Begin typing your search above and press return to search.

25వ సెంటిమెంట్ - ప్రిన్స్ కు పరీక్ష

By:  Tupaki Desk   |   6 July 2018 11:58 AM GMT
25వ సెంటిమెంట్ - ప్రిన్స్ కు పరీక్ష
X
ఏ హీరో కెరీర్ లో అయినా కొన్ని ల్యాండ్ మార్క్ ఫిగర్స్ ఉంటాయి. వందో సినిమా లేదా యాభై సినిమా అని. సూపర్ స్టార్ కృష్ణ గారి 300 సినిమా తెలుగువీర లేవరాకు జరిగిన హంగామా అప్పట్లో అంతా ఇంత కాదు. ఇలా వందల్లో సినిమాలు చేయటం సీనియర్ అగ్ర హీరోల వల్ల అయ్యింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ హీరోలు హాఫ్ సెంచరీ దాటితేనే గొప్ప. అందుకే 25వ సినిమా అనేది చాలా స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నారు. మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న మూవీ తనకు 25వది. ఇప్పటికే దీని మీద ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కనక హైప్ భీభత్సంగా ఉంది. కానీ సెంటిమెంట్స్ ని బాగా ఒంటబట్టించుకునే ఇండస్ట్రీలో అభిమానులు దీని గురించి రకరకాల విశ్లేషణలు మొదలు పెడుతున్నారు.

నిన్న విడుదలైన గోపిచంద్ పంతం 25వ సినిమా పంతం ఫలితం అంత ఆశాజనకంగా వచ్చేలా లేదు. మరో మూడు రోజులు ఆగితే పూర్తి క్లారిటీ వస్తుంది. ఆ మధ్య వచ్చిన నితిన్ 25త్ మూవీ చల్ మోహనరంగ రిజల్ట్ తెలిసిందే. సంక్రాంతికి వచ్చిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సైతం పాతికవ సినిమానే. ఇప్పటికీ దాని తాలూకు చేదు జ్ఞాపకాలు మర్చిపోలేదు ఫాన్స్. ఇవన్నీ ఈ మధ్య కాలంలో వచ్చినవి. జూనియర్ ఎన్టీఆర్ రెండేళ్ల క్రితమే ఈ మార్క్ నాన్నకు ప్రేమతో ద్వారా అందుకున్నాడు. అది మరీ గొప్ప అని చెప్పలేం కానీ మంచి విజయాన్ని దక్కించుకుని నష్టాలు రాకుండా చేసింది.

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే చిరంజీవికి ఆడాళ్ళు మీకు జోహార్లు బాలకృష్ణ కు నిప్పులాంటి మనిషి నాగార్జునకు జైత్రయాత్ర చేదు ఫలితాలనే ఇచ్చాయి. ఇవన్నీ 25వ సినిమాలే. వెంకటేష్ 25 వ సినిమా హిందీ లో తీసిన చంటి రీమేక్ అనారి. ఓ మాదిరిగా బాగానే ఆడింది. ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది. ఎంత సెంటిమెంట్ అనుకున్నా దీనికి ఎదురీది జూనియర్ ఎన్టీఆర్-వెంకటేష్ హిట్స్ సాధించారు కాబట్టి మహేష్ కూడా అదే కోవలో బ్లాక్ బస్టర్ అందుకుంటాడని ఫాన్స్ నమ్మకం. ఈ లెక్కలను బట్టి సినిమా ఆడుతుందా ఆడదా అని చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఇలాంటి విశ్లేషణలు కొన్నిసార్లు భలే విచిత్రంగా అనిపిస్తాయి. మహేష్ దీన్ని ఎలా బ్రేక్ చేస్తాడో తెలియాలంటే ఏప్రిల్ 5 దాకా ఆగాల్సిందే.