Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: లాక్ డౌన్ తో కోమాలో బాక్సాఫీస్

By:  Tupaki Desk   |   1 July 2020 4:15 AM GMT
ట్రెండీ టాక్‌: లాక్ డౌన్ తో కోమాలో బాక్సాఫీస్
X
మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ వ‌ల్ల వినోద‌ ప‌రిశ్ర‌మ‌ల‌కు అంతా ఇంతా న‌ష్టం కాదు. ఓ అంచ‌నా ప్ర‌కారం.. టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లు తీవ్రంగానే న‌ష్ట‌పోయాయి. తొలి వంద‌రోజుల‌ లాక్ డౌన్ వ‌ల్ల ఒక్కో ప‌రిశ్ర‌మ‌కు కేవ‌లం రిలీజ్ కాని సినిమాల వ‌ల్ల 300-1000 కోట్ల మ‌ధ్య‌ న‌ష్టం వాటిల్లింద‌ని అంచ‌నా. తెలుగు చిత్ర‌సీమ‌లో దాదాపు 20 సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. దాని వ‌ల్ల 300-500 కోట్ల న‌ష్టం అంచ‌నా. స‌వ్యంగా రిలీజైతే ఆ మొత్తం ఈపాటికే వెన‌క్కి వ‌చ్చేది.

ఇక‌పోతే హిందీ చిత్ర‌సీమ‌లో చెప్పుకో ద‌గ్గ సినిమాల రిలీజ్ లు నిలిచి పోయాయి. దీని వ‌ల్ల ఏకం గా 700-1000 కోట్ల మేర న‌ష్టం జ‌రిగి ఉంటుంద‌ని అంచ‌నా. ఆ మేర‌కు రెవెన్యూ లాస్ త‌ప్ప‌లేదు. దాదాపు 10 సినిమాలు రిలీజ్ బ‌రిలో ఉండ‌గా ఏదీ రిలీజ్ కి నోచుకో లేదు. వీటిలో కిలాడీ అక్షయ్ కుమార్ న‌టించిన ‘లక్ష్మీ బాంబ్’ దాదాపు 200 కోట్లు వ‌సూలు చేసే స‌త్తా ఉన్న సినిమా. అజయ్ దేవగన్ - సంజయ్ దత్ నటించిన వార్-యాక్షన్ డ్రామా ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన క్రేజీ చిత్రం. ఇది కూడా దాదాపు 150 కోట్లు పైగా వ‌సూళ్లు తెచ్చే సినిమా.

సుశాంత్ సింగ్ న‌టించిన `దిల్ బెచారా` బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యి ఉండేద‌ని అంచ‌నా. యంగ్ హీరో ఆక‌స్మిక మ‌ర‌ణంతో అభిమానులు తీవ్ర నిరాశ‌లోకి వెళ్లిపోయారు. అత‌డు న‌టించిన చిట్ట‌ చివ‌రి సినిమాగా అది బాక్సాఫీస్ వ‌ద్ద కాసులు కురిపించి ఉండేద‌ని అంచ‌నా. ఇది సెంటిమెంటు గా వ‌ర్క‌వుట‌య్యేది.

‘గుంజన్ సక్సేనా’.. ‘ఖుదా హఫీజ్’.. ‘ది బిగ్ బుల్’.. ‘శంకుంతల దేవి’.. ‘లూట్ కేస్’.. ‘సడక్ 2’.. త‌దిత‌ర చి‌త్రాలు రిలీజ్ బ‌రిలో ఉన్నాయి. ఎవ‌రికి వారు స‌క్సెస్ పై ధీమాగా ఉన్నారు. ఇవ‌న్నీ స‌వ్యంగా థియేట్రిక‌ల్ రిలీజ్ అయితే దాదాపు 1000 కోట్ల మేర బాలీవుడ్ బాక్సాఫీస్ ఆర్జించేది. కానీ మ‌హ‌మ్మారీ అంద‌రి ఆశ‌లను అడియాశ‌లే చేసింది. బాలీవుడ్ తో పాటు .. కోలీవుడ్.. మాలీవుడ్.. శాండ‌ల్వుడ్ కి తీవ్ర న‌ష్టాలు త‌ప్ప‌లేదు. ‌