Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ బాక్సాఫీస్ గలగల ఎప్పుడు?

By:  Tupaki Desk   |   3 Aug 2021 9:30 AM GMT
టాలీవుడ్‌ బాక్సాఫీస్ గలగల ఎప్పుడు?
X
గత ఏడాది సంక్రాంతికి టాలీవుడ్‌ లో వచ్చిన సర్కారు వారి పాట మరియు అల వైకుంఠపురంలో సినిమాలు భారీ విజయాలను దక్కించుకుని రికార్డు స్థాయిలో వసూళ్లను దక్కించుకున్నాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలు విడుదల అయినా కూడా అంతంత మాత్రంగానే ఆడాయి. మార్చి నుండి కరోనా కారణంగా థియేటర్లు మూత పడ్డాయి. మళ్లీ ఈ ఏడాది ఆరంభంలో కాస్త టాలీవుడ్‌ బాక్సాఫీస్ సందడి కనిపించింది. క్రాక్‌ ఆ తర్వాత ఉప్పెన.. వకీల్‌ సాబ్‌ ఇంకా జాతిరత్నాలతో పాటు మరి కొన్ని సినిమాలు కూడా మంచి వసూళ్లను దక్కించుకున్నాయి. ఇతర భాషల్లో మొదటి వేవ్‌ తర్వాత కనిపించని బాక్సాఫీస్ సందడి కేవలం మన టాలీవుడ్‌ లో మాత్రమే కనిపించింది. మార్చిలో సెకండ్‌ వేవ్‌ కారణంగా మళ్లీ థియేటర్లు మూత పడ్డాయి. సెకండ్ వేవ్‌ కారణంగా మూడు నెలల పాటు థియేటర్లు మూత పడ్డాయి. ఎట్టకేలకు మళ్లీ రీ ఓపెన్‌ అయ్యాయి.

జులై 30వ తారీకున సత్యదేవ్‌ నటించిన తిమ్మరుసు మరియు తేజ సజ్జ నటించిన ఇష్క్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాల్లో తిమ్మరుసు సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. చూడదగ్గ సినిమా అంటూ కామెంట్స్ వచ్చాయి. మొదటి రోజు పెద్దగా వసూళ్లు రాకున్నా కూడా శని ఆదివారాల్లో తప్పకుండా సినిమా వసూళ్లు పాజిటివ్ గా వస్తాయని యూనిట్‌ సభ్యులు ఆశించారు. కాని ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి అంటూ రిపోర్ట్‌ అందుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు అంతగా రాణించక పోవడంకు కారణం ఇంకా జనాల్లో కరోనా భయం ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుత సమయంలో సినిమాలు చూడాలంటే జనాలకు కాస్త భయం తప్పడం లేదు. పెద్ద హీరోల సినిమాలు సూపర్‌ గా ఉంది అంటూ టాక్ వస్తే.. అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఉంటే అప్పుడు క్యూ కడుతున్నారు. ఇప్పటికిప్పుడు అలాంటి సినిమా వస్తే ఖచ్చితంగా మరో ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్‌ హిట్‌ గా నిలుస్తుంది. అలాంటి సినిమా ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. స్టార్‌ డమ్‌ ఉన్న హీరో సినిమా వచ్చినా కూడా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు.

కనుక ఎప్పుడైతే పెద్ద హీరోల సినిమా లేదా భారీ సినిమా వస్తుందో లేదా మంచి కంటెంట్‌ ఉన్న ఫ్యామిలీ ఓరియంటెడ్‌ సినిమా వస్తుందో అప్పటి వరకు టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ గల గల వినిపించక పోవచ్చు అంటున్నారు. గతంలో చిన్న చిన్న సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధించిన సందర్బాలు ఉన్నాయి. కనుక ఈ వారంలో రాబోతున్న ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం సినిమా ఆకట్టుకుంటుందేమో చూడాలి. గత వారం వచ్చిన సత్యదేవ్‌ మరియు ఇష్క్‌ సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు నిరాశ పర్చినట్లే. కాని టాలీవుడ్‌ ప్రేక్షకులు ఖచ్చితంగా కరోనాకు భయపడకుండా మంచి సినిమా స్టార్‌ సినిమా పడితే క్యూ కడతారనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.