Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘2 కంట్రీస్’

By:  Tupaki Desk   |   29 Dec 2017 10:05 AM GMT
మూవీ రివ్యూ: ‘2 కంట్రీస్’
X
చిత్రం : ‘2 కంట్రీస్’

నటీనటులు: సునీల్ - మనీషా రాజ్ - సంజన - పృథ్వీ - శ్రీనివాసరెడ్డి - దేవ్ గిల్ - షాయాజి షిండే - చంద్రమోహన్ - సితార - నరేష్ - రాజా రవీంద్ర తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: సి.రామ్ ప్రసాద్
మాటలు: అబ్బూరి రవి
స్క్రీన్ ప్లే - దర్శకత్వం - నిర్మాత: ఎన్.శంకర్

హీరోగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు సునీల్. అతడి చివరి సినిమా ‘ఉంగరాల రాంబాబు’ కూడా దారుణమైన ఫలితాన్నందుకుంది. ఇప్పుడతను ‘2 కంట్రీస్’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మలయాళంలో ఇదే పేరుతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా ఇది. సీనియర్ దర్శకుడు ఎన్.శంకర్ తన స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందించాడు. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఉల్లాస్ కుమార్ (సునీల్)కు డబ్బంటే పిచ్చి. అందుకోసం ఎంతకైనా తెగిస్తుంటాడు. దిగజారి పోతుంటాడు. అందరినీ బురిడీ కొట్టించి బతికేస్తున్న ఉల్లాస్.. తన చిన్ననాటి స్నేహితురాలైన లయ (మనీషా రాజ్)కు కూడా అలాగే లేని పోని అబద్ధాలు చెప్పి తనతో పెళ్లికి ఒప్పిస్తాడు. ఐతే లయతో పెళ్లి తర్వాత ఆమె గురించి సంచలన విషయాలు తెలుస్తాయి ఉల్లాస్ కు. తర్వాత ఆమె అతడిని వదలేసి అమెరికా వెళ్లిపోతుంది. తన భార్యను వెతుక్కుంటూ అమెరికా వెళ్లిన ఉల్లాస్ కు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. చివరికి ఉల్లాస్-లయ కథ సుఖాంతమైందా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘‘నేను చెరకు రసం లాంటోడిని. తాగేవాడికి బలం. అమ్మేవాళ్లకు ధనం’.. ‘‘నేను తేనెపట్టు లాంటోడిని.. పిండేకొద్దీ హనీ.. అమ్మేకొద్దీ మనీ’’.. ‘‘కొబ్బరి కాయ వచ్చాక చిప్పలు తప్పవు. వాడిని పట్టుకోవాలంటే తిప్పలు తప్పవు’’.. దశాబ్దం కిందటే ఇలాంటి డైలాగుల్ని ఔట్ డేటెడ్ అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ‘2 కంట్రీస్’లో ఇలాంటి డైలాగులకు లెక్కే లేదు. సినిమా అంతటా ఇలాంటి డైలాగులే ఉంటాయంటే.. ఇక ‘2 కంట్రీస్’ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మలయాళంలో ‘2 కంట్రీస్’ సినిమా బ్లాక్ బస్టర్ ఎందుకైందో ఏమో కానీ.. దీని రీమేక్ అయిన ఈ ‘2 కంట్రీస్’ మాత్రం సునీల్ గత సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయి ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తుంది.

వందల కోట్ల ఆస్తి ఉన్న ఒక ఎన్నారై అమ్మాయి పెళ్లి సంబంధం కోసం బ్రోకర్ కు ఫోన్ చేస్తుంది. ఆమెతో వేరెవరో మాట్లాడాల్సి ఉంటే హీరో మాట్లాడతాడు. అతనేదో కబుర్లు చెబితే ఇంప్రెస్ అయిపోయి.. ఫ్యామిలీతో ఇక్కడికి దిగిపోతుంది. ఏ పనీ లేకుండా ఉన్న హీరోను పెళ్లాడేస్తుంది. ఇదీ ‘2 కంట్రీస్’ కథ నడిచే తీరు. ఎంత మాస్ ప్రేక్షకుల్ని లక్ష్యంగా చేసుకుని సినిమాలు తీసినా.. వాళ్లయినా ఇలాంటి వ్యవహారాలతో ఎలా కన్విన్స్ అవుతారు? సునీల్ ఆల్రెడీ ఎన్నారై బ్యాక్ డ్రాప్ లో చేసిన ‘మిస్టర్ పెళ్లికొడుకు’ తేడా కొట్టినా.. సునీల్ మళ్లీ తనకు నప్పని అదే సెటప్ తో సాగే ‘2 కంట్రీస్’ లో నటించాడు. ఇంతకుముందు లాగా డ్యాన్సులు.. ఫైట్లతో వీర విన్యాసాలు చేయకపోయినా.. అతను డిజైనర్ డ్రెస్సులేసుకుని అమెరికాలో హీరోయిన్ చుట్టూ తిరుగుతుంటే ఎంత మాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు.

అసలు ‘2 కంట్రీస్’ కథలో ఏమాత్రం లాజిక్ లేదు. కొత్తదనమూ లేదు. మలయాళంలో కామెడీ వర్కవుట్ అయి ఉండొచ్చు కానీ.. ఇక్కడ మాత్రం నవ్వించేందుకు చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. సిచ్యువేషనల్.. సటిల్ కామెడీకి పట్టం కడుతున్న ఈ రోజుల్లో ఔట్ డేట్ అయిపోయిన లౌడ్ కామెడీతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది ‘2 కంట్రీస్’ టీం. శ్రీనివాసరెడ్డి.. షాయాజి షిండే.. పృథ్వీ.. నరేష్.. వీళ్లు కాక ఇద్దరు ముగ్గురు జబర్దస్త్ కమెడియన్లు.. ఇలా చాలా మంది కలిసి నవ్వించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఏదీ ఫలించలేదు. డైలాగులు పాత చింతకాయ పచ్చడి టైపులో ఉంటే.. సునీల్ సహా అందరూ గోల గోల చేస్తూ ఆ డైలాగుల్ని పలికి తెర మీద గందరగోళాన్ని సృష్టించారు.

ప్రథమార్ధంలో బావుంది అనిపించే మూమెంట్ కోసం బూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. హీరోయిన్ ఆల్కహాల్ అడిక్ట్ అని బయటపడటం ఒక్కటే కొంచెం కొత్తగా అనిపించే విషయం. ఇక ద్వితీయార్ధమంతా యుఎస్ నేపథ్యంలోనే సాగుతుంది. రిచ్ లొకేషన్లలో భారీ తారాగణంతో ద్వితీయార్ధాన్ని నడిపించారు కానీ.. ఇక్కడ కూడా కథాకథనాల్లో ఏ ప్రత్యేకతా లేకపోయింది. విడాకుల కేసు విచారణ అంటూ కోర్టులో ఒక సీన్ నడిపించారు. అది తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. కథ అమెరికాలో నడుస్తోంది కాబట్టి.. పాత్రలన్నీ ఇంగ్లిష్ యాక్సెంట్ తో తెలుగు మాట్లాడాలనే నియమం పెట్టి.. నరేష్ తోనూ అలాగే మాట్లాడించారు. ఇలాంటి డైలాగులు ఎప్పుడో 70లు.. 80ల్లో చూసేవాళ్లం. కామెడీకి విరామం ఇచ్చి.. చివర్లో కొంచెం ఎమోషన్ల మీద కథ నడిపించడం వల్ల ‘2 కంట్రీస్’ చివర్లో కొంచెం పర్వాలేదనిపిస్తుంది. అలాగని అక్కడా ఏ కొత్తదనం లేదు. ప్రత్యేకంగా చెప్పుకునే అంశాలేమీ లేవు. సునీల్ చివరి సినిమా ‘ఉంగరాల రాంబాబు’తో పోలిస్తే నయం అనిపించొచ్చేమో కానీ.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడంలో ‘2 కంట్రీస్’ది కూడా తక్కువ స్థాయేమీ కాదు.

నటీనటులు:

సునీల్ గురించి ఏమని చెప్పాలి..? కథల ఎంపికలో అతడు ఎటు పోతున్నాడో అర్థం కాని పరిస్థితి. అతను పెద్దగా డ్యాన్సులు.. ఫైట్ల జోలికి పోకుండా సామాన్యుడిలా ఉండే ప్రయత్నం చేసినా.. కథ ఎంపికలో మళ్లీ తప్పటడుగు వేయడంతో ఇంప్రెస్ చేయలేకపోయాడు. నటుడిగా తన వంతు ప్రయత్నం చేసినా.. అదేమీ ఆకట్టుకోదు. హీరోయిన్ మనీషా రాజ్ చూడ్డానికి బాగానే కనిపిస్తుంది. నటన పర్వాలేదు. కానీ ఇలాంటి సినిమాలో నటించడం వల్ల ఆమె ఎలాంటి ముద్రా వేయలేకపోయింది. ఇక సినిమా నిండా బోలెడంత తారాగణం ఉంది. కానీ ఎవ్వరూ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయారు. ఉన్నంతలో పృథ్వీ.. శ్రీనివాసరెడ్డి.. నరేష్ పర్వాలేదు.

సాంకేతికవర్గం:

పిండి కొద్దీ రొట్టె అంటారు. సినిమాను బట్టే సాంకేతిక నిపుణుల పనితీరు కూడా ఉంటుంది. గోపీసుందర్ లాంటి మంచి సంగీత దర్శకుడి మ్యూజిక్ కూడా సాదాసీదాగా అనిపిస్తుంది ‘2 కంట్రీస్’లో. పాటలేవీ రిజిస్టర్ కావు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం బాగానే ఉంది. యుఎస్ ఎపిసోడ్ మొత్తాన్ని రిచ్ గా తీశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కు ఢోకా లేదు. నిర్మాత కూడా అయిన శంకర్ బాగానే ఖర్చు చేశాడు. ఎక్కడా రాజీ పడలేదు. శ్రీధర్ సీపాన డైలాగుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దర్శకుడు శంకర్ శైలికి నప్పని సినిమా ఇది. అలాగే ఈ కథకు సునీల్ ను ఎంచుకోవడమూ కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇక రైటింగ్ విషయంలో శంకర్ విఫలమయ్యాడు. ఔట్ డేటెడ్ నరేషన్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. కామెడీ పండించడం అతడి వల్ల కాలేదు. సినిమా మొత్తాన్ని పాత స్టయిల్లో నడిపించాడు.

చివరగా: 2 కంట్రీస్.. కాలం చెల్లిన కామెడీ!

రేటింగ్- 1.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre