Begin typing your search above and press return to search.

3డి దెబ్బ గట్టిగానే పడుతోందా?

By:  Tupaki Desk   |   29 Nov 2018 4:53 PM GMT
3డి దెబ్బ గట్టిగానే పడుతోందా?
X
ఇవాళ విడుదలైన విజువల్ బ్రిలియన్స్ మూవీ 2.0 కు భీభత్సమైన ఓపెనింగ్స్ దక్కాయి. కనివిని ఎరుగని స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడంతో ఓపెనింగ్ ఫిగర్స్ షాకింగ్ గానే ఉండబోతున్నాయి. టాక్ తో సంబంధం లేకుండా నిర్మాతలు వేసిన ఈ ఎత్తుగడ బ్రహ్మాండంగా వర్క్ అవుట్ అయ్యిందని వసూళ్లు చెబుతున్నాయి. కాకపోతే ఒక ప్రతికూలాంశం సోమవారం నుంచి జరిగే రన్ ను ప్రభావితం చేయొచ్చని ట్రేడ్ రిపోర్ట్. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో దర్శకుడు శంకర్ పదే పదే దీన్ని 3డి లోనే చూడమని 2డి కంటే పది రేట్లు ఎక్కువ అనుభూతి కలుగుతుందని చెప్పడం నిజానికి రివర్స్ అయినట్టు టాక్.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని మొత్తం స్క్రీన్లలో 3డి సౌకర్యం ఉన్నవి కేవలం పది పన్నెండు శాతం మాత్రమే ఉంటాయని ఒక అంచనా. అందులోనూ అధిక శాతం మల్టీ ప్లెక్స్ లో ఉన్నవి. సింగల్ స్క్రీన్స్ దాదాపు ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోలేదు. హాలీవుడ్ సినిమాలను ప్రదర్శించే అవకాశం రాకపోవడం దీనికి కారణంగా చెప్పొచ్చు. తీరా ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా చూసిన వాళ్ళు ఇది 3డి లోనే చూడాలని ఊదరగొడుతుండటం నేరుగా 2డి మాత్రమే ఉన్న థియేటర్ల మీద ప్రభావం చూపిస్తోందని ఎగ్జిబిటర్లు అంటున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. శంకర్ కూడా ఇదే మాట ప్రీ రిలీజ్ లో అనడంతో ప్రేక్షకులు ఒక రోజు ఆలస్యమైనా 3డిలోనే చూడమని డిసైడ్ కావడంతో పరిస్థితి ఇలా అయ్యిందని అంటున్నారు.

హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో ఇది మరీ తీవ్రమైన సమస్య కాదు కానీ బిసి సెంటర్స్ లో చాలా చోట్ల అసలు 3డి స్క్రీన్లే లేవు. అక్కడ మొదటి రెండు మూడు రోజులు బాగానే ఉన్నా 3డిలోనే చూసి తీరాలన్న ప్రచారం మిగిలినవాళ్లను వెనక్కు లాగే అవకాశం లేకపోలేదు.దీని గురించి పూర్తి స్పష్టత రావాలి అంటే వీక్ డేస్ లో రెండు థియేటర్ల వసూళ్లను పోల్చి చూసుకుంటే అర్థమైపోతుంది.