Begin typing your search above and press return to search.

ఏపీలో ర‌గ‌డ‌.. 70 థియేట‌ర్లు మూసివేత‌?

By:  Tupaki Desk   |   23 Dec 2021 8:30 AM GMT
ఏపీలో ర‌గ‌డ‌.. 70 థియేట‌ర్లు మూసివేత‌?
X
ఎగ్జిబిష‌న్ రంగంపై వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతోంద‌న్న ఆందోళ‌న నెల‌కొంది. ముఖ్యంగా టికెట్ రేట్ల త‌గ్గింపుతో పాటు.. ఏపీలో థియేట‌ర్ల‌లో సాగుతున్న సోదాలు ఇందుకు నిద‌ర్శ‌నంగా మారాయ‌ని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

సినిమా టికెట్లు అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించినా.. బ్లాక్ మార్కెట్ చేసినా అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. టికెట్ రేట్ల‌పై క‌లెక్ట‌ర్ల‌దే తుది నిర్ణ‌యం కానుంది. అలాగే థియేట‌ర్ల‌లో తినుబండారాలు కూల్ డ్రింక్స్ స‌హా ప్ర‌తిదీ నిర్ధిష్ఠ ధ‌ర దాటితే సోదాల్లో దొరికితే ఫైన్ లు వేస్తున్నారు. ఇక థియేటర్ల‌కు ప‌న్నులు.. టాయ్ లెట్ల నిర్వ‌హ‌ణ‌.. ఆక్సిజ‌న్ నిర్వ‌హ‌ణ వంటి అంశాల‌పైనా అధికారులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. బ‌హుశా 90ఏళ్ల టాలీవుడ్ హిస్ట‌రీలో ఏ ప్ర‌భుత్వం సినీప‌రిశ్ర‌మ‌పైనా థియేట‌ర్ల‌పైనా ఇంత‌గా దృష్టి సారించింది లేద‌ని ఎగ్జిబిట‌ర్లు వాపోతున్నారు.

అస‌లే క‌రోనా క‌ష్ట‌కాలంలో తీవ్రంగా న‌ష్ట‌పోతే ఇప్పుడు మండ‌ల జిల్లా స్థాయి అధికారులు థియేట‌ర్ల‌లో ప్ర‌వేశించి వీరంగం వేయ‌డం షాకిస్తోంద‌ని ఎగ్జిబిట‌ర్స్ వాపోతున్నారు. కొన‌సాగుతున్న వివాదంపై ప్ర‌స్తుతం కోర్టులో వ్యాజ్యం న‌డుస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన టిక్కెట్ల ధరల తగ్గింపు జీవో పైన ఈ రోజున హైకోర్టులో విచారణ ఉంది. కోర్టు విచారణ.. మార్గదర్శకాలకు అనుగుణంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఈ సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేసారు.

టిక్కెట్ ధరల ఖరారు పైన జిల్లా జాయింట్ కలెక్టర్లకు అధికారం అప్పగించారు. ధియేటర్లలో నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున అధికారులు సోదాలు నిర్వహించ‌డంతో అస‌లు లొసుగు బ‌య‌ట‌ప‌డుతోంది. దీనిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు.. తూర్పు గోదావ‌రి జిల్లాలో ప‌లు థియేట‌ర్ల‌ను అధికారులు సోదాలు చేయ‌గా యాజ‌మాన్యాలే స్వ‌చ్ఛందంగా బంద్ పాటించార‌ని తెలిసింది. దాదాపు ఈ ఒక్క జిల్లాలో ఏకంగా 50 పైగా థియేట‌ర్ల‌ను మూసి వేశార‌ని టాక్ వినిపిస్తోంది. థియేట‌ర్ల ఆక‌స్మిక త‌నిఖీలే దీనికి కార‌ణం. మ‌రోవైపు క్రిష్ణా జిల్లాలో ఏకంగా 12 సినిమా హాళ్లను సీజ్ చేసారని క‌థ‌నాలొస్తున్నాయి.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లోని థియేటర్లను ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేయ‌డ‌మే గాక అధికారులు.. పలు ప్రాంతాల్లో థియేటర్లకు వెళ్లి జరిమానాలు విధించార‌ని తెలిసింది. థియేట‌ర్ల‌లో ఎక్క‌డా తేడాలు ఉన్నా అధికారులు అస‌లు క్ష‌మించ‌డం లేదు. దీంతో ఎగ్జిబిట‌ర్లు అంతా తీవ్రంగా ఖంగు తింటున్నార‌ని తెలిసింది.

మునుముందు భారీ చిత్రాలు విడుద‌ల కానున్నాయి. సంక్రాంతికి పాన్ ఇండియా రిలీజ్ ల టెన్ష‌న్ నిలువ‌నీయ‌డం లేదు. టికెట్ ధ‌ర‌ల‌పై కోర్టు వ్యాజ్యంలో అంతిమ తీర్పు ఎలా ఉండ‌నుందో వేచి చూడాల్సి ఉంది. త‌దుప‌రి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో మంత‌నాలు సాగించేందుకు థియేట‌ర్ల యాజ‌మాన్యం స‌మావేశం నిర్వ‌హించ‌నుంది.

చిన్నా పెద్దా నిర్మాత‌లు సైతం వీరితో జ‌త‌క‌లుస్తార‌ని తెలిసింది. మునుముందు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తూ వార్ న‌డిపించ‌డ‌మా లేదా మాట్లాడి తేల్చుకోల‌నుకుంటారా? అన్న‌దానికి కొద్దిరోజుల్లోనే క్లారిటీ రానుంది. ఇవాళ విజ‌య‌వాడ‌లో జ‌ర‌గాల్సిన ఎగ్జిబిట‌ర్ల స‌మావేశం శుక్ర‌వారానికి వాయిదా ప‌డిందని తెలిసింది.