Begin typing your search above and press return to search.

హైకోర్టుకు వెళ్లిన సినిమా థియేటర్ల యజమానులకు ఊరట

By:  Tupaki Desk   |   8 Feb 2022 4:58 AM GMT
హైకోర్టుకు వెళ్లిన సినిమా థియేటర్ల యజమానులకు ఊరట
X
ఇటీవల నిబంధనల అమల్లో భాగంగా లైసెన్స్ లేదన్న కారణంతో సినిమా థియేటర్లను ఏపీ ప్రభుత్వం జప్తు చేయిస్తోంది. ఈ క్రమంలోనే కొందరు తహసీల్దార్లు ఈ పనిచేస్తున్నారు. అయితే హైకోర్టుకు వెళ్లిన సినిమా థియేటర్ల యజమానులకు ఊరట కలిగింది. లైసెన్స్ లేదన్న కారణంతో సినిమా థియేటర్ ను జప్తు చేసే అధికారం తహసీల్దార్ కు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.

ఏపీ సినిమా నియంత్రణ రూల్స్ 1970 ప్రకారం.. లైసెన్స్ జారీ చేసే అధికారి మాత్రమే సినిమా థియేటర్ ను జప్తు చేయగలరని స్పష్టం చేసింది. ఈ రూల్స్ ప్రకారం లైసెన్స్ జారీ అధికారి జాయింట్ కలెక్టర్ (జేసీ) అవుతారని తెలిపింది. అందువల్ల జేసీకి మాత్రమే సినిమా థియేటర్లను మూసివేసే అధికారం ఉందని పేర్కొంది.

తాజాగా శ్రీకాకుళం జిల్లా సోంపేటలో శ్రీనివాస మహల్ లైసెన్స్ పునరుద్ధరణ కాలేదని తహసీల్దార్ దాన్ని జప్తు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు థియేటర్ ను జప్తు చేస్తున్నట్లు తహసీల్దార్ చెప్పడాన్ని కూడా ఖండించింది. జప్తు చేసిన థియేటర్ ను తెరవాలని తహసీల్దార్ ను హైకోర్టు ఆదేశించింది.

లైసెన్స్ పునరుద్ధరణ అంశం లైసెన్స్ జారీ అధికారి ముందు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈ థియేటర్ లో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని థియేటర్ యాజమాన్యానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్స్ లేదన్న కారణంతో తమ థియేటర్ ను తహసీల్దార్ జప్తు చేయడాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస మహల్ మేనేజింగ్ పార్టనర్ సనపాల శంకరరావు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.