Begin typing your search above and press return to search.

బయోపిక్ కాదు.. ఎపిక్

By:  Tupaki Desk   |   14 Oct 2020 4:00 AM GMT
బయోపిక్ కాదు.. ఎపిక్
X
ఒక విదేశీయుడి గురించి ఇండియాలో ఒక సినిమా తెరకెక్కడం అంటే విశేషమే. అది కూడా ఒక క్రీడాకారుడిది కావడం మరీ విశేషం. ఆ గౌరవం దక్కించుకున్నది శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్. టెస్టు క్రికెట్ చరిత్రలో మరే బౌలర్‌ కూ సాధ్యం కాని విధంగా 800 వికెట్ల మైలురాయిని అందుకున్న ఘనుడు మురళీ ధరన్. విచిత్రమైన బౌలింగ్ శైలితో, తిరుగులేని టర్న్‌తో మహా మహా బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరి బిక్కిరి చేసిన ప్రత్యేకమైన ఆఫ్ స్పిన్నర్‌ మురళీధరన్. ఈ శ్రీలంక క్రికెటర్.. చెన్నై అమ్మాయినే పెళ్లి చేసుకోవడం విశేషం. అతను శ్రీలంకలో స్థిర పడ్డ తమిళ కుటుంబానికి చెందినవాడు. మురళీధరన్ టెస్టు వికెట్లనే టైటిల్‌గా పెట్టి ‘800’ పేరుతో తమిళంలో అతడి బయోపిక్ తీస్తున్నారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మురళీధరన్‌గా కనిపించనుండటం ఈ సినిమాకు సంబంధించి అతి పెద్ద విశేషం. శ్రీపతి దర్శకత్వంలో వివేక్ రంగాచారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

తాజాగా ‘800’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఈ సినిమా కథేంటన్నది చూచాయిగా చెప్పేశారు. మురళీధరన్ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలన్నీ ఇందులో చూపించారు. చిన్నతనంలో మురళీ పిల్లలతో కలిసి క్రికెట్ ఆడటంతో మొదలుపెట్టి అతను 800 వికెట్ల మైలురాయిని అందుకునే వరకు ముఖ్య ఉదంతాల్ని బొమ్మల రూపంలో చూపించారు. మురళీధరన్ తండ్రి హత్యకు గురైనట్లు ఇందులో చూపించడంతో తన జీవితంలో అంత పెద్ద విషాదం ఉన్న సంగతి వెల్లడైంది. సినిమాలో సెంటిమెంట్ టచ్ కూడా ఉంటుందనడానికి ఇది సూచిక.

ఇక మురళీ బౌలర్‌గా మంచి పేరు సంపాదించాక అతడి బౌలింగ్ త్రో అంటూ ఆరోపణలు రావడం, అవమానాలు ఎదురుకావడం.. ఆస్ట్రేలియా అంపైర్ డారెల్ హైర్ వరుస బెట్టి నోబాల్స్ ఇవ్వడం.. తర్వాత ఐసీసీ మురళీ ధరన్ శరీరం మొత్తానికి యంత్రాలు అమర్చి తన బౌలింగ్ శైలిని పరీక్షించడం.. పాకిస్థాన్ పర్యటనలో మురళీధరన్ ఉన్న జట్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం లాంటి ముఖ్య ఘట్టాలన్నీ ఈ మోషన్ పోస్టర్లో చూపించారు. చివరగా మురళీధరన్‌ ను, అతడిలా మారిన సేతుపతిని చూపించాడు. ఫస్ట్ లుక్‌ తో వావ్ అనిపించేశాడు సేతుపతి. అతడి మేకోవర్ అదిరిపోయింది. ఈ మోషన్ పోస్టర్ చూశాక ఈ బయోపిక్.. ఎపిక్ అవుతుందన్న అభిప్రాయం కలుగుతోంది.