Begin typing your search above and press return to search.

మరో కాపీ.. స్నేహితుడని నమ్మితే వెన్నుపోటు!

By:  Tupaki Desk   |   2 Nov 2018 7:24 AM GMT
మరో కాపీ.. స్నేహితుడని నమ్మితే వెన్నుపోటు!
X
ఈమద్య కాలంలో కథ కాపీ వివాదాలు చాలా కామన్‌ అయ్యాయి. పెద్ద సినిమాలన్నీ కూడా ఏదో విధంగా వివాదాలను మూట కట్టుకుంటూనే ఉన్నాయి. తాజాగా తెలుగులో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం కథ గురించి వివాదం చెలరేగగా అది పెద్దగా ముదరలేదు. ఇక తమిళ స్టార్‌ హీరో విజయ్‌ - మురుగదాస్‌ ల కాంబినేషన్‌ లో తెరకెక్కిన ‘సర్కార్‌’ చిత్రం కథ విషయంలో పెద్ద ఎత్తున వివాదం జరిగింది. మద్రాసు హైకోర్టు వరకు వెళ్లడంతో సినిమా విడుదల ఆగిపోయే పరిస్థితి వచ్చిందట. దాంతో దర్శకుడు మురుగదాస్‌ రాజీకి ఒప్పుకున్నాడు. సర్కార్‌ కథ వివాదం ముగిసిందో లేదో వెంటనే ‘96’ వివాదం మొదలైంది.

తమిళనాట ఇటీవలే తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘96’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. విజయ్‌ సేతుపతి మరియు త్రిష జంటగా నటించిన ఆ చిత్రం సక్సెస్‌ అయిన నేపథ్యంలో దిల్‌ రాజు తెలుగులో రీమేక్‌ చేసేందుకు రైట్స్‌ ను దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ చిత్రం కథ తన శిష్యుడిది అంటూ ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా మీడియా ముందుకు వచ్చాడు.

భారతి రాజా శిష్యుడు సురేష్‌ ఈ కథను కొన్ని సంవత్సరాల క్రితం రాసుకున్నాడట. అప్పట్లోనే సురేష్‌ తన మిత్రుడు అయిన మరుధ పాండియన్‌ తో కథను షేర్‌ చేసుకున్నాడట. కథ విని బాగుందన్న మధుర పాండియన్‌ ఆ స్టోరీ లైన్‌ ను ప్రేమ్‌ కుమార్‌ కు వినిపించాడని - ప్రేమ్‌ కుమార్‌ ‘96’ పేరుతో ఆ చిత్రాన్ని తెరకెక్కించాడంటూ భారతీ రాజా అంటున్నాడు. మధుర పాండియన్‌ ను సురేష్‌ స్నేహితుడు అని నమ్మి కథ చెబితే అతడు సురేష్‌ కు వెన్ను పోటు పొడిచాడు.

‘96’ చిత్రం టైటిల్‌ కార్డ్స్‌ లో మరుధ పాండియన్‌ కు కృతజ్ఞతలు అంటూ వేయడంతో మాకు అనుమానం మొదలైందని, కాస్త లోతుగా విచారిస్తే అసలు విషయం మాకు తెలిసిందని ఈ సందర్బంగా భారతీ రాజా అంటున్నాడు. ఈ విషయమై తాము చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నట్లుగా భారతి రాజా అన్నారు.

ఈ వివాదంపై దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘96’ చిత్రం మనుషుల భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది. అలాంటి ఆలోచన ఎవరికైనా రావచ్చు. నాకు అదే విధంగా వచ్చింది. దీంతో కాపీ అనే ప్రసక్తే లేదు. నేను వారిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ ప్రకటించాడు.