Begin typing your search above and press return to search.

ర‌ణ‌బీర్ సెట్ అగ్ని ప్ర‌మాదంపై ఫెడ‌రేష‌న్ విచార‌ణ‌?!

By:  Tupaki Desk   |   1 Aug 2022 5:30 AM GMT
ర‌ణ‌బీర్ సెట్ అగ్ని ప్ర‌మాదంపై ఫెడ‌రేష‌న్ విచార‌ణ‌?!
X
అగ్నిప్ర‌మాదంలో ఎవ‌రో ఒక కార్మికుడు పోయారు! కానీ 1000 మంది కార్మికులతో ప్రమాదం జరిగితే ఎలా ఉంటుందో ఊహించ‌గ‌ల‌రా? ఆరోజు ఎవ‌రూ సెట్లో లేరు కాబ‌ట్టి బ‌తికిపోయారు కానీ..! అంటూ ఇప్పుడు ర‌ణ‌బీర్ సెట్లో జరిగిన భారీ అగ్ని ప్ర‌మాదంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రణబీర్ కపూర్ - శ్రద్ధా కపూర్ జంటగా లవ్ రంజన్ దర్శకత్వం వహించిన తదుపరి చిత్రం సెట్స్ లో పనిచేస్తున్న 32 ఏళ్ల వ్యక్తి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్ర‌మాదం ఎన్.వో.సీ లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే జ‌రిగిందంటూ ప్ర‌ముఖ సంస్థ వాదిస్తోంది.

రణబీర్ కపూర్ - శ్రద్ధా జంటగా లవ్ రంజన్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం సెట్స్ లో అగ్నిప్రమాదం బాలీవుడ్ ని కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. లొకేష‌న్ లో భారీ సెట్ల‌లో బ్రోకౌట్ అనంత‌రం ద‌ట్ట‌మైన పొగ‌ల‌తో ఆ ప్రాంతం ద‌ద్ద‌రిల్లింది. ఈ ప్ర‌మాదంలో ఒకరు మరణించారు. ప్ర‌మాదం నుంచి నాయ‌కానాయిక‌లు స‌హా చాలామంది స్కిప్ కొట్టార‌న్న సంగ‌తి తెలిసిందే. స్పెయిన్ షెడ్యూల్ తరువాత ర‌ణ‌బీర్ - శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌తో కొన్ని రోజుల క్రితం ముంబైలో షూట్‌ను ప్రారంభించారు. అయితే ఈ సినిమా సెట్స్ లో పెద్ద ప్రమాదం జరగడంతో షూటింగ్ ను ఆపేయాల్సి వచ్చింది. లవ్ రంజన్ సినిమా సెట్స్ లో పనిచేస్తున్న మనీష్ దేవాషి అనే 32 ఏళ్ల వ్యక్తి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అదృష్ట‌వ‌శాత్తూ నాయ‌కానాయిక‌లు ఆ స‌మ‌యంలో అక్క‌డ లేరు.

ముంబై న‌గ‌రం అంధేరీ వెస్ట్ లోని చిత్రకూట్ మైదానంలో శుక్రవారం పెద్ద ఎత్తున పొగలు రావడం చూపరుల దృష్టిని ఆకర్షించింది. పౌర అధికారులు పిటిఐకి ఇచ్చిన వివ‌రాల‌ ప్రకారం.. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వ్యక్తి జుహులోని కూపర్ ఆసుపత్రిలో చేరినా చికిత్స స‌మ‌యంలో మరణించాడు. దీనిపై వెస్ట్రన్ ఇండియా సినీ ఉద్యోగుల ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అశోక్ దూబే మాట్లాడుతూ.. సెట్ లైటింగ్ వర్క్ చేస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయిని తెలిపారు.

FWICE జనరల్ సెక్రటరీ మీడియాతో మాట్లాడుతూ-``ఈ సంఘటన జరిగినప్పుడు ఎటువంటి షూటింగ్ జరగలేదు. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఒక చిత్ర యూనిట్ లో 800-1000 మంది వర్కర్లు సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఒక‌వేళ‌ షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రమాదం జరిగితే? అందుకే ఇలాంటి వాటి విష‌య‌మై సరైన విచారణ జరపాలని గత 4-5 ఏళ్లుగా సీఎం అగ్నిమాపక అధికారులకు లేఖలు రాస్తున్నాం. ఈ ప్రమాదాలు పదే పదే జరుగుతున్నాయి. ఈ స్టూడియో ఫ్లోర్ ను నిర్మించిన వ్యక్తి గోరేగావ్ వెస్ట్ లోని బంగూర్ నగర్ ప్రాంతంలో గ‌తంలో బూడిదగా మారిన మరో రెండు స్టూడియోలను నిర్మించాడు. మేము ఇప్పుడు నిర్మాతల విభాగానికి లేఖ రాస్తున్నాము. వారు ఫైర్ ఆడిట్ చేయాలనుకుంటున్నారు. స్టూడియో ఫ్లోర్ లను బుక్ చేయడానికి ముందే ఇది జరిగింది.

ఫైర్ ఆడిట్ NOC లేకుండా ఇటువంటి అనధికార నిర్మాణాలను అనుమతించ‌రాద‌ని నిర్మాతలు - ప్రొడక్షన్ హౌస్ లకు ముఖ్యమంత్రికి ఫెడరేషన్ నోటీసులు జారీ చేస్తోంది. ఫైర్ ఆడిట్ - NOC లేనప్పుడు అటువంటి స్టూడియోలలో పని చేయవద్దని కార్మికులు సాంకేతిక నిపుణులను ఫెడరేషన్ కోరుతుంది`` అని అశోక్ దూబే చెప్పారు. ఘ‌ట‌న‌పై బీఎంసీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తామన్నారు.

ఈ అగ్నిప్రమాదం కారణంగా నష్టపోయిన మరో సెట్ రాజశ్రీ ప్రొడక్షన్స్ ది. చిత్ర నిర్మాతలు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. ఫెడ‌రేష‌న్ అధినేత వ్యాఖ్య‌ల ప్ర‌కారం.. ఎన్ వోసీ లేక‌పోవ‌డం అలానే రెండుసార్లు ప్ర‌మాదాలు సంభవించ‌డానికి కార‌కుడైన వ్య‌క్తి తిరిగి ఇక్క‌డా సెట్లు వేయ‌డం వంటి అంశాలు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.