Begin typing your search above and press return to search.

2020 రివైండ్: పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు..!

By:  Tupaki Desk   |   28 Dec 2020 4:10 PM GMT
2020 రివైండ్: పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు..!
X
2020 సంవత్సరం చరిత్రలో లిఖించబడే ఏడాదిగా మిగిలిపోయింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరి జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. అయితే 2020 సంవత్సరం కొందరి సెలబ్రిటీల జీవితంలో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. చాలామంది సెలబ్రిటీలు ఈ ఏడాదే వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కాకపోతే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో అంగరంగ వైభవంగా వివాహ వేడుకను జరుపుకోవాల్సిన వారు సింపుల్ గా కొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలా కరోనా నిబంధనలు పాటిస్తూనే 2020లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సెలబ్రిటీలు ఎవరో ఒక్కసారి రివైండ్ చేసుకుందాం.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కరోనా లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల లిస్టులో ముందు వరుసలో ఉన్నాడు. అప్పటికే పలుమార్లు వాయిదా పడిన నిఖిల్‌ పెళ్లి మే14న జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఫ్యామిలీ మెంబెర్స్ కొందరు సన్నిహితుల మధ్య తన ప్రేయసి డాక్టర్‌ పల్లవి వర్మ మెడలో మూడుముళ్లు వేశాడు నిఖిల్. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లలో ఒకరైన దిల్ రాజు కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. తన మొదటి భార్య చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఒంటరి జీవితం గడిపిన దిల్ రాజు కరోనా డేస్ లో రెండో వివాహం చేసుకున్నారు.

టాలీవుడ్ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లో ఒకరైన దగ్గుబాటి రానా కూడా ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యాడు. లాక్ డౌన్ లోనే తను నాకు ఎస్ చెప్పింది అని ప్రేయసి మిహకను అందరికీ పరిచయం చేసిన రానా.. అదే లాక్ డౌన్ లో వివాహం కూడా చేసుకున్నాడు. రామానాయుడు స్టూడియోలో ఆగస్టు8న మిహికా బజాజ్‌ ను మనువాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు అతిథుల మధ్య తెలుగు మరియు మరాఠీ సంప్రదాయ పద్ధతుల్లో రానా పెళ్లి చేసుకున్నారు.

యువ హీరో నితిన్‌ కూడా కరోనా లాక్ డౌన్ లోనే పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలంగా శాలినితో ప్రేమలో ఉన్న నితిన్‌.. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే కరోనా కారణంగా ముందుగా అనుకున్న ప్లాన్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసుకుని చివరకు జూలై నెలలో సాదాసీదాగా శాలిని మెడలో మూడుముళ్లేసి సరికొత్త బంధంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్‌ లోని ఫలక్‌ నూమా ప్యాలెస్‌ లో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలానే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా వివాహం చేసుకుని కాజల్ కిచ్లు గా మారిపోయింది. గత కొన్నేళ్లుగా యువ పారిశ్రామికవేత్త గౌతమ్‌ కిచ్లుతో ప్రేమలో విహరించిన ఈ చందమామ ఎట్టకేలకు పెళ్లి బాజాలు మోగించింది. అక్టోబర్‌ 30న ముంబయిలోని తాజ్‌ హోటల్‌ లో కాజల్ పెళ్లి జరిగింది.

మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక కల్యాణ వేడుక కూడా ఈ ఏడాదే జరిగింది. ఉదయ్ ‌పూర్‌ లోని ఓ ప్యాలెస్‌ లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ పద్ధతిలో డిసెంబర్‌ 9న జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి జరిగింది. మెగా ఫ్యామిలీతో పాటు కొద్దిమంది అతిథులు, స్నేహితుల మధ్య నిహారిక - చైతన్య జంట ఏడడుగులు వేశారు. ఐదు రోజుల పాటు సంగీత్, మెహందీ, వివాహం, రిసెప్షన్‌ లతో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేశారు. ఇక 2020లో పెళ్లి పీటలు ఎక్కిన వారిలో యువ దర్శకుడు సుజీత్‌ కూడా ఉన్నాడు. ప్రవలిక అనే అమ్మాయిని సుజీత్ పెళ్లి చేసుకున్నాడు. అలానే నటుడు రాజా వివాహం హిమ బిందుతో జరిగింది. 'బ్రోచేవారేవారురా' దర్శకుడు వివేక్‌ ఆత్రేయ-శ్రీజ.. కన్నడ హీరో నిఖిల్‌ గౌడ - రేవతి జంటల పెళ్లిల్లు కూడా ఈ ఏడాదే జరిగాయి.