Begin typing your search above and press return to search.

ఫ్లాష్‌: `మా` ఆర్టిస్టుల‌కు 7,500 పెన్ష‌న్‌

By:  Tupaki Desk   |   8 March 2019 7:25 AM GMT
ఫ్లాష్‌: `మా` ఆర్టిస్టుల‌కు 7,500 పెన్ష‌న్‌
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు వేడెక్కిస్తున్నాయ్. శివాజీ రాజా ప్యానెల్, సీనియ‌ర్ న‌రేష్ ప్యానెల్ మ‌ధ్య వార్ పీక్స్ కి చేరుకుంది. ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ ఆర్టిస్టుల‌కు సేవ‌లందించేందుకు ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. ప‌లు ర‌కాల సంక్షేమ ప‌థ‌కాల్ని ప్ర‌క‌టిస్తున్నారు. అయితే ఆ ఇద్ద‌రిలో శివాజీ రాజా ఆర్టిస్టుల‌కు గుప్పిస్తున్న వ‌రాలు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. నిన్న‌టి సాయంత్రం హైద‌రాబాద్ ఎఫ్ ఎన్‌ సీసీలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో న‌రేష్ త‌న‌ని దారుణంగా అవ‌మానించార‌ని ఆరోపించిన శివాజీ రాజా ఆర్టిస్టుల ముందే క‌ళ్ల‌నీళ్ల ప‌ర్యంతం అవ్వ‌డం సంచ‌ల‌న‌మైంది. తాను ఊరు వ‌దిలి వెళ్లిపోయేందుకు సిద్ధ‌మ‌య్యాన‌ని.. త‌మ కుటుంబం అరుణాచ‌లం వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని, అయితే ఆర్టిస్టులంతా త‌న‌ని కావాల‌ని అనుకోవ‌డం వ‌ల్ల‌నే మ‌ళ్లీ మా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నాన‌ని లేక‌పోతే అస‌లు ప‌ద‌వి త‌న‌కు అవ‌స‌ర‌మే లేద‌ని అన్నారు.

ఇదంతా ఒకెత్తు అనుకుంటే.. మూవీ ఆర్టిస్టుల స‌మ‌స్య‌ల్ని తెలుసుకునేందుకు 24 శాఖ‌లు కొలువుండే చిత్ర‌పురి కాల‌నీకి వెళ్లిన‌ప్పుడు చిన్నా చిత‌కా ఆర్టిస్టుల సాధ‌క బాధ‌కాలు త‌న‌కు అర్థ‌మ‌య్యాయ‌ని శివాజీ రాజా తెలిపారు. ఆర్టిస్టుకు ఆర్నెళ్లు ప‌ని ఉంటే ఆర్నెళ్లు ఉండ‌దు. ఆ టైమ్ లో తిండికి కూడా క‌ష్టం అవుతుంది. ప‌లువురు ఆర్టిస్టుల జీవితాల్లోకి తొంగి చూసిన‌ప్పుడు వారి స‌మ‌స్య‌లు బాగా అర్థ‌మ‌య్యాయ‌ని తెలిపారు. తాను కూడా ఆ ద‌శ నుంచే వ‌చ్చాన‌ని అన్నారు. అందుకే ఆర్టిస్టుల వెత‌లు తెలిసిన‌వాడిగా .. కళాకారుల్లో వృద్ధుల‌కు ఇక‌పై రూ.7500 ఫించ‌ను (పెన్ష‌న్) ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఉన్న రూ.5000 ఫించ‌ను స్థానంలో అద‌నంగా రూ.2500 పెంచి మొత్తం రూ.7500 ఫించ‌ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించామ‌ని వెల్ల‌డించారు. అంతేకాదు.. సినిమా అవ‌కాశాలు లేక ఇబ్బందులు ప‌డే ఆర్టిస్టులు `మా` సంఘంలో ఉన్నారు. దాదాపు 800 మంది ఆర్టిస్టుల్లో అంద‌రూ బ‌డా ఆర్టిస్టులేం కాదు. అందులో తిండికి లేక ఇబ్బంది ప‌డే కుటుంబాలు ఉన్నాయి. వారిని ఆదుకుంటామ‌ని శివాజీ రాజా అన్నారు.

ఆరు నెల‌లకు స‌రిప‌డా ఆహార ఉత్ప‌త్తుల (గ్రాస‌రీస్)ను ప‌ని కోల్పోయిన‌ 50 మంది క‌ళాకారుల‌కు పంచాల‌ని నిర్ణయించుకున్నామ‌ని శివాజీ రాజా ప్ర‌క‌టించారు. పెంచిన పెన్ష‌న్ తో పాటు గ్రాస‌రీస్ న‌టీన‌టుల‌ను ఆదుకుంటాయ‌ని అన్నారు. పేద క‌ళాకారుల్ని దృష్టిలో ఉంచుకుని శివాజీ రాజా ప్యానెల్ ఇలాంటి హీటెక్కించే ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. రూ.7500 పెన్ష‌న్ అంటే ప్ర‌భుత్వాలే ఇవ్వ‌లేనివి. మా అసోసియేష‌న్ విద్యాల‌క్ష్మి, క‌ళ్యాణ ల‌క్ష్మి ప‌థ‌కాల‌కు పెన్ష‌న్ స్కీమ్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా మారింద‌ని మాట్లాడుకున్నారంతా. ప్ర‌భుత్వ‌మే అంత ఇవ్వ‌దు క‌దా? మా ఎన్నిక‌ల వేడిలో వేడెక్కించేందుకే ఈ ప్ర‌క‌ట‌న చేశారా? అంటూ మాట్లాడుకున్నారు. ప్ర‌త్య‌ర్థికి ధీటుగా న‌రేష్ ప్యానెల్ ఎలాంటి వ‌రాల్ని ప్ర‌క‌టిస్తారో చూడాలి.. ఇంకో 48 గంట‌లే స‌మ‌యం ఉంది కాబ‌ట్టి ఇరు ప్యానెల్స్ ప్ర‌చారం హోరెత్తుతున్న సంగ‌తి తెలిసిందే.