజ్ ను కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు. తప్పటడుగులు వేస్తే మొత్తం నాశనం అవుతుంది. పైగా అదే బాహుబలి ప్రభాస్ కెరీర్ లో మైనస్‌ గా కూడా అయ్యేది. కాని ప్రభాస్ ఏమాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. బాహుబలి తర్వాత సాహో వంటి భారీ యాక్షన్ సినిమాను చేయడం ద్వారా హిందీ ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు. మరో వైపు రాధే శ్యామ్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. సాహోకు ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా అప్పీల్ తో రాధే శ్యామ్‌ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ 19 ఏళ్ల సినీ కెరీర్‌ లో ప్రభాస్‌ చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా దక్కించుకున్న విజయాలు.. పొందిన కీర్తి అమోఘం. అయిదు దశాబ్దాల సినీ చరిత్ర ఉన్న వారు కూడా ఇప్పుడు ప్రభాస్‌ వెనుకే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రభాస్ సినీ కెరీర్‌ రాబోయే రెండేళ్లలో మరింత మారబోతుంది. రాధే శ్యామ్‌.. ఆదిపురుష్‌.. సలార్.. స్పిరిట్.. ప్రాజెక్ట్‌ కే ఇంకా బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ అన్ని కలిపి రాబోయే రెండు మూడేళ్లలో రాబోతున్నాయి. ప్రతి ఒక్క సినిమా కూడా అద్బుతంగా ఉండటంతో పాటు పాన్‌ ఇండియా.. గ్లోబల్‌ గా అలరించబోతున్నాయి అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. అద్బుతమైన సినిమాలు ప్రభాస్ నుండి మరిన్ని రాబోతున్నాయి. ఇండియన్ సినిమా స్థాయిని బాలీవుడ్ కు పెంచే స్థాయిలో ప్రభాస్ సినిమాలు ఉండబోతున్నాయి అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.