Begin typing your search above and press return to search.

800 ఆర్టిస్టుల‌ ప‌రువు న‌డి బ‌జారుకి!!

By:  Tupaki Desk   |   18 March 2019 11:23 AM GMT
800 ఆర్టిస్టుల‌ ప‌రువు న‌డి బ‌జారుకి!!
X
800 మంది ఆర్టిస్టుల ప‌రువు న‌డి బ‌జారుకెక్కుతోందా? మూవీ ఆర్టిస్టుల సంఘంలో వివాదం.. ముప్పిరి గొల‌ప‌ని ముప్పులా అంత‌కంత‌కు చాప కింద నీరులా పాకిపోతోందా? అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. `మా`లో అస‌లేం జ‌రుగుతోంది? ఎంతో హుందాగా సాగాల్సిన కాపురం కాస్తా క‌ల‌త‌ల కాపురంగా మారి మొగుడు పెళ్లాల గొడ‌వ‌ల్లా ఎందుకింత ర‌చ్చవుతోంది? క‌ట్ట తెగిన ప్ర‌వాహంలా ప్ర‌మాద‌క‌రంగా మారుతున్నా వినోదం చూస్తూ పెద్ద‌లు ఊరుకుంటున్నారేం? అస‌లు దీనిని ఆపేవాడే లేడా? అంటే .. ఈ స‌న్నివేశం అలానే క‌నిపిస్తోంది.

ఒక‌సారి ఈయ‌న‌.. ఇంకోసారి ఆయ‌న ప్రెస్ మీట్లు పెట్టి `మా` ప‌రువు మ‌ర్యాద‌ను గంగ‌లో క‌లిపేస్తార‌ట‌. పాత అధ్య‌క్షుడు, కొత్త అధ్య‌క్షుడు ఇద్ద‌రిదీ అదే బాట‌. ఆయ‌న ప‌రువు తీశాడు స‌రే.. ఈయ‌నైనా కాపాడ‌తాడా? అంటే అక్క‌డ ఆ సీనేం క‌నిపించ‌డం లేదు. ఇద్ద‌రి మ‌ధ్యా రాజీ బేరం లేదు. త‌గ్గేది లేదు. నువ్వా నేనా? అంటూ వ‌ర్గ పోరు కొన‌సాగుతూనే ఉంది. మా హాట్ సీటులో కూచోవాల‌న్న త‌హ‌త‌హ‌తో ఒక వ‌ర్గం, అబ్బే కాస్త వెయిట్ చేయించాలి! అంటూ ఇంకో వ‌ర్గం .. అస‌లేంటి ఈ గొడ‌వ‌. నిన్న న‌రేష్ - జీవిత వ‌ర్గం త‌మ‌ ప్ర‌త్య‌ర్థిని మీడియా ముఖంగా తిట్టారు. రేపు శివాజీ రాజా మీడియా మీట్ అంటూ తిట్టేందుకు రెడీ అవుతున్నారు. అస‌లిదంతా ఏంటి? ఇది ప‌రువు గ‌ల వాళ్లు చేసే ప‌నేనా?

శివాజీ రాజా, న‌రేష్ ల‌ వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌గా దీనిని ప‌రిగ‌ణించాలా దీనిని?! అస‌లేమ‌ని అర్థం చేసుకోవాలి? కేవ‌లం ఇద్ద‌రి మ‌ధ్య వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు వ్య‌వ‌స్థ‌ను చిన్నా భిన్నం చేసేలా? కార్మికుల స‌మ‌స్య‌ల్ని జ‌ఠిలం చేసేలా ఉన్నాయ‌ని ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక ఆర్టిస్టుల ప‌థ‌కాల అమ‌లు కానీ, లేదా ఇన్సూరెన్స్ వంటి కీల‌క‌మైన ప‌నుల్లో కానీ ప్ర‌స్తుత గొడ‌వ‌ల‌తో సాధ్య‌మ‌య్యే ప‌నేనా? సొంత బిల్డింగ్ క‌ట్టేస్తామ‌ని బీరాలు పోవ‌డ‌మేనా? ఇలా అయితే నిధి సేక‌ర‌ణ ఎలా చేస్తారు? కొట్టాడుకుంటూ వీళ్లు సొంత భ‌వంతి నిర్మిస్తారా? ఇదేం పెద్ద‌రికం? అంటూ ప‌లువురు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అస‌లింత‌కీ ఆపాల్సిన చిరంజీవి, మోహ‌న్ బాబు వంటి పెద్ద‌లు ఏం చేస్తున్నారో? అంటూ ఆర్టిస్టుల్లో చ‌ర్చ సాగుతోంది. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కంటి సైగ‌తో ఆపేవాడు లేక వెన‌క నుంచి క‌థ‌లు న‌డిపించే పెద్ద‌ల‌తో ప‌ని కాక `మా` ప‌రువు ఇప్పుడు న‌డి బ‌జారులోనే ఉంది. దాస‌రి త‌ర్వాత అదుపులో పెట్టేవారే లేక‌పోయారా? అంటూ 800 మంది ఆర్టిస్టుల‌తో పాటు ప‌రిశ్రమ 24 శాఖ‌ల్లో దీనిపై వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.