Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో సినిమా అంటే ఆరేళ్లకి పైగా ఆగాల్సిందే!

By:  Tupaki Desk   |   1 May 2021 9:30 AM GMT
ప్రభాస్ తో సినిమా అంటే ఆరేళ్లకి పైగా ఆగాల్సిందే!
X
ప్రభాస్ .. ఇప్పుడు బాలీవుడ్ హీరోలను సైతం కంగారు పెడుతున్న పేరు. బడా ప్రొడ్యూసర్లను .. డైరెక్టర్లను తన చుట్టూ తిప్పుకుంటున్న పేరు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా మార్కెట్లో మంత్రంలా మ్రోగుతున్న పేరు. అలాంటి ప్రభాస్ తో ఒక సినిమా చేయాలనే ఆశ .. ఆసక్తి .. ఉత్సాహం స్టార్ డైరెక్టర్ ల నుంచి కొత్త దర్శకుల వరకూ ఉంటుంది. ఏ జోనర్లో ఏ కథను రాసుకున్నా, పాన్ ఇండియా సెట్ల మధ్య పట్టుకుని ఆయనకు కథ వినిపించడం చాలా కష్టమైన పని. ఒకప్పుడు ప్రభాస్ సినిమా తీయడం ఎంత కష్టమో .. ఇప్పుడు ఆయనకి కథ వినిపించడానికే అంత కష్టపడవలసి ఉంటుంది.

ఒకవేళ అదృష్టం బాగుండి ప్రభాస్ ని వెంటనే కలిసి కథ చెప్పే అవకాశం దొరికినా, ఆయన ఏమంటాడో తెలియదు. ఓకే అంటే మాత్రం ఆయనను కెమెరా ముందుకు తీసుకురావడానికి ఆరేళ్లకు పైనే పడుతుంది. అందుకు కారణం ఆల్రెడీ ఆయన చేతిలో ఓ నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉండటమే. గతంలో ప్రభాస్ చేసిన 'బాహుబలి' .. 'బాహుబలి 2' .. 'సాహో' పాన్ ఇండియా సినిమాలే. నిర్మాణం పరంగా ఎక్కువ సమయం తీసుకోవడం వలన అవి చాలా గ్యాప్ తో థియేటర్లకు వచ్చాయి. 'సాహో' విడుదలై కూడా దాదాపు రెండేళ్లు కావొస్తోంది .. ఇంతవరకూ 'రాధేశ్యామ్' రంగంలోకి దిగనేలేదు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ 'సలార్' చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది కనుక, విడుదల అనే మాట వచ్చే ఏడాదిలో వినవలసిందే. ఆ తరువాత ఓంరౌత్ దర్శకత్వంలో 'ఆది పురుష్' నడుస్తుంది .. ఇది రామాయణానికి దృశ్యకావ్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంతవరకూ తెరకెక్కిన పౌరాణిక చిత్రాలకి ఇది తాతలాంటిదని చెబుతున్నారు. దీని నిర్మాణానికి రెండేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. ఆ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ రూపొందనుంది. దీని కథా పరిధి చాలా విస్తృతమైనది. ఆ వెంటనే సిద్ధార్థ్ ఆనంద్ పాన్ ఇండియా ప్రాజెక్టు ఉండనే ఉంది. కనుక ఆ తరువాత సినిమా చేయాలనుకున్నవాళ్లు, ఆరేళ్లకి పైగా అలా వెయిట్ చేస్తూ ఉండవలసిందే!