Begin typing your search above and press return to search.

తెలుగు '96' వచ్చేది అప్పుడేనా?

By:  Tupaki Desk   |   25 Nov 2019 5:28 AM GMT
తెలుగు 96 వచ్చేది అప్పుడేనా?
X
తమిళంలో సెన్షేషన్‌ విజయాన్ని సొంతం చేసుకున్న '96' ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. శర్వానంద్‌ హీరోగా సమంత హీరోయిన్‌ గా రూపొందుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళ వర్షన్‌ కు డైరెక్ట్‌ చేసిన ప్రేమ్‌ కుమార్‌ తెలుగు రీమేక్‌ కు కూడా డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఇప్పటికే సమంత తన షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేశానంటూ ప్రకటించింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్యాచ్‌ వర్క్‌ మినహా ఇతర షూటింగ్‌ కూడా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.

ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేస్తారంటూ అప్పుడు వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం 96 రీమేక్‌ ను ప్రేమికుల దినోత్సవం సందర్బంగా ఒక వారం ముందే విడుదల చేయబోతున్నారట. ఫిబ్రవరి 7వ తారీకున ఈ చిత్రంను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ప్రేమికుల రోజున విజయ్‌ దేవరకొండ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకు ముందే 96 రీమేక్‌ విడుదలకు సిద్దం అవుతోందట.

ఒక విభిన్నమైన కథాంశంతో ప్రతి ఒక్కరు కనెక్ట్‌ అయ్యే నేపథ్యంతో రూపొందిన తమిళ 96 చిత్రం గత ఏడాది సూపర్‌ హిట్‌ అయ్యి టాప్‌ చిత్రాల జాబితాలో నిలిచింది. టీవీలో వచ్చిన తర్వాత కూడా థియేటర్లలో సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి అంటే సినిమా ఏ స్థాయిలో ఆడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు అదీ శర్వా మరియు సమంత నటించబోతున్నారు అనగానే అప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి.

సినిమా షూటింగ్‌ శరవేగంగానే జరుపుతున్నట్లుగా ప్రచారం జరిగినా విడుదల విషయంలో మాత్రం జాప్యం జరిగింది. మొత్తానికి ఫిబ్రవరి 7న ప్రేమికుల రోజుకు ముందే ఈ రీమేక్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. విడుదల తేదీ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.