Begin typing your search above and press return to search.

చిన్న సినిమాల‌కు బ్యాడ్ సీజ‌న్‌

By:  Tupaki Desk   |   23 April 2018 11:30 PM GMT
చిన్న సినిమాల‌కు బ్యాడ్ సీజ‌న్‌
X
వేస‌విలో సినీ జ‌నాల‌కు పండ‌గే. వ‌రుస పెట్టి సినిమాలు విడుద‌ల‌కు ఉండ‌డంతో ప్ర‌తి రెండు వారాల‌కోసారి కొత్త సినిమా చూసే అవ‌కాశం ఉంది. రంగ‌స్థ‌లంతో మొద‌లైన సినిమా పండ‌గ జూన్ నెల వ‌ర‌కు కొన‌సాగుతుంది. అన్నీ వ‌రుస‌పెట్టి పెద్ద సినిమాలే కావ‌డంతో స్టార్ హీరోల అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ఇక మ‌ధ్య‌లో చిన్న సినిమాల సంగ‌తి అగ‌మ్య‌గోచ‌రంగా ఉంది. థియేట‌ర్లు లేక పెద్ద సినిమాల‌తో పోటీ ప‌డ‌లేక విడుద‌ల ఎప్పుడో చేయాలో తెలియ‌క తిక‌మ‌క‌లో ఉన్నాయి.

మార్చి 30న రంగ‌స్థ‌లం విడుద‌లైంది. రంగ‌స్థ‌లం గాలి గ‌ట్టిగానే వీచింది. విడుద‌లైన 20 రోజులు దాటినా ఇంకా థియేట‌ర్లు కిట‌కిట‌లాడుతున్నాయి. ఈ లోపే మ‌రో పెద్ద సినిమా భ‌ర‌త్ అను నేను విడుద‌లైంది. అది కూడా సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రంగ‌స్థ‌లం భ‌ర‌త్ సినిమాలు రెండూ బాగానే పిండుకుంటున్నాయి. మ‌రొక్క వారం రోజులు ఆగితే నా పేరు సూర్య సినిమా మే 4న విడుద‌లైపోతుంది. ఆ త‌రువాత మ‌రో అయిదు రోజుల‌కే మే 9న మ‌హాన‌టి విడుద‌ల‌వుతుంది. అలాగే మే 11 పూరీ సినిమా మెహ‌బూబా విడుద‌ల‌వుతుంది. ఈ మ‌ధ్య‌లోనే రాజు గాడు అమ్మ‌మ్మ‌గారిల్లు వంటి చిన్న సినిమాలు విడుద‌ల‌కు ఉన్నాయి. మ‌హాన‌టి నాపేరు సూర్య సినిమాలు గానీ హిట్ కొడితే అప్పుడు విడుద‌ల‌య్యే చిన్న సినిమాలకు ధియేట‌ర్లు ద‌క్క‌వు.

మే 18న విజ‌య్ దేవ‌ర‌కొండ ట్యాక్సీ వాలా సినిమా ఉంది. అది చిన్న సినిమాల జాబితాలోకే వ‌చ్చినా విజ‌య్‌కు కాస్త పాపులారిటీ ఉంది క‌నుక వారికి థియేట‌ర్లు ద‌క్కే అవ‌కాశం ఉంది. ఆ సినిమా రోజే రాజు గాడు అమ్మమ్మ‌గారిల్లు సినిమాలు విడుద‌ల చేయ‌డం కాస్త అసాధ్య‌మే. మే 24 న నేల టిక్కెట్ 25న నాగ్ న‌టించిన ఆఫీస‌ర్ సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. క‌ళ్యాణ్ రామ్ న‌టించిన నా నువ్వే సినిమా కూడా మే చివ‌రి వారంలోనే ఉంది క‌నుక ఇక ఆ నెల‌లో చిన్న సినిమాల‌కు చోటు ద‌క్క‌న‌ట్టే.

జూన్ వ‌ర‌కు వెళితే ఏడో తేదీనా కాలా సినిమా విడుద‌ల‌కు ఉంది. అది పెద్ద సినిమానే దానితో ఢీ కొట్టే ధైర్యం చిన్న సినిమాల‌కు లేదు. జూన్ లోనే స‌వ్య‌సాచి పంతం నితిన్ శ్రీనివాస క‌ళ్యాణం వంటి సినిమాలు ఉన్నాయి. ఇవి కూడా వ‌ర‌స పెట్టి విడుద‌ల‌వుతున్నాయి. మ‌రి రాజు గాడు అమ్మ‌మ్మగారిళ్ల ప‌రిస్థితి ఏంటో? స‌మ్మ‌ర్ అంతా పెద్ద సినిమాలు థియేట‌ర్ల‌ను ఆక్ర‌మించేశాయ్‌. చిన్న సినిమాల‌కు కాస్త క‌ష్ట‌కాల‌మే.